అధ్యక్ష పదవి మాకొద్దు..! | Sakshi
Sakshi News home page

అధ్యక్ష పదవి మాకొద్దు..!

Published Thu, Nov 10 2016 3:15 PM

congress district president for jangaon district

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవిపై నేతల విముఖత
హోదాలో ఉండగా ఎన్నికల్లో 
పోటీ చేసే చాయిస్ లేకపోవడమే కారణం
కొత్త జిల్లాలో పోటీ తక్కువే!  
 
కొత్త జిల్లాలో.. అదీ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇలాకాలో.. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా  అధ్యక్ష పదవి ‘నాకొద్దంటే నాకొద్దని..’ నేతలు విముఖత వ్యక్తం చేస్తుండడం ఆశ్చర్యం వేస్తోంది. పదవంటే పరుగులు తీసే ఈ రోజుల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతుండటానికి కారణం లేకపోలేదు. డీసీసీ అధ్యక్ష పదవిలో ఉండగా..  ఇతర ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనే ప్రతికూలంగా మారిందని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
 
జనగామ : కొత్త జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి నియామకం ఆలస్యమవుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనవారు పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ నిబంధన పెట్టడమే దీనికి కారణంగా ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ పరిణామంతో అధ్యక్ష పదవిని చేపట్టడం కోసం ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి జిల్లా సారథ్య బాధ్యతలు అప్పగిస్తే తమ నియోజకవర్గానికే పరిమితమయ్యే అవకాశం ఉందని.. దాంతో జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతం కావడం కష్టంగా మారుతోందని యువనేత నిర్ణయం సరైనదే అనే చర్చ జరుగుతోంది. కానీ ఇది ఈ రకంగా ప్రతికూలంగా మారుతుందని ఊహిం చలేదని  పార్టీ కార్యకర్తలు అంటున్నారు.  జిల్లాల ఆవిర్భావం తర్వాత కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం పూర్తి సమయం పార్టీ కోసం పని చేసే వారికే పగ్గాలు ఇవ్వాలని భావిస్తోంది. అధ్యక్షులను ఎన్నికల సమయంలో పోటీకి దూరంగా ఉంచడం ద్వారా వారు పార్టీ టికెట్లు పొందిన అభ్యర్థుల ప్రచారాన్ని భుజాన వేసుకుంటారని ఆలోచిస్తోంది.  అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నప్పుడు అనూహ్యంగా పోటీ చేసే అవకాశం వస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్న నాయకుల నుంచి ఉత్పన్నమవుతోంది. ఈ నిబంధన వల్ల పరపతి ఉన్న నాయకులు ఎవరూ అధ్యక్ష పదవికి పోటీ పడకపోవచ్చని.. సాధారణ నాయకులకు ఆ పదవి దక్కితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. 2019లో జరగనున్న సాధారణ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభిస్తేనే అనుకూల ఫలితాలు ఉంటాయని.. దానికి అనుగుణంగానే కొత్త అధ్యక్షులను నియమించాలనే ఆలోచన ఆ పార్టీ చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న ఈ నిబంధనపై నేతలు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. 
 
పోటీ స్వల్పమే..!
ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్న నేతలు అధ్యక్ష పదవికి దూరంగా ఉంటుండటంతో డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ స్వల్పంగానే ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త జిల్లాలో తొలి అధ్యక్షుడినయ్యే అవకాశం రావడం.. పోటీ తక్కువగా ఉండటం కూడా కలిసి వస్తుందని భావనతో మరికొందరు నేతలు ఉన్నారు. కొందరు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆరాటపడుతుండగా.. మరికొందరు మనకెందుకొచ్చిన గొడవలే అని విముఖత చూపుతున్నారు. 
 
అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో..
పరిస్థితి ఎలా ఉన్నా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడినై తీరాలని సంకల్పించే నేతలు లేకపోలేదు. ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కూడా తమకు పార్టీ పదవే ముఖ్యమని భావిస్తున్న నేతలు పలువు రు ఉన్నారు. డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో డీసీసీబీ చైర్మ¯ŒS జంగా రాఘవరెడ్డి, చెం చారపు శ్రీనివాసరెడ్డి, జక్కుల వేణుమాధవ్, ధర్మపురి శ్రీనివాస్, ఎర్రమల్ల సుధాకర్, రంగు రవి, బేతి జయపాల్‌రెడ్డి ఉన్నారు. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లా కావడంతో అధ్యక్షుడి నియామకంలో ఆయన ముద్ర ఉంటుంది. పోటీ ఎక్కువగానే ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తుండడంతో నేతలు వెనక్కి తగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పార్టీ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 
 

Advertisement
Advertisement