కాసులు వద్దు.. కానుక ముద్దు! | Sakshi
Sakshi News home page

కాసులు వద్దు.. కానుక ముద్దు!

Published Sat, Dec 3 2016 12:27 PM

కాసులు వద్దు.. కానుక ముద్దు! - Sakshi

అమ్మో.. డీఎస్పీ
జన్మదిన వేడుకల్లో రింగు వద్దని గొలుసు డిమాండ్‌
ఎస్‌ఐలు, సీఐలకు మింగుడు పడని తీరు
విధిలేని పరిస్థితుల్లో సమర్పించుకుంటున్న వైనం
గోదాం యజమాని కేసులోనూ ఆరోపణలు
ఉన్నతాధికారులకు ఇప్పటికే పలు ఫిర్యాదులు
సిబ్బందిని బలి పశువులను చేయడంలోనూ దిట్టే..


మార్కెట్‌లోకి కొత్త ఫోన్​ వచ్చిందంటే చాలు.. ఆ డీఎస్పీ చేతిలో ఇమిడిపోవాల్సిందే. నాలుగు రాళ్లు వచ్చే అవకాశం ఉన్న ఏ కేసు అయినా.. ఆ అధికారి చుట్టూ తిరగాల్సిందే. పండగ.. పబ్బం.. శుభకార్యం ఏదయినా.. కింది స్థాయి సిబ్బంది కానుకలు సమర్పించుకోవాల్సిందే. అది కూడా మన ఇష్టం అనుకుంటే పొరపాటు. నచ్చకపోతే.. మరొకటి తీసుకురమ్మని ముఖం మీద చెప్పి మరీ తెప్పించుకోవడం ఈ డీఎస్పీకే చెల్లు.

కర్నూలు : నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఓ పోలీసు డివిజన్ డీఎస్పీ వ్యవహారం ఇప్పుడు ఆ శాఖలో చర్చనీయాంశమవుతోంది. నగదు రూపంలో వద్దని.. కేవలం గిఫ్టుల రూపంలోనే తనకు కానుకలు సమర్పించుకోవాలని హుకుం జారీచేయడం వివాదాస్పదమవుతోంది. కొద్దిరోజుల క్రితం జరిగిన జన్మదిన వేడుకలకు ఓ ఎస్‌ఐ రింగు తెచ్చి కానుకగా ఇవ్వగా.. తనకు గొలుసు కావాలంటూ చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు ఎస్‌ఐ మొదట తెచ్చిన రింగును వెనక్కి తీసుకెళ్లి గొలుసును సమర్పించుకున్నట్టు చర్చ జరుగుతోంది.

అంతేకాకుండా మార్కెట్‌లోకి ఏ కొత్త ఫోన్ వచ్చినా తనకు కావాలంటూ డిమాండ్‌ చేయడం.. ఎస్‌ఐలు సమర్పించుకోవడం సాధారణంగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇకపోతే ఇంట్లో ఉండే మొత్తం ఫర్నిచర్‌ అంతా కూడా ఈ విధంగా తన కింది సిబ్బందిని పురమాయించి చేయించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు డీఎస్పీ డిమాండ్లతో ఆ పరిధిలోని ఎస్‌ఐలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. డీఎస్పీ వ్యవహార శైలిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందినట్టు సమాచారం.

గోదాం యజమానికి ’చుక్కలు’..
రైతులను మోసం చేసిన గోదాము యజమాన్యం కేసులో కూడా డీఎస్పీకు బాగానే గిట్టుబాటు అయినట్లు తెలుస్తోంది. సదరు గోదాము యజమానిని డీఎస్పీ పరిధిలోని సీఐ ఒకరు భారీగా డబ్బు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై సదరు గోదాము యజమాని సీఐ మాట్లాడిన విషయం మొత్తాన్ని రికార్డు కూడా చేశారు.  ఈ వ్యవహారంలో కూడా డీఎస్పీ పాత్రపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోదాము యజమానిపై కేసు పెట్టకుండా సీఐ ద్వారా డీఎస్పీ భారీగానే డబ్బు తీసుకున్నట్టు తెలుస్తోంది.        
   
ఫిర్యాదుల పరంపర..
డీఎస్పీ వ్యవహార శైలిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. షాపింగ్‌ మొదలు సెల్‌ఫోన్ల వరకూ అన్ని వ్యవహారాలను నగదు రూపంలో కాకుండా గిఫ్టుల రూపంలో భారీగా సదరు డీఎస్పీ రాబట్టుకుంటున్న వైనాన్ని పూసగుచ్చినట్టు పలువురు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఏదైనా అవినీతి వ్యవహారం బయటపడి రచ్చ జరిగితే.. కింద ఉన్న ఎస్‌ఐ, సీఐలపై తోసి వారిని బలి పశువులను చేసి డీఎస్పీ తప్పుకుంటున్నారని కూడా సిబ్బంది వాపోతున్నారు. ఒకవేళ తన డిమాండ్లను నెరవేర్చకపోతే కిందిస్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తూ వేధిస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఈ డీఎస్పీ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు విచారణను ప్రారంభించినట్టు సమాచారం.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement