నటుడు సంతానంకు కోర్టు నోటీసులు | Sakshi
Sakshi News home page

నటుడు సంతానంకు కోర్టు నోటీసులు

Published Sun, Jun 26 2016 2:10 AM

నటుడు సంతానంకు కోర్టు నోటీసులు - Sakshi

 తమిళసినిమా: దిల్లుక్కు దుడ్డు చిత్రంతో కథానాయకుడిగా మారిన హాస్యనటుడు సంతానంకు చెన్నై సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈయనతో పాటు చిత్ర దర్శకుడు రామ్‌బాలాకు కూడా నోటీసులు అందాయి. వివరాల్లోకెళితే పేపర్ ప్లైట్ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ముహమద్ మస్తాన్ సర్భూదిన్ చెన్నై 14వ సిటీ సివిల్‌కోర్టులో సంతానంపై పిటిషన్ దాఖలు చేశారు.
 
  ఇందులో ఆయన ఆవి పరక్క ఒరు కథ అనే పేరుతో తాను చిత్రం నిర్మించ తలపెట్టానని, దీనికి దర్శకుడిగా రామ్‌బాలాను ఎంపిక చేశానని పేర్కొన్నారు. అనంతరం రామ్‌బాలాకు రూ. 11 లక్షల పారితోషికం మాట్లాడి మూడు లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు చెప్పారు. చిత్రానికి హీరోహీరోయిన్లుగా నటుడు శివ,నటి నందితలను ఎంపిక చేసి వారికీ కొంత అడ్వాన్స్ చెల్లించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
 
 అయితే షూటింగ్‌కు సిద్ధమైన తరుణంలో దర్శకుడు రామ్‌బాలా తనకు ఎలాంటి కారణం చెప్పకుండా రాలేదని తెలిపారు. నటుడు సంతానం హీరోగా నటించిన దిల్లుక్కు దుడ్డు చిత్రానికి రామ్‌బాలా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిసిందన్నారు. తన కథతో ఆ చిత్రాన్ని తీశారనీ.. దీంతో తాను సంతానంకు ఫోన్ చేసి అడగ్గా చిత్రానికి రామ్‌బాలా దర్శకుడు కాదని చెప్పారన్నారు. కాగా ఇటీవల దిల్లుక్కు దుడ్డు చిత్ర ప్రచార పోస్టర్లలో దర్శకుడిగా రామ్‌బాలా పేరును వేశారని, ఈ విషయమై మళ్లీ సంతానంను అడగ్గా నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించారని చెప్పారు.
 
 కాగా తాను తన చిత్రం కోసం రూ. 81 లక్షల వరకూ ఖర్చు చేశానని..దిల్లుక్కు దుడ్డు చిత్రం విడుదలైతే తాను చాలా నష్టపోతానని లేఖలో తెలిపారు. అందువల్ల చిత్ర విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ కేసును శుక్రవారం విచారించిన చెన్నై 14వ సిటీ సివిల్ న్యాయమూర్తి గణపతిస్వామి నటుడు సంతానం,దర్శకుడు రామ్‌బాలాలను ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేసి కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.
 

Advertisement
Advertisement