ఆన్ లైన్ మృగాడు | Sakshi
Sakshi News home page

ఆన్ లైన్ మృగాడు

Published Tue, Feb 28 2017 5:59 PM

cyber crime cases in bangalore

ఐటీ సిటీలో ఆన్ లైన్ కామాంధుల గోల అంతా ఇంతా కాదు. ఈ –మెయిల్‌ ద్వారా మహిళలను చెప్పుకోలేని విధంగా వేధిస్తూ పైశాచికానందాన్ని పొందే ఉన్మాదులూ తక్కువేం కాదు. ఇదే కేటగిరీకి చెందిన ఒక ఘరానా ఆన్ లైన్  నేరగాని వ్యవహారం ఇప్పుడు పోలీసులకు సవాల్‌ విసురుతోంది.  
 
సంస్థ వ్యవస్థాపకుని పేరుతో మహిళా ఉద్యోగులకు అసభ్య మెయిల్స్‌ 
► నీలి వెబ్‌సైట్లలో ఫోటోలు, ఫోన్ నెంబర్లు
► ఖాకీలను ఆశ్రయించిన బాధితులు  
 
సాక్షి, బెంగళూరు: నగరంలోని ఓ ప్రైవేటు సంస్థ వ్యవస్థాపకుని పేరుతో నకిలీ ఈమెయిల్‌ ఖాతా సృష్టించి సంస్థ మహిళా ఉద్యోగులకు అశ్లీల చిత్రాలు సమాచారం పంపుతూ వేధిస్తున్న ఘరానా వ్యక్తి ఉదంతం సోమవారం వెలుగుచూసింది. నగరంలోని రిచ్‌మండ్‌ సర్కిల్‌లో ఉన్న ఓ ప్రైవేటు సంస్థ వ్యవస్థాపకుని పేరుతో మూడు నెలల క్రితం
 
 
 
నకిలీ ఖాతా సృష్టించిన దుండగుడు సంస్థలో పని చేస్తున్న పది మంది మహిళా ఉద్యోగులకు అశ్లీల ఫొటోలు, సందేశాలు పంపుతున్నాడు. ముఖ్యంగా ‘లైంగిక ఉద్దీపన వస్తువులు, పుస్తకాలు, దుస్తులు మీరు ఆర్డర్‌ చేశారు. వాటిని మీకు అందజేస్తాం. మీ అడ్రస్‌ చెప్పండి’ అన్నది ఆ మెయిల్స్‌ సారాంశం. అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫొటోలు కూడా అందులో ఉండేవి. అంతటితో ఆగని దుండగుడు నీలి వెబ్‌సైట్లలో మహిళా ఉద్యోగుల ఫోటోలు, ఫోన్ నెంబర్లు పోస్ట్‌ చేసి కాల్‌గర్ల్‌గా ప్రచారం చేయడం ప్రారంభించాడు.   
 
వ్యవస్థాపకున్ని నిలదీస్తే...  
మొదట్లో నకిలీఖాతా నుంచి మెయిల్స్, సందేశాలు వస్తున్న విషయాన్ని గ్రహించలేకపోయిన బాధితులు సంస్థ వ్యవస్థాపకుణ్ని ఇదేంటని నిలదీశారు.  దీంతో మెయిల్స్, సందేశాలు చూసిన వ్యవస్థాపకుడు తన పేరుతో ఎవరో నకిలీ ఖాతా సృష్టించి ఇదంతా చేస్తున్నట్లు గ్రహించారు. దీంతో అతడు, బాధితులు కలిసి అశోక్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.   
 
తెలిసినవారి పనేనా? 
దుండగుడు బాధితుల ఫోటోలు, ఫోన్ నెంబర్లతో సహా వెబ్‌సైట్‌లలో పోస్ట్‌ చేయడాన్ని గమనించిన పోలీసులు ఇది వారికి బాగా తెలిసిన వ్యక్తి లేదా, సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి పనై ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సైబర్‌క్రైమ్‌ విభాగం సాయంతో దుండగుని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భద్రత దృష్ట్యా సంస్థ పేరును ప్రస్తుతం వెల్లడించడానికి వీలుకాదని పోలీసులు చెబుతున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement