ఉడకని పప్పు | Sakshi
Sakshi News home page

ఉడకని పప్పు

Published Sat, May 2 2015 2:13 AM

ఉడకని పప్పు

మేలురకం కందిపప్పు కిలో రూ.110 పై మాటే
హోల్‌సేల్ షాపుల్లో కూడా క్వింటాల్ కందిపప్పు రూ.10 వేలు
సామాన్యుడు కంది పప్పు రుచికి దూరమైనట్లే


బళ్లారి : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలోను ప్రతి రోజు, ప్రతి పూటకు కొంచెం పప్పు లేకుండా ముద్ద దిగని నేటి రోజుల్లో కంది పప్పు ధరలు రోజు రోజుకు పైపైకి చేరుకుంటుండటంతో సామాన్య, మధ్య తరగతి జనం అల్లాడిపోతున్నారు. గతంలో కిలో గరిష్ట ధర రూ.60లకు దాటని కందిపప్పు ప్రస్తుతం ఏకంగా  దాదాపు రెండింతలు అంటే రూ.110లకు పైగా ధరతో రిటైల్ షాపుల్లో అమ్ముతుండటంతో జనం కంది పప్పు కొనలేక, పప్పుకూర లేకుండా తినలేక నానా అవస్థలు పడుతున్నారు.

అన్ని కూరల కంటే రుచికరమైన కంది పప్పు చారు, పప్పు అంటేనే ప్రతిఒక్కరికీ నోరూరిస్తుంది. అలాంటిది కంది పప్పు కొనేందుకు అంగడికి వెళితే జనానికి కందిపప్పు ధర విని దడ పుట్టిస్తోంది. ప్రతి రోజు కంది పప్పుతో వంట చేసే వారు ప్రస్తుతం వారం, 10 రోజులైనా కందిపప్పుతో కూరలు చేయడం లేదని పలువురు మహిళలు పేర్కొంటున్నారు. కందిపప్పు కొనాలంటే భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కంది పంట పూర్తిగా తగ్గిపోవడంతో ధర భారీగా పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే వాస్తవానికి ప్రస్తుతం కంది పంట రావడం లేదు. అయితే వ్యాపారులు ముందుగానే రైతులతోతక్కువ  ధరకు కొనుగోలు చేసి నిల్వలు ఉంచుకుని ఏకంగా కంది పప్పు ధరలను పెంచినట్లు రైతులు పేర్కొంటున్నారు.

 రైతుల పొలాల్లో కంది ఉన్నప్పుడు క్వింటాల్‌కు రూ.3 వేల నుంచి రూ.4 వేల చొప్పున కొనుగోలు చేశారని, అయితే అవే కందులు ప్రస్తుతం రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా క్వింటాల్ చొప్పున అమ్ముతున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. మార్కెట్ మాయజాలంతో కందిపప్పు ధర అపారంగా పెరిగిపోవడంతో వినియోగదారులకు కొనడానికి వీలుకాకుండా పోతోంది. కేజీ కంది పప్పుకు రూ.110లు చెల్లిస్తే అందులోకి అవసరమయ్యే పచ్చి మిర్చి ధర కూడా ఆకాశాన్నంటుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పచ్చిమిర్చి, మిగతా కూరగాయల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. పప్పులోకి కావాల్సిన అన్ని రకాలు కూరగాయలు, కంది పప్పుకు భారీగా ధరలు పెరగడంతో గట్టి పప్పు కాదు నీళ్ల పప్పును కూడా వారం రోజులకొకసారి వండుకుంటామా లేదా అని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కంది పంట వచ్చే వరకు అంటే డిసెంబర్ లేదా జనవరి నెల వచ్చే వరకు ఇదే ధరతో పాటు ఇంతకన్నా భారీగా ధర పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. వర్షాలు బాగా కురిసి కంది పంట పండితే డిసెంబర్ తర్వాత కంది పప్పు ధర తగ్గే అవకాశం ఉందని సమాచారం.
 

Advertisement
Advertisement