నాన్న మాటే నా బాట | Sakshi
Sakshi News home page

నాన్న మాటే నా బాట

Published Sat, Jan 24 2015 11:00 PM

Delhi poll: Want to make promises that we can keep, says Sharmistha Mukherjee

 న్యూఢిల్లీ: తొలిసారిగా విధానసభ ఎన్నికల బరిలోకి దిగిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె శర్మిష్టముఖర్జీ... తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. కఠోర పరిశ్రమ చేయాలని, ఎంతో సహనంతో ఉండాలంటూ తండ్రి ఇచ్చిన సలహా ప్రకారమే ఆమె ముందుకు సాగుతున్నారు.  ‘రాజకీయాల్లో నువ్వు చేరిన తరుణంలో గతుకులరహదారి ముందుంది. కఠోరంగా శ్రమించడంతోపాటు ఎంతో సహనంతో ఉండాలి అని మా నాన్న చెప్పారు. ఈ మాటలను నా మనసులో ఉంచుకున్నా’ అని అన్నారు.
 
 ప్రధాన పోటీ బీజేపీతోనే...
 ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి, తమ పార్టీకి మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతోందని శర్మిష్ట పేర్కొన్నారు. ‘ఓట్లు అడిగేందుకు ప్రజల దగ్గరకు వెళ్లినపుడు వాళ్లు నన్ను ఒకే ప్రశ్న అడుగుతున్నారు. మోదీ ప్రభంజనాన్ని ఎలా తట్టుకుంటారనేదే వాళ్ల ప్రశ్న. అంతేకానీ సౌరవ్ గురించి ఎవరూ అడగడం లేదు. ఆదినుంచి ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. ఇందులో మొత్తం నాలుగు వార్డులు ఉన్నాయి. అందులో మూడింటిలో బీజేపీదే పెత్తనం. కేవలం గత ఎన్నికల్లోనే ఆప్ గెలిచింది. అందువల్ల నా వ్యక్తిగత అభిప్రాయమేమిటంటే ఈసారి తమకు, బీజేపీకి మధ్యనే ప్రధాన పోటీ జరుగుతుంది’ అని అన్నారు.
 
 కాంగ్రెస్‌ను నమ్మాల్సిన తరుణమిదే..
 కాంగ్రెస్‌లోకి ఎందుకు చేరారని మీడియా ప్రశ్నించగా ఆ పార్టీని నమ్మాల్సిన తరుణమిదేననారు. అధికారంలో ఉన్న సమయంలోనే తాను చేరవచ్చని, అయితే ఎంతోకొంత పార్టీకి చేయగలిగేదిప్పుడేనన్నారు.కాగా 49 ఏళ్ల శర్మిష్ట నగరంలోని గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన సంగతి విదితమే. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి మొత్తం ముగ్గురు సంతానం కాగా శర్మిష్ట ద్వితీయ పుత్రిక. ఆమె ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2013లో జరిగిన విధానసభ ఎన్నికల్లో గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి సౌరవ్ భరద్వాజ్ విజయకేతనం ఎగురవేశారు. సౌరవ్‌కు మొత్తం 43,907 ఓట్లు రాగా బీజేపీకి 30.005, కాంగ్రెస్‌కు 19,641 ఓట్లు లభించాయి.
 

Advertisement
Advertisement