‘జలగ’లపై సర్కారు కన్నెర్ర! | Sakshi
Sakshi News home page

‘జలగ’లపై సర్కారు కన్నెర్ర!

Published Sun, Dec 21 2014 10:03 PM

Devendra fadnavis focus on employees transfers

సాక్షి, ముంబై: ప్రభుత్వ కార్యాలయాల్లో చాలాకాలంగా ఒకే సీటుని అంటిపెట్టుకుని పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో చాలా మంది అధికారులు తమకు అనుకూలంగా ఉండే సీట్లలో యేళ్లపాటు పాతుకుపోయేందుకు యత్నిస్తారు. వారిని ఎవరైనా కదిలించాలని చూస్తే రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని మళ్లీ అదే సీటులోకి వచ్చేస్తారు. కాగా, ఇటువంటి అధికారులు అన్ని శాఖల్లోనూ పేరుకుపోతుండటంతో పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మహానగరాల్లో పనిచేయడానికి ఇష్టపడే అధికారులు, వెనుకబడిన ప్రాంతాలైన విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలకు బదిలీ చేస్తే ససేమిరా అంటారు.

తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని వాటిని నిలుపుదల చేయించుకుంటారు. కాగా, నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం చర్చకు వచ్చింది. ఇటువంటి అధికారుల విషయంలో గత ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించిందని, దాంతో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కుంటుపడిపోయాయని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ శాఖల్లో ఉన్న పనిదొంగలపై, యేళ్లపాటు ఒకేచోట అతుక్కుపోయిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నిర్ణయించారు. మొదటి విడత వేటు రెవెన్యూ శాఖపై వేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆ శాఖలో పనిచేస్తున్న 16 మంది అధికారులను విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలకు బదిలీ చేశారు. వీరందరూ కొన్నేళ్లుగా ముంబై, పుణే లాంటి నగరాల్లో బదిలీ కాకుండా నెట్టుకొస్తున్నవారే.

కాగా, రెవెన్యూ శాఖకు సంబంధించి ముంబై, పుణే వంటి నగరాలను విడిచి బయట ప్రాంతాలకు వెళ్లాలంటే అధికారులు అంతగా ఒప్పుకోరు. ఒకవేళ బదిలీ అయితే వెంటనే స్థానిక మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే వంటి వారితో ఒత్తిడి తెచ్చి రద్దు చేయించుకుంటారు. నగరాల్లో ఖాళీ లేకుండా పై ఆదాయమున్న ఇతర శాఖల్లోకి లేదా కార్పొరేషన్లకు పరస్పర బదిలీపై వెళ్లి అక్కడే స్థిరపడిపోతుంటారు. అయితే, ఇదే సమయంలో మరాఠ్వాడ, విదర్భ రీజియన్లలో అధికారుల కొరత కారణంగా ప్రజా పనులు సకాలంలో జరగడం లేదు.

ఈ విషయాన్ని నాగపూర్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కొందరు నాయకులు ఫడ్నవిస్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ముంబై, పుణేలో చిరకాలంగా తిష్టవేసిన అధికారుల జాబితా రూపొందించాలని సీఎం సూచిం చారు. ఇలాంటి అధికారులను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆదేశించారు. బదిలీ అయిన చోటికి వెంటనే వెళ్లని పక్షంలో లేదా రాజకీయ నాయకుల ఒత్తిడి తీసుకొచ్చే అధికారులపై క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement