భిన్న స్వరాలు | Sakshi
Sakshi News home page

భిన్న స్వరాలు

Published Wed, Mar 23 2016 8:36 AM

different voices in dmk party

ఆహ్వానం మాత్రమే
స్టాలిన్ వ్యాఖ్యతో గందరగోళం
అధినేత వ్యాఖ్యల వక్రీకరణ
కరుణతో జవహరుల్లా సమావేశం
వైగొ సెటైర్లు
 
డీఎండీకేతో పొత్తు వ్యవహారంగా డీఎంకేలో భిన్న స్వరాలు బయలు దేరాయి. అధినేత కరుణానిధి చర్చలు అని వ్యాఖ్యానించిన సమయంలో దళపతి స్టాలిన్ కేవలం ఆహ్వానంతో సరిపెట్టడం గందరగోళానికి దారి తీసింది. ఇదే అదనుగా డీఎంకేలో సాగుతున్న పరిణామాలపై ఎండీఎంకే నేత వైగో సెటేర్లు వేసే పనిలో పడ్డారు. ఇక తమ మద్దతు మీకే అంటూ కరుణానిధితో ఎంఎంకే నేత జవహరుల్లా భేటీ అయ్యారు.
 
చెన్నై : అధికారమే లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన రాజతంత్రాల్ని ప్రయోగించే పనిలో పడ్డారు. మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక బిజీలో ఉన్న కరుణానిధి సోమవారం మీడియా ముందుకు వచ్చారు. డీఎండీకే తమతో దోస్తీ కట్టడం ఖాయం అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, అందుకు తగ్గ చర్చలు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు.

తాను రాను బాబోయ్ ...! అంటూ, ఒంటరి..! నినాదంతో డీఎండీకే అధినేత విజయకాంత్ ముందుకు  సాగుతున్నా, డీఎంకేను టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నా, కరుణానిధికి అవి పట్టనట్టుందని, పొత్తు కోసం దిగజారినట్టున్నారన్న వ్యంగ్యాస్త్రాలు సంధించే వాళ్లు పెరిగారు. అపర  రాజకీయ మేధావి కరుణానిధి డీఎండీకే కోసం ఇంతగా ప్రాకులాడడం ఏమిటో ...? అని పెదవి విప్పే వాళ్లు పెరిగారు.
 
వ్యంగ్యాస్రాలు :  వ్యంగ్యాస్త్రాలు, పెదవి విప్పే వాళ్లు పెరిగిన సమయంలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు భిన్న స్వరాలతో గందరగోళానికి దారి తీసి ఉన్నది. డీఎండీకేకు కేవలం ఆహ్వానం మాత్రం పలికామేగానీ, ఇంత వరకు ఎలాంటి చర్చలు జరపలేదంటూ స్పష్టం చేశారు. ఎప్పుడో ఆహ్వానాన్ని తమ అధినేత కరుణానిధి పలికారే గానీ, కొత్తగా మరో మారు ఆహ్వానించ లేదని, చర్చలకు నిర్ణయించ లేదని వివరించారు.

ఇదే విషయాన్ని తమ అధినేత కరుణానిధి వ్యాఖ్యానిస్తే, దానిని  వక్రీకరించి వార్తలు, కథనాలు వెలువరించి ఉన్నారంటూ నిందల్ని మీడియా మీదకు నెట్టేయడం గమనార్హం. ఈ భిన్న స్వరాలు డీఎంకే కేడర్‌లో గందరగోళం రేపగా, కొన్ని పార్టీలు ఇదే అదునుగా డీఎంకే టార్గెట్ చేసి విమర్శలు ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డాయి.
 
విడ్డూరం: ఎండీఎంకే నేత వైగో మీడియాతో మాట్లాడుతూ అధినేత కరుణానిధి చేసిన వ్యాఖ్యల్ని ధిక్కరించి మరీ దళపతి స్టాలిన్ తన స్వరాన్ని పలకడం విడ్దూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సోదర సమానులైన కరుణానిధి ఏమో, చర్చలు అంటారు, ఆయన దళపతి ఏమో కేవలం ఆహ్వానం అంటారు..!. ఇంతకీ డీఎంకేలో ఏమి జరుగుతున్నదో అన్న ప్రశ్న బయలు దేరిందని అనుమానం వ్యక్తం చేశారు. కరుణానిధి వ్యాఖ్యల్ని ధిక్కరించి మరీ స్టాలిన్ తన స్వరాన్ని పెంచుతూ, స్పందించడం బట్టి చూస్తే, కుటుంబ  చట్రంలో రాజకీయ మేధావి చిక్కినట్టు ఉన్నారేమో అని పేర్కొన్నారు.
 
ఇక, వీసీకే నేత తిరుమావళవన్ ఓ మీడియాతో పేర్కొంటూ, డీఎండీకేను అక్కున చేర్చుకునే పరిస్థితిలో డీఎంకే దళపతి స్టాలిన్ లేరన్న విషయం స్పష్టం అవుతోందన్నారు. అందుకే ఈ వ్యాఖ్యలు చేసి ఉన్నారని, అదే సమయంలో రెండు రోజుల క్రితం అధికారంలో వాటా  ఇవ్వం అన్న విషయాన్ని కూడా డీఎండీకేను ఉద్దేశించే స్టాలిన్ స్పందించినట్టుందని వ్యాఖ్యానించారు.
 
సీఎం లేదా డిప్యూటీ సీఎం, అధికారంలో వాటా కోసం డీఎండీకే నేత విజయకాంత్ ఎదురు చూస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనని, అందుకే కాబోలు ఆ పార్టీని దగ్గరకు రానివ్వకుండా స్టాలిన్ వ్యూహ రచనల్లో ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై స్పందిస్తూ, డీఎండీకే తమ వైపునకు వస్తుందన్న నమ్మకాన్ని కరుణానిధి వ్యక్తం చేయడం, దానికి స్టాలిన్ మరో గళాన్ని విప్పడం వారి వారి వ్యక్తి గతం అని వ్యాఖ్యానించారు. అయితే, విజయకాంత్  దోస్తీకి సిద్ధ పడ్డ పక్షంలో, డీఎండీకే గొడుగు నీడన డీఎంకే నడవాల్సి ఉంటుందన్న విషయాన్ని కరుణానిధి గుర్తించాలని, ఇదే విజయకాంత్ అభిమతంగా చమత్కరించారు.
 
కరుణతో జవహరుల్లా : ఓ వైపు భిన్న స్వరాల గందరగోళం చర్చ సాగుతున్నా, వాటితో తమకు పని లేదన్నట్టు మనిదయనేయ మక్కల్ కట్చి(ఎంఎంకే) నేతలు డీఎంకే అధినేత కరుణానిధితో సమావేశం అయ్యారు. ఆ పార్టీ నేత జవహరుల్లా నేతృత్వంలో ప్రతినిధుల బృందం మధ్యాహ్నం గోపాలపురం మెట్లు ఎక్కారు. తమ మద్దతు మీకే అంటూ కరుణానిధికి లేఖను సమర్పించారు. డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయానికి శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు విషయంగా దళపతి స్టాలిన్‌తో సమావేశం అయ్యేందుకు ఈ బృందం నిర్ణయించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement