పన్నీరు పావులు | Sakshi
Sakshi News home page

పన్నీరు పావులు

Published Sun, Apr 16 2017 3:12 AM

పన్నీరు పావులు

అమ్మ శిబిరంతో సంప్రదింపులు
‘పళని’తో సంధికి యత్నమా..
సీనియర్లతో సీఎం మంతనాలు
రసవత్తరంగా అన్నాడీఎంకే రాజకీయం
మరో ఎమ్మెల్యే తిరుగుబాటు బెదిరింపు


సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవీ శిబిరాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అమ్మ శిబిరం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు, సీఎం ఎడపాడి పళనిస్వామి మధ్య ఇంటి పోరు రచ్చకెక్కిన సమాచారంతో మాజీ సీఎం పన్నీరుసెల్వం పావులు కదిపే పనిలో పడ్డారు. పళనితో సంధికి ప్రయత్నాల్లో పడ్డట్టున్నారు. టీటీవీకి చరమగీతం పాడి సఖ్యతగా అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని నడిపిద్దామన్న సంకేతాన్ని సీఎంకు పంపినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో సీనియర్లతో సీఎం మంతనాల్లో మునగడం గమనార్హం.

అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో బయలు దేరిన కల్లోలం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సమయంలో ఐటీ ఉచ్చులో పడ్డ ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్‌ రాజీనామా డిమాండ్‌ అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో వివాదాన్ని రేపింది. రాజీనామా చేయించే ప్రయత్నంలో సీఎం, అడ్డుకునే ప్రయత్నంలో టీటీవీ దినకరన్‌ ముందుకు సాగుతుండడంతో ఆ ఇద్దరి మధ్య విభేదాలు బయట పడ్డాయి. ఈ విభేదాల నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్టట్టున్నారు.

చిన్నమ్మ శశికళ, టీటీవీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆ శిబిరం, కొత్త ఎత్తులకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. చిన్నమ్మ శశికళ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న దృష్ట్యా, ఇక, సీనియర్లను తొక్కి పెట్టి పార్టీలో ప్రస్తుతం పెత్తనం సాగిస్తున్న దినకరన్‌ను ఇదే అదునుగా సాగనంపే వ్యూహాన్ని రచించినట్టు సమాచారం. ఇందుకుగాను, ఎడపాడి పళనిస్వామితో చేతులు కలిపి, దినకరన్‌ను బయటకు పంపించడమే కాకుండా, అటు పార్టీ, ఇటు ప్రభుత్వాన్ని ఇద్దరం కలిసి కట్టుగా నడిపిద్దామన్న నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పన్నీరు వ్యూహాలను ఆచరణలో పెట్టే పనిలో పురట్చితలైవీ శిబిరానికి చెందిన నేతలు పాండియరాజన్, సెమ్మలై, జేసీడీ ప్రభాకర్‌ తమ భుజాన వేసుకుని ఉన్నట్టు తెలిసింది.

సీనియర్లతో సీఎం మంతనాలు: ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ, అదే సమయంలో పార్టీకి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే, సఖ్యతగా ముందుకు సాగుదామన్న సఖ్యత మంత్రాన్ని సీనియర్‌ మంత్రుల చెవిలో పురట్చి తలైవీ శిబిరం నేతలు వేశారు. సీఎం పళని స్వామి దృష్టికి తీసుకెళ్లి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న సూచనను చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇదే విషయం శుక్రవారం రాత్రి సీఎం ఎడపాడి పళనిస్వామి ఇంట్లో జరిగిన మంతనాల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ చేత రాజీనామా చేయించే విషయంగా దినకరన్‌తో భేటీ అనంతరం సీనియర్‌ మంత్రులు ఎడపాడితోనూ సమావేశం అయ్యారు. విజయభాస్కర్‌ దగ్గర రాజీనామా చేయించడం లేదా, తొలగించడం లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకోవాలని సీఎంకు ఆ సీనియర్లు సూచించారు. ఏదేని సమస్య ఎదురైన పక్షంలో ఎదుర్కొందామని, ఢీ కొడదామన్న భరోసాను ఇచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో సీనియర్లు, పన్నీరు శిబిరం నుంచి వచ్చిన సఖ్యత సందేశాన్ని ఉపదేశించారు.

దీనిని ఆసక్తిగా విన్న సీఎం, ముందు విజయభాస్కర్‌ విషయాన్ని తేలుద్దామని, తదుపరి మిగతావి చూసుకుందామన్న వ్యాఖ్యల్ని పలికినట్టుగా పన్నీరు శిబిరానికి సమాచారం చేరి ఉండడం ఆలోచించ దగ్గ విషయమే. అమ్మ శిబిరంలో రచ్చకెక్కిన ఇంటి పోరు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీయనున్నదో వేచి చూడాల్సిందే.

మరో ఎమ్మెల్యే బెదిరింపు : సీఎం ఎడపాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమ్మ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఒకొక్కరుగా బెదిరింపుల స్వరాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగా హెచ్చరికలు చేసి ఉండగా, శనివారం మరో ఎమ్మెల్యే ఆ జాబితాలోకి చేరారు. పెరుంతురై ఎమ్మెల్యే, మాజీ మంత్రి తోపు వెంకటాచలం మీడియాతో మాట్లాడుతూ విరుచుకు పడ్డారు. అమ్మ పథకాల అమల్లో ఈ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే ఉంటే కీలక నిర్ణయాన్ని తాను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. బెదిరింపుల స్వరాన్ని పెంచే ఎమ్మెల్యేలు పన్నీరు శిబిరం వైపుగా చూస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంటి పోరు విషయంలో సీఎం నిర్ణయం ఎలా ఉంటుందో!

Advertisement
Advertisement