Sakshi News home page

‘మహా’ వ్యూహం

Published Fri, Nov 20 2015 2:54 AM

‘మహా’ వ్యూహం - Sakshi

  డీఎంకేతోనే కాంగ్రెస్ పయనం
  ఎన్నికల వేళ నిర్ణయం
  స్టాలిన్ వ్యాఖ్య
  పాట్నాకు పయనం

 
 సాక్షి, చెన్నై  : బీహార్ తరహాలో తమిళనాట మహా కూటమికి సన్నాహాలను డీఎంకే వేగవంతం చేసింది. డీఎంకేతో కలసి పయనించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక గురువారం ఈ మహా వ్యూహాల గురించి డీఎంకే దళపతిని ప్రశ్నిస్తే ఎన్నికల వేళ నిర్ణయం అంటూ పాట్నాకు విమానం ఎక్కేశారు. బీహార్‌లో జెడీ(యూ), ఆర్‌జేడీ, కాంగ్రెస్ మహా కూటమి అధికార పగ్గాలు చేజిక్కించుకోవడంతో అదే తరహాలో రాష్ట్రంలోనూ కూటమికి డీఎంకే ప్రయత్నాలను వేగవంతం చేసింది. డీఎండీకే తమ వైపునకు వచ్చేందుకు పెట్టిన మెళిక మీద పరిశీలనలో పడ్డ డీఎంకే అధినేత ఎం.కరుణానిధి, ఆ పార్టీ అధినేత విజయకాంత్‌ను తన బుట్టలో వేసుకునే ప్రయత్నాలను వేగవంతం చేస్తూనే, మరో వైపు ఢిల్లీలో పార్టీ నేత టీఆర్ బాలు ద్వారా కాంగ్రెస్‌తో, వామపక్షాలతో మంతనాలను వేగవంతం చేసి ఉన్నారు.
 
 తమిళనాడు, పుదుచ్చేరిలోనూ డీఎంకేతో కలసి పయనించేందుకు సిద్ధమవుతూ కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో డీఎండీకేను పట్టించుకోవద్దంటూ రాష్ర్ట పార్టీ వర్గాలకు బీజేపీ అధిష్టానం వ్యాఖ్యలు చేసినట్టు సమాచారాలు వస్తుండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే అన్నాడీఎంకే పతనం కోసం డీఎంకేతో డీఎండికే దోస్తి కట్టడం, కాంగ్రెస్ సైతం అదే బాటలో పయనించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టుగా, ఇతర పార్టీలు సైతం డీఎంకేతో కలసి రావొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మహా వ్యూహాలకు పదునులో భాగంగానే  తన దూతగా పాట్నాకు స్టాలిన్‌ను కరుణానిధి పంపి ఉండటాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అక్కడికి హాజరు అయ్యే కాంగ్రెస్ పెద్దలతో స్టాలిన్ సాగించే మంతనాలు మహా ప్రయత్నాలకు బీజంగా చెబుతున్నారు.
 
 మహా వ్యూహమా..
 బీహార్‌లో నితీష్‌కుమార్ నేతృత్వంలోని మహా కూటమి అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం పాట్నాలో జరిగే వేడుకలో నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తన దూతగా దళపతి స్టాలిన్‌ను పాట్నాకు కరుణానిధి పంపించారు. ఆ మేరకు గురువారం ఉదయం పదిన్నర గంటలకు మీనంబాక్కం విమానాశ్రయంకు చేరుకున్న స్టాలిన్‌కు ఆ పార్టీ నేతలు ఎం సుబ్రమణియన్, ఆర్.శేఖర్ బాబు, టి.అన్భరసులు ఆహ్వానం పలికారు. స్టాలిన్‌ను చుట్టుముట్టిన మీడియా మహా వ్యూహాల గురించి ప్రశ్నలను సంధించింది. మెగా కూటమి ఎన్నికల సమయంలో తెలుస్తుందంటూ స్టాలిన్ సమాధానాలు ఇచ్చారు.
 
 బీహార్‌లో మహా కూటమి సాధించిన విజయం ఒక్క ఆ రాష్ట్రానికే పరిమితం కాదని, దేశానికే మార్గదర్శకం అంటూ వ్యాఖ్యానించారు. మతత్వానికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన మహా కూటమి తరహా కూటమి అన్నది తమిళనాడులో ఎన్నికల సమయంలోనే తెలుస్తుందని, నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వరద నివారణ చర్యలు మొక్కుబడిగానే సాగుతున్నాయని మండిపడ్డారు. సీఎం జయలలిత వాతావరణ కేంద్రం అధికారి వలే వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ప్రజల్ని ఆదుకోవాల్సిన పాలకులు, ప్రజల వద్దకు వెళ్లి భరోసా ఇవ్వాల్సిన వాళ్లు సమీక్షలతో కాలం నెట్టుకురావడం విచారకరంగా పేర్కొన్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement