డీఎంకేలో ముసలం | Sakshi
Sakshi News home page

డీఎంకేలో ముసలం

Published Sat, Jan 25 2014 3:07 AM

dmk leaders loosing their co-ordination

అన్నదమ్ముల మధ్య ఆధిపత్యపోరు అంతర్యుద్ధంగా మారింది. అళగిరి సస్పెన్షన్ డీఎంకేలో ముసలం పుట్టిం చింది. డీఎంకే పార్టీ ఉత్తర, దక్షిణాలుగా చీలిపోయే ప్రమాదం నెలకొంది. డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు, పార్టీ దక్షిణ మండల కార్యదర్శి అళగిరిపై సస్పెన్షన్ వేటు వేయడం డీఎంకేలో కలకలం సృష్టించింది.కార్యర్తలు అయోమయంలో పడ్డారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:
 వృద్ధాప్యానికి చేరువవుతూ వీల్‌చైర్‌పై నుంచే పార్టీని నడిపిస్తున్న కరుణానిధికి ప్రత్యామ్నాయంగా డీఎంకేకు కొత్త సారథి ఎవరనే చర్చ కొంతకాలంగా సాగుతోంది. ఈ అంశంపై సహజంగానే కరుణ తనయులైన అళగిరి, స్టాలిన్ మధ్య పోటీ నెలకొంది. పెద్ద కుమారుడి హోదాలో తనకే ఆధిపత్యం దక్కాలని మదురై జిల్లాను కేంద్రంగా చేసుకుని రాజకీయం నెరపుతున్న అళగిరి పట్టు పడుతున్నారు. తన వారసుడు స్టాలిన్ అని గత ఏడాది కరుణ నర్మగర్భంగా ప్రకటించగా దుమారం రేగింది. అవకాశం దొరికినప్పుడల్లా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న అళగిరి వర్గ రాజకీయాలను మరింతగా పెంచుతూ స్టాలిన్‌పై బహిరంగ విమర్శలకు దిగారు. మదురైలో పార్టీ అన్నదమ్ముల వర్గాలు బాహాబాహీకి పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో తమ నేత ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అళగిరి అనుచరులు మదురైలో పోస్టర్లు అంటించడం మరింత వివాదానికి దారితీసింది. దీనిపై కరుణానిధి స్వయంగా కలుగచేసుకుని మదురైలో అళగిరి అనుచరులతో కూడిన కార్యవర్గాన్ని రద్దుచేశారు.
 
  ఆ బాధ్యతలను స్టాలిన్ అనుచరులకు అప్పగించారు. అంతేగాక అళగిరిని మందలించారు. ఇదిలా ఉండగా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో డీఎండీకేతో పొత్తుపెట్టుకునేందుకు డీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ అధినేత విజయకాంత్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈ దశలో అళగిరి ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయకాంత్‌పై అనేక విమర్శలు గుప్పించారు. దీంతో పొత్త యత్నాలకు అళగిరి మోకాలొడ్డుతున్నాడంటూ పార్టీ ఆగ్రహించింది. అదేవిధంగా పార్టీలో కుమ్ములాటలు రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయని ఆందోళనలో పడింది. ఈ క్రమంలో అళగిరి ఆగడాలను అదుపుచేసేందుకు కరుణానిధి ప్రయత్నాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన అళగిరిని పిలిపించుకున్నారు.
 
 పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే గెంటివేసేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. అయినా అళగిరి, ఆయన అనుచరులు పూర్వ పంథాలోనే మదురైలో మళ్లీ వివాదాస్పద పోస్టర్లు అంటించారు. వాటిని స్టాలిన్ అనుచరులు అడ్డుకున్నారు. ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. స్టాలిన్ అనుచరులపై అళగిరి అనుచరులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు పెట్టించారు. అళగిరిపై మదురై నుంచి ఫ్యాక్స్ ద్వారా కరుణకు 2500 ఫిర్యాదులు అందాయి. పార్టీలో ఈ దుమారం చెలరేగుతుండగానే అళగిరి విదేశాలకు వెళ్లారు. మరో ఐదుగురు అళగిరి అనుచరులను పార్టీ గురువారం సస్పెండ్ చేసింది. శుక్రవారం తెల్లవారుజామున చెన్నై చేరుకున్న అళగిరి ఉదయం 7 గంటలకు గోపాలపురం ఇంటిలో తండ్రి కరుణానిధిని కలుసుకున్నారు. ఇద్దరూ 45 నిమిషాలు మాట్లాడుకున్నారు. అళగిరి వెళ్లిపోయిన కొద్దిసేపటికి స్టాలిన్ వచ్చి కరుణతో మాట్లాడారు. కరుణ ఇంటి నుంచి అళగిరి వెళ్లిపోయిన నాలుగు గంటల తర్వాత ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బగళన్ ప్రకటించారు. దీంతో పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు.
 
 

Advertisement
Advertisement