ప్చ్.. బాగోలేదు | Sakshi
Sakshi News home page

ప్చ్.. బాగోలేదు

Published Thu, May 15 2014 2:09 AM

ప్చ్.. బాగోలేదు - Sakshi

మంత్రుల పని తీరుపై  దిగ్విజయ్ పెదవి విరుపు
- సోమరితనం వీడండి.. లేకుంటే ఇంటికే
- ఆంజనేయ, మహదేవప్ప  వైఖరి మార్చుకోండి
- అధికారుల బదిలీల్లో ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి
- మంత్రులు రాష్ర్టమంతటా పర్యటించాలి
- సీనియర్ల సలహా మేరకే కీలక నిర్ణయాలు
- కరువును ఎదుర్కోవడంలో  ప్రభుత్వం విఫలం
- రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదు

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో కొందరు మంత్రుల పని తీరుపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తీవ్ర అసృతప్తి వ్యక్తం చేశారు. సోమరితనంతో వ్యవహరిస్తున్న మంత్రుల్లో చురుకు పుట్టించాలని, దారికి రాని మంత్రులకు ఇంటి దారి చూపాలని ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయనతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మంత్రులు డీకే. శివ కుమార్, కేజే. జార్జ్, ఏఐసీసీ కార్యదర్శి చెల్ల కుమార్  పాల్గొన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రుల పని తీరును సమీక్షించారు. విధాన సౌధలో తన గదిలో గోడను కొట్టి వేయించిన మంత్రి హెచ్. ఆంజనేయ, తన బంగళా అలంకారానికి సుమారు రూ.2 కోట్లు వరకు ఖర్చు చేసిన మంత్రి హెచ్‌సీ. మహదేవప్పల వైఖరిని దిగ్విజయ్ తప్పుబట్టారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు దొర్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. అలాగే అధికారుల బదిలీల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని సూచించారు.

మంత్రులు తమ జిల్లాలకే పరిమితం కాకుండా రాష్ట్రమంతటా పర్యటించాలన్నారు. ప్రభుత్వం ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ముందు సీనియర్లను సంప్రదించాలని సలహా ఇచ్చారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వదిలి వేయాలని సూచించారు. కాగా కరువును సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని అనేక మంది నాయకులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇన్‌ఛార్జి మంత్రులు తమ జిల్లాల్లో మకాం వేసి కరువు సహాయక పనులు చక్కగా అమలయ్యేలా చూడాలని, ప్రజా సమస్యలపై స్పందించాలని సూచించారు.

లోక్‌సభ ఎన్నికల అనంతరం బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకాలను చేపట్టాలని సలహా ఇచ్చారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుపు సాధించవచ్చనే విషయమై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. అలాగే సిద్ధరామయ్య ఏడాది పాలనపై సింహావలోకనం చేపట్టారు. తదుపరి సమావేశంలో దీనిపై మరింతగా చర్చించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినకుండా కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం.

ఉత్తమ పాలన
రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలన భేషుగ్గా ఉందని దిగ్విజయ్ సింగ్ కొనియాడారు. సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య సర్కారు డిస్టింక్షన్ సాధించిందని కితాబునిచ్చారు. మంత్రి వర్గ విస్తరణ, శాఖల మార్పు, శాసన మండలికి అభ్యర్థుల ఎంపిక లాంటి విషయాలు ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించినవని పేర్కొన్నారు.

Advertisement
Advertisement