కన్నతల్లిని చంపి పెంపుడు తల్లిని తెస్తారా? | Sakshi
Sakshi News home page

కన్నతల్లిని చంపి పెంపుడు తల్లిని తెస్తారా?

Published Wed, Oct 19 2016 6:56 PM

కన్నతల్లిని చంపి పెంపుడు తల్లిని తెస్తారా? - Sakshi

► వరి పండకపోతే సింగపూర్ నుంచి దిగుమతి చేసుకుంటారా
► చంద్రబాబుపై మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ బాధితుల ఆగ్రహం
► బాధితులకు అండగా ఉంటామన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
► యుద్ధవాతావరణం సృష్టించి ఫ్యాక్టరీ కడుతున్నారని మండిపాటు
► వ్యతిరేకిస్తే హత్యాయత్నం కేసులు, రోజుల తరబడి జైల్లో పెట్టడమా
► ఇక్కడి నుంచి పది కిలోమీటర్లు తరలిస్తే అంతా మద్దతిస్తామని వెల్లడి
► పైపులైను డ్రామాలు ఆపాలని చంద్రబాబుకు హితవు
► ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లద్దు.. బలవంతంగా ఫ్యాక్టరీ వద్దు
 
బేతపూడి
కన్నతల్లిని చంపేసి పెంపుడు తల్లిని తీసుకొస్తామంటే ఎవరు ఊరుకుంటారని తుందుర్రు, బేతపూడి తదితర గ్రామాల ప్రజలు మండిపడ్డారు. ఈ గ్రామాలకు సమీపంలో నిర్మిస్తున్న మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధితులను పరామర్శించేందుకు వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఈ గ్రామాల ప్రజలు తీవ్ర ఆక్రోశం వెలిబుచ్చారు. ఆక్వా ఫ్యాక్టరీ వల్ల పొలాలు నాశనం అవుతాయని అప్పుడు వరి పండకపోతే సింగపూర్ నుంచి దిగుమతి చేసుకుంటారా అని ప్రశ్నించారు. బాధితులకు తాము పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించేందుకు కోర్టుల్లో న్యాయపోరాటాలు కూడా చేస్తామన్నారు. మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ బాధితులను పరామర్శించి, అనంతరం బేతపూడిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
 
  • మూడు పంచాయతీల నుంచి వంద మీటర్ల దూరం కూడా లేకముందే ఫ్యాక్టరీ కడుతున్నారు
  • నేను అడిగేది ఒక్కటే.. ఫ్యాక్టరీ ఇక్కడే కడుతున్నందువల్ల మనకు జరిగే నష్టం ఏంటి, అది ఎందుకు జరుగుతోందని మీరే చెప్పండి
  • ఈ సమావేశం నుంచి మనం చంద్రబాబు నాయుడికి మెసేజ్ ఇద్దాం
  • ప్రాజెక్టు మొదలుపెట్టడానికి ముందు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు
  • ప్రాజెక్టును వ్యతిరేకించినవాళ్ల మీద హత్యాయత్నం కేసులు కూడా పెట్టారు
  • ఈ ఫ్యాక్టరీలో రోజుకు 3వేల టన్నుల రొయ్యలు, చేపలను శుద్ధి చేసినప్పుడు ఆ రసాయనాలతో కాలుష్యం రాకుండా ఎలా ఉంటుంది
  • కాలుష్య నియంత్రణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆరంజ్ కేటగిరీలో ఉందని, ఇది కాలుష్య కారకమని చెబుతున్నారు
  • మరోవైపు చంద్రబాబు మాత్రం ఈ ప్రాజెక్టు జీరో పొల్యూషన్ అని, దీని నుంచి కాలుష్యం రాదని అంటారు
  • మరోవైపు సముద్రం వరకు పైపులైను కూడా వేస్తామని చెబుతారు
  • కాలుష్యమే లేకపోతే మరి పైపులైను ఎందుకు వేస్తున్నారు?
  • కాలుష్యం ఉందని మీకు తెలుసు కాబట్టే పైపులైను పేరుతో మీరు ప్రజలను మభ్యపెడుతున్నారు
  • ఎన్నో సందర్భాల్లో మీరు ఎన్నో అబద్ధాలు ఆడారు
  • ఎన్నికల సమయంలో రైతు రుణాలన్నింటినీ బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తామన్నావు
  • బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలన్నావు
  • డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నావు
  • ఇంటింటికీ జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని మభ్యపెట్టావు
  • ఇప్పుడు పైపులైను వేస్తామని చెబుతున్నావు
  • ఒక ప్రైవేటు సంస్థకు 20-25 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో పైపులైను ఎందుకు వేస్తున్నావు?
  • అంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు వల్ల  ఏ స్థాయిలో ముడుపులు అందుకుంటున్నారో తెలుస్తుంది
  • ప్రజలను మోసం చేయడానికి పైపులైను పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారు
  • చంద్రబాబు గారూ.. పైపులైను డ్రామాలు ఆపండి
  • పది కిలోమీటర్ల దూరానికి మారిస్తే.. అక్కడ మనుషులు ఉండరు, సముద్రతీరం ఉంది.
  • అక్కడ ప్రభుత్వ భూములే 350 ఎకరాలు ఉన్నాయి. వాటిలో కొంత ఈ ఫ్యాక్టరీకి కేటాయిస్తే సముద్రతీరం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు
  • పైగా దానివల్ల ఇన్ని కిలోమీటర్లు పైపులైను వేసేందుకు అయ్యే ఖర్చు కూడా తప్పుతుంది
  • ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు కాస్త కూస్తో వస్తాయి కాబట్టి సరేనన్నామని కొందరు అంటున్నారు
  • కానీ ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే.. విపరీతమైన దుర్గంధం వస్తుంది. కాలువలు కలుషితం అయిపోవడం వల్ల చేను ఏదీ బతకదు, పొలాల మీద ఆధారపడిన కూలీలు కూడా బతికే పరిస్థితి ఉండదు
  • ఇదే ఫ్యాక్టరీని ఇక్కడినుంచి కేవలం 10 కిలోమీటర్లు తరలిస్తే, అందరూ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం
  • నిజంగా ఫ్యాక్టరీ వస్తే కొద్దోగొప్పో ఉద్యోగాలు వస్తాయి కాబట్టి పర్వాలేదు గానీ, ఇక్కడైతే వీళ్ల పొట్ట మీద కొట్టినట్లు అవుతుంది
  • ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే 50 ఏళ్ల వరకు దూరదృష్టితో చూడాలి
  • ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఏ ఇబ్బంది ఉండకూడదని చూడాలి
  • వీళ్ల లెక్కల ప్రకారం 15-20 కోట్ల పెట్టుబడులు పెట్టామంటున్నారు
  • ఈ షెడ్లను ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టుకోవచ్చు
  • మహా అయితే పునాది పనులకు పెట్టిన ఐదు కోట్ల ఖర్చు మాత్రమే నష్టం కావచ్చు
  • ఫ్యాక్టరీ స్థలం మొత్తం పూర్తిగా పోలీసులతో నింపేసి, అక్కడ యుద్ధ వాతావరణం సృష్టించారు. ఊళ్లో 144 సెక్షన్ పెట్టారు
  • యాజమాన్యాన్ని కోరుతున్నా.. ప్రజల అభీష్టం మేరకు దీన్ని ఇక్కడినుంచి తరలించండి
  • ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలేదు, ఫ్యాక్టరీ పెడతామని భూములు కొనలేదు, వీటన్నింటి నేపథ్యంలో పెద్ద మనసుతో ఆలోచించి ఇక్కడి నుంచి తరలించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం
  • నీకు నిజంగా ఫ్యాషన్ అయిపోయింది. ప్రజలు ఒప్పుకోకపోయినా బలవంతంగా భూములు లాక్కుంటున్నావు
  • మచిలీపట్నంలో 30 వేల ఎకరాలు బలవంతంగా లాక్కుంటున్నావు
  • క్యాపిటల్ సిటీ అని పొలాలకు నిప్పు పెట్టించి మరీ లాక్కున్నావు
  • భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం అని బలవంతంగా భూములు లాక్కుంటున్నావు
  • ఈ కార్యక్రమాలను ఎవరైనా ఎదిరిస్తే.. మేం అభివృద్ధి నిరోధకులం అని ముద్ర వేస్తున్నావు
  • ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని, వారి ఆమోదం తీసుకుని పనిచేయాలి అంతేతప్ప ఇలా నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు తగవు
  • హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టులు, గ్రామాల్లో 144 సెక్షన్లు మానుకో
  • రాష్ట్రం కోసం కొద్దో గొప్పో పనిచేయడం నేర్చుకో అని చెబుతున్నా
  • కోర్టులకు వెళ్లి ఈ ఫ్యాక్టరీ మీద కేసులు వేసి ఇక్కడి బాధితులకు అండగా ఉంటాం
  • చంద్రబాబు పాలన ఇక కేవలం రెండేళ్లు మాత్రమేనని గుర్తుపెట్టుకోండి
  • ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని కచ్చితంగా చెబుతున్నా
  • అప్పుడు ప్రజల అభీష్టం మేరకు ఏం కావాలో అది మాత్రమే చేస్తాం
  • అలా కాదని చేస్తే చంద్రబాబు నాయుడు బంగాళాఖాతంలో కలిసే రోజొస్తుంది, ఈ ఫ్యాక్టరీ కూడా బంగాళాఖాతంలో కలుస్తుంది
  • సీపీఎం మధు ఇక్కడకు వస్తే ఆయనను బలవంతంగా జైల్లో పెట్టారు
  • ఆయన కోసం గ్రంధి శ్రీనివాస్ ధర్నా చేస్తే.. అప్పుడు వదిలిపెట్టారు
  • వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టి, పోలీసులను ఉపయోగించి అణిచేస్తారు
  • ఇలాగే అయితే ఈ ప్రభుత్వం ఎల్లకాలం సాగదని చెబుతున్నా
  • ఆళ్ల నాని, గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు అందరూ మీతోపాటు ఉండి అండగా, తోడుగా ఉంటారు
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆక్వా ఫ్యాక్టరీ బాధితులకు అండదండలు అందిస్తుంది. 
 
బాధితులు ఏమన్నారంటే....
 
పంటలు పండవు, కొబ్బరి చెట్లు ఉండవు
కంపెనీ దాటితే మా ఊరు వస్తుంది. ఫ్యాక్టరీ ఇక్కడకు రావడం మాకు ఇష్టం లేదు. ఆ నీళ్లు మొత్తం కలుషితం అయిపోతాయి. గొంతేరు కాల్వ ఒక్కటే మాకు ఆధారం. ఫ్యాక్టరీ వస్తే దాంట్లో నీళ్లు బాగోవు. పంటలు పండవు, కొబ్బరిచెట్లు ఉండవు, చేపల చెరువులు కాయవు, చివరకు దుస్తులు ఉతుక్కోడానికి కూడా అవకాశం ఉండదు. తూములు పెడతామంటున్నారు.. అవి కూడా వద్దు. అసలు ఫ్యాక్టరీ కావాలా వద్దా అనే విషయం గురించి ఇక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్న పాపాన పోలేదు. 
-ఐరావతి.. శేరాయిపాలెం
 
అమ్మోనియం గ్యాస్ వస్తే ఊరు వదిలిపోవాలా?
ఫ్యాక్టరీ కోసం భూమి కొంటున్నట్లు వాళ్లు చెప్పలేదు.. చేపల చెరువుల కోసం అని కొన్నారు. నేను ఎకరంన్నర కొన్నాను. పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లినవాళ్లు రైతులు కారు, సెంటు భూమి కూడా లేదని టీడీపీ నేతలు అన్నారు. నేను వెళ్లాను.. నా భూమి అమ్మాను. మోసపూరితంగా పొలాలు కొనుగోలు చేశారు. తర్వాత కూడా సంతకాలు ఫోర్జరీ చేసి ఫ్యాక్టరీ కోసం అని భూమి వినియోగాన్ని మార్చుకున్నారు. 20 గ్రామాల వాళ్లు కలిసి తీర్మానం చేసి కలెక్టర్‌కు ఇద్దామని వెళ్లినా.. మా దగ్గర కాగితాలు కూడా తీసుకోలేదు. ఐదు మండలాల పరిధిలో పంటనష్టం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అని కలెక్టర్ చెప్పారు. అంతేతప్ప బడాబాబుల కోసం పనిచేస్తున్నామని చెప్పలేదు. సముద్రం వరకు పైపులైను వేస్తే వ్యర్థాలు బయటకు వెళ్లచ్చు గానీ, గాల్లో వదిలే అమ్మోనియం గ్యాస్ మాత్రం మా గ్రామాల మీదుగా వెళ్తుంది. మేమంతా ఊళ్లు వదిలి వెళ్లిపోవాలా? ఇప్పుడు రోడ్లు వేయడానికే స్థలాలు లేవంటున్నారు.. మరి పైపులైను వేయడానికి స్థలాలు ఎక్కడినుంచి వస్తాయి? దీని వల్ల వరి పండకపోతే సింగపూర్ నుంచి దిగుమతి చేసుకుంటారా? కన్నతల్లిని చంపేసి పెంపుడు తల్లిని తీసుకొస్తామంటే ఎవరు మాత్రం ఒప్పుకొంటారు?
-సముద్రాల వీరవెంకట సత్యవాణి, బేతపూడి
 
చంద్రబాబు వైఖరికి నిరసన తెలుపుతున్నాం
నాతో సహా అంతా చంద్రబాబు వైఖరికి నిరసన తెలుపుతున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదు. ప్రజలు ఇస్తేనే అధికారం వస్తుంది.. అందుకే నేను ప్రజల వెంటే ఉంటాను. ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అని, మీ వల్ల ఏమీ అవ్వదని అన్నిరకాలుగా మాపై ఒత్తిడి తెచ్చారు. రెండున్నరేళ్లుగా అందరి చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. చివరకు సీపీఎం మధును ఆశ్రయిస్తే.. వాళ్లు మాకు అండగా నిలిచారు. వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఆళ్ల నాని తదితరులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించారు. బైండోవర్ చేశారు, హత్యాయత్నం కేసులు పెట్టారు. ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కూడా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. 
-సత్యనారాయణ, తుందుర్రు టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు
 
మా భర్తను జైల్లో పెట్టారు
మా భర్త మహేష్ ఫ్యాక్టరీ వద్దని ఆందోళనచేసినందుకు 40 రోజుల నాడు జైలుకు తీసుకెళ్లిపోయారు. బెయిల్ కూడా ఇవ్వకుండా హత్యాయత్నం కేసు పెట్టారు. ఇద్దరు పిల్లలతో నేను, మా అత్తగారు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మమ్మల్ని కూడా జైల్లో పెడతామని బెదిరించారు. పిల్లలతో సహా తీసుకుపోతామన్నారు. మా ఊళ్లో కాకుండా ఇంకెక్కడికైనా ఈ ఫ్యాక్టరీ తరలించుకొమ్మనండి
-కీర్తన
 
వాళ్ల దగ్గరకే వెళ్లాలట
ఆరేటి సత్యవతి, మేము అంతా కలిసి గ్రంధి శ్రీనివాస్ దగ్గరకు వెళ్లామని ఆమెను అరెస్టుచేసి హత్యాయత్నం కేసు పెట్టి జైల్లో పెట్టారు. మాకు ఏమైనా ఇబ్బందులు వస్తే టీడీపీవాళ్ల వద్దకే వెళ్లాలి తప్ప మరొకరి వద్దకు వెళ్తే ఇలా జైళ్లలో పెడుతున్నారు. సత్యవతి భర్తకు కేన్సర్. కొడుకును ఒక జైల్లో ఆమెను ఇంకోజైల్లో పెట్టారు. 
-లక్ష్మి

Advertisement
Advertisement