హెల్మెట్ ధారణ ఎంతో భద్రం | Sakshi
Sakshi News home page

హెల్మెట్ ధారణ ఎంతో భద్రం

Published Tue, Apr 29 2014 11:02 PM

EC nod for plan to make helmets must for women

 న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాలు నడిపే మహిళలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా రవాణా విభాగం నిబంధనల్లో మార్పులు చేసుకునేందుకు రవాణా విభాగానికి ఈసీ అనుమతించడాన్ని అతివలు   స్వాగతిస్తున్నారు. దీనివల్ల తమ భద్రతకు భరోసా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘హెల్మెట్ల వల్ల భద్రత ఉంటుంది. భద్రత విషయం వచ్చేసరికి లింగ విభేదం ఉండకుండా చూడాలి. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం కూడా ముఖ్యమేన’ని తన సోదరుడితో కలిసి తరచూ బైక్‌పై వెళ్లే కళాశాల విద్యార్థి అరునిత తివారీ మంగళవారం మీడియాకు తెలిపారు. మగవారు మాత్రమే సీట్‌బెల్ట్‌లు ధరించాలని ఎందుకు వాదించరని, అలాంటప్పుడు హెల్మెట్ల విషయంలో రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు.
 
 కాగా,  మహిళలకు హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేసుకునేందుకు నిబంధనాల్లో మార్పులు చేసుకునేందుకు రవాణా విభాగానికి ఈసీ నుంచి అనుమతి వచ్చిందని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ తెలిపారు. తమ అధికార పరిధిలో ఇలాంటి నోటీసులను పూర్తిగా తనిఖీ చేశాకే ఆమోదిస్తామని తెలిపారు. అయితే ఈ నిబంధన అమలు చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి రాదని వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరిగే మే 16 వరకు సాధారణ పరిపాలన విభాగ నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. ‘ఈ ప్రక్రియకు సమయం తీసుకుంటుంది. మహిళల నుంచి సలహాలు తీసుకోవాలి. ఆ తర్వాత రవాణా విభాగం ఇచ్చే ప్రతిపాదనలు, సూచనల ఆధారంగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీమ్ జంగ్ తుది నిర్ణయం తీసుకుంటార’ని దేవ్ వివరించారు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం... భారత్‌లోనే అత్యధికంగా 1,05,725 మరణాలు చోటుచేసుకున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
 బైక్‌లు నడిపే మహిళలకు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరిచేసేలా రవాణా విభాగానికి ఆదేశాలు ఇవ్వాలని 2011లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సామాజిక కార్యకర్త ఉల్హాస్ ఈసీ తాజా నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ విషయంలో ఈసీ ఎలాంటి ఆలస్యం చేయవద్దు. వెంటనే అనుమతి ఇచ్చేయాలి. గతంలో ఉన్న ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింద’ని తెలిపారు. ప్రస్తుతమున్న మోటార్ వెహికల్ చట్టం, నిబంధల ప్రకారం... ద్విచక్రవాహనాలు నడిపే మహిళలకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కాదని, సిక్కులు తలపాగా ధరించొచ్చన్న నిర్ణయంపై ఆమె మండిపడ్డారు. ‘ప్రమాదాలు మతప్రాతిపదికన జరగవు. ఎవరైనా ఎక్కడైనా ప్రమాదానికి గురికావచ్చు.
 
 హెల్మెట్ నిబంధనను సిక్కులకు కూడా వర్తింపచేయాల’ని ఉల్హాస్ డిమాండ్ చేశారు. ‘ఈసీ తీసుకున్న తాజా నిర్ణయాన్ని మహిళా సమాజమంతా గౌరవిస్తుంది. దీన్ని రాజకీయం చేయవద్దు. వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు జరిగేలా చూడాల’ని డ్రంకెన్ డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్న ఎన్‌జీవో వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రిన్స్ సింగాల్ అన్నారు. దీన్ని కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయకుండా దేశమంతటా వర్తింపచేయాలని సూచించారు. హెల్మెట్లు ధరించడం అవసరం, దాని గురించి మరో ఆలోచన చేయకూడదని జర్నలిజం విద్యార్థిని కనికా వాలియా అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ నిబంధనను అమలు చేయాలన్నారు. కాగా, మహిళలు హెల్మెట్లు ధరించాలన్న నిబంధనపై ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదని ప్రత్యేక భద్రత పోలీసు కమిషనర్ తాజ్ హస్సన్ అన్నారు. రవాణా విభాగం నుంచి నోటిఫికేషన్ రాగానే హెల్మెట్లు ధరించని మహిళలకు చలాన్‌లు జారీ చేస్తామని తెలిపారు.
 

Advertisement
Advertisement