చల్లటి వాగ్దానం | Sakshi
Sakshi News home page

చల్లటి వాగ్దానం

Published Tue, Apr 26 2016 2:25 AM

చల్లటి వాగ్దానం - Sakshi

సాక్షి, చెన్నై: ఎండలు మండుతున్న వేళ ‘అమ్మ’ చల్లటి వాగ్దానం ఇవ్వడానికి సిద్ధం అవుతోన్నారట! అదే ఉచితం...! అవే మహిళల కోసం అమ్మ  మినీ ఫ్రిడ్జ్, వాటర్ హీటర్. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. డీఎంకే ఉచితాలకు దూరంగా ఉండడంతో, జనాకర్షణ దిశగా ఈ చల్లటి వాగ్దానం అందుకునేందుకు అమ్మ నిర్ణయించినట్టుగా సంకేతాలు వస్తుండడం గమనించాల్సిందే. రాష్ట్రంలో ఎన్నికల వాగ్దానాలుగా రాజకీయపక్షాలు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. డీఎంకే హయంలో టీవీ ఇవ్వగా, అన్నాడీఎంకే సర్కారు మిక్సీ, గ్రైండర్, ఫ్యాన్‌లను పంపిణీ చేసింది.

అయితే ఈ ఉచితాల్ని విమర్శించే వాళ్లూ ఎక్కువే. ఎన్నికల యంత్రాంగం సైతం ఉచితాలకు దూరంగా ఉంటే బాగుంటుందంటూ రాజకీయ పక్షాలకు సూచించే పనిలో పడింది. ఇందుకు డీఎంకే తలొగ్గినట్టుంది. అందుకే ఈ సారి తమ మేనిఫెస్టోలో ఉచితాల్ని పక్కన పెట్టి, రుణాల మాఫీలతో పాటుగా కొత్త అంశాల్ని తెర మీదకు తెచ్చింది. పీఎంకే కూడా ఉచితాల జోలికి వెళ్లకుండా మేనిఫెస్టోను ప్రకటించింది. ఇక, రాష్ర్టంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఇంత వరకు మేనిఫెస్టోను ప్రకటించ లేదు.

అందరి కన్నా ముందు ఉండే అమ్మ జయలలిత ఈ సారి ఆలస్యంగానైనా ఆలోచనాత్మకంగా వ్యవహరించి సరికొత్త అంశాలతో ముందుకు వచ్చేందుకు చర్యలు వేగవంతం చేసి ఉన్నారు. ఇందులో మండే ఎండలకు చల్లటి వాగ్దానంగా అమ్మఫ్రిడ్జ్, వాతావరణం మారగానే చలికాలంలో వెచ్చటి నీళ్ల కోసం హీటర్ అందించేందుకు తగ్గ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం.

ఈ సమాచారం కాస్త బయటకు రావడంతో అందరి దృష్టి అమ్మ మేనిఫెస్టోపై మరలి ఉంది. ఇంతకీ ఈ చల్లటి వాగ్దానం అందులోఉంటుందా? అని ఎదురు చూపులు పెరిగాయి. ఓట్ల కోసం నోట్ల పంపిణీకి ఈసీ అడ్డు పడుతున్న నేపథ్యంలో ఈ ఉచితాన్ని ప్రకటించే అవకాశాలు ఎక్కువే. ఇందుకు నిదర్శనంగా అన్నాడీఎంకే వర్గాల్ని టార్గెట్ చేసి జరుగుతున్న దాడుల్లో కట్టల కట్టలుగా నోట్లు బయట పడుతుండడమే..!

Advertisement
Advertisement