మరాఠ్వాడాలో మనోళ్లు ముగ్గురు | Sakshi
Sakshi News home page

మరాఠ్వాడాలో మనోళ్లు ముగ్గురు

Published Fri, Oct 10 2014 10:28 PM

మరాఠ్వాడాలో మనోళ్లు ముగ్గురు - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠ్వాడా నుంచి ముగ్గురు తెలుగు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కైలాష్ గోరింట్యాల్ జాల్నా నుంచి, నాందేడ్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున దిలీప్ కందుకుర్తి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) నుంచి ప్రకాష్ మరావార్‌లు పోటీ చేస్తున్నారు. గతంలో మరాఠ్వాడా నుంచి ఒకేఒక తెలుగు అభ్యర్థి బరిలో నిలవగా ఈసారి ముగ్గురికి చేరింది.

జాల్నా...
మరాఠ్వాడాలో ప్రస్తుతం ఏకైక తెలుగు రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన కైలాష్ గోరింట్యాల్ ఈసారి మల్లి జాల్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.  ఈ నియోజకవర్గంలో శివసేన నుంచి అర్జున్ కోత్కర్, బీజేపీ నుంచి అరవింద్ చవాన్, ఎన్సీపీ నుంచి కుశాల్‌సింగ్ ఠాకూర్, ఎమ్మెన్నెస్ నుంచి రవి రావుత్‌లతోపాటు మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో బహుముఖ పోటీ జరగనుంది. ఇక తెలుగు అభ్యర్థి కైలాష్ గోరింట్యాల్ గురించి చెప్పాలంటే.. బలమైన రాజకీయ వారసత్వం కలిగిన ఆయన ఇప్పటికి  రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరి పూర్వికులు జీవనోపాధికోసం వచ్చి స్థానికంగా స్థిరపడ్డారు. కైలాష్ తండ్రి కిషన్‌రావ్ కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేయడం, మేనమామ బీజేపీ తరఫున ప్రజాక్షేత్రంలో ఉండడంతో కైలాష్ చిన్ననాటి నుంచి రాజకీయాలకు దగ్గరగా ఉన్నారు.  కాలేజీ చదివేరోజుల నుంచి రాజకీయాల్లో చేరి క్రియశీలంగా వ్యవహరించేవారు.

1986లో మరాఠ్వాడా యూనివర్సిటీ సెనెటర్‌గా గెలుపొందిన ఆయన 1991లో జాల్నా కౌన్సిలర్‌గా 1992లో కౌన్సిల్ చెర్మైన్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఇలా అతిపిన్న వయసులో కౌన్సిలర్ చెర్మైన్ పదవి చేపట్టిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అనంతరం శివసేన, బీజేపీల కాషాయకూటమి అధికారంలో ఉండగా అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన కైలాష్‌ను కాంగ్రెస్ అధిష్టానం 1999లో జాల్నా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 2004లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ 2009లో మళ్లీ కాంగ్రెస్ టిక్కెట్‌పై ఆయన 20 వేల మెజార్టీతో శివసేన అభ్యర్థి అంబేకర్ భాస్కర్‌పై విజయం సాధించారు. తాను చేసిన అభివృద్ది పనులే ఈసారి తనను గెలిపిస్తాయని కైలాష్ చెబుతున్నారు.
 
నాందేడ్‌లో....
సౌత్ నాందేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇద్దరు తెలుగు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి దిలీప్ కందుకుర్తి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ప్రకాష్ మారావార్‌లు బరిలో ఉన్నారు. వీరిద్దరితోపాటు కాంగ్రెస్ తరఫున ఓంప్రకాష్ పోకర్ణా, ఎన్సీపీ నుంచి పాండురంగ కాకడే, శివసేన నుంచి హేమంత్ పాటిల్‌తోపాటు మొత్తం 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
 
దిలీప్ కందుకుర్తి...
దిలీప్ కందుకుర్తి 20 సంవత్సరాలకుపైగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందుతూ వస్తున్న ఆయన కార్పొరేటర్‌గా తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం ఆయనతోపాటు ఆయన భార్య కూడా కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభిస్తుందని ఆశించిన ఆయన కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఓంప్రకాష్ పోకర్ణానే మళ్లీ బరిలోకి దింపింది. దీంతో తెలుగు ప్రజల మద్దతు లభించడంతో కాంగ్రెస్‌పై తిరుగుబాటుచేసి బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ నుంచి టికెట్ లభించింది. బీజేపీ టికెట్ ఇవ్వడంతో పోటీ చేస్తున్నవారిలో కీలక సభ్యుడిగా మారారు.
 
ప్రకాష్ మారావార్...

ప్రకాష్ మారావార్‌కు నాందేడ్ జిల్లాలో శివవసేన స్థానిక నాయకునిగా మించి గుర్తింపు ఉంది. ఇటీవలే పార్టీలో వచ్చిన విభేదాల కారణంగా శివసేన నుంచి వైదొలగి ఎమ్మెన్నెస్‌లో చేరారు. ముఖ్యంగా శివసేన నాందేడ్ జిల్లా కార్యాధ్యక్షులుగా ఉండే ప్రకాష్‌ను కాదని మరొకరికి జిల్లా అధ్యక్షుని పదవికి ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేసిన ఆయన తిరుగుబాటు చేశారు. అనంతరం ఎమ్మెన్నెస్‌లో చేరారు. దీంతో ఎమ్మెన్నెస్ ఆయనను సౌత్ నాందేడ్ నుంచి బరిలోకి దింపింది. తనకంటు ఓ గుర్తింపు ఉన్న ప్రకాష్ మొదటిసారిగా సారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే తాను చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు ఓట్లు వేస్తారన్న నమ్మకంతో ఉన్నాడు. ఉత్తరనాందేడ్‌లో నివాసముంటున్న ఆయన దక్షిణ నాందేడ్ నుంచి పోటీచేయడం కొంత ప్రతికూలాంశంగా విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
Advertisement