Sakshi News home page

జూలైలో ఒకే!

Published Fri, Apr 14 2017 3:44 AM

elections in july

► ఎస్‌ఈసీ స్పష్టీకరణ
► ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం
► కోర్టులో పిటిషన్‌


సాక్షి, చెన్నై : జూలై నెలాఖరులోపు ఎన్నికల్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ) స్పష్టం చేసింది. ఎన్నికల పనులకు శ్రీకారం చుట్టామని, శరవేగంగా సాగుతున్నట్టు ఎస్‌ఈసీ కార్యదర్శి రాజశేఖర్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సాగుతున్న జాప్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యవహారం కోర్టులో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగా నికి ముచ్చెమటలు తప్పడం లేదు. మే 14లోపు ఎన్నికల్ని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయడం కష్టతరంగా మారడంతో కోర్టు ధిక్కారానికి గురి కావాల్సిన పరిస్థితి ఎస్‌ఈసీకి  ఏర్పడింది. 

ఎన్నికల అధికారి పదవీ కాలం ముగిసినా, ఆ స్థానం భర్తీలో జాప్యం, ఎన్నికల పనుల్లో జాప్యం వెరసి ఎస్‌ఈసీపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని డీఎంకే తరçఫున గత వారం పిటిషన్‌ సైతం దాఖలైంది. ఈ పిటిషన్‌ విచారణ ఈనెల 18వ తేదీ రానుంది. ఎక్కడ కోర్టు ధిక్కారానికిగురి కావాల్సి వస్తుందోనన్న ఆందోళనతో ఆగమేఘాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీ కమిషనర్‌గా మాలిక్‌ ఫిరోజ్‌ ఖాన్‌ను నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టగానే ఎన్నికల నిర్వహణకు తగ్గ పనుల్ని వేగవంతం చేయించారు. అయితే, కోర్టు  ఆదేశాల మేరకు మే 14లోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యమని తేల్చారు.

ఈ విషయాన్ని కోర్టుకు వివరిస్తూ మరింత సమయాన్ని కోరేందుకు నిర్ణయించి కొత్త పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో జులై నెలాఖరులోపు ఎన్నికలను పూర్తి చేయడానికి సిద్ధం అని స్పష్టం చేయడం విశేషం. ఎస్‌ఈసీ కార్యదర్శి రాజశేఖర్‌ తరఫున ఈ పిటిషన్‌ ఉదయం మద్రాసు హైకోర్టులో దాఖలు అయింది. అందులో ఎన్నికల నిర్వహణకు తగ్గ పనులకు శ్రీకారం ఎప్పడోచుట్టామని, పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. అయితే, మే14 లోపు అన్నది కష్టతరంగా ఉందని, అందుకే మరో రెండున్నర నెలల గడువు కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. జులై నెలాఖరులోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌ ఒకటి రెండు రోజుల్లో విచారణకు రానుంది.

అయితే, కోర్టు గడువు పొడిగించేనా అన్నది వేచిచూడాల్సిందే. ఇందుకు కారణంగా, ఇప్పటికే ఎన్నికల యంత్రాంగానికి పలు మార్లు సమయాన్ని కోర్టు పొడిగించినా, వాయిదాల పర్వంతో ఎస్‌ఈసీ ముందుకు సాగడం గమనార్హం. కాగా, నేరచరిత్ర కల్గిన వారు ఎన్నికల్లో నిలబడకుండా నామినేషన్ల పరిశీలన పకడ్బందీగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్‌ ముందు సాగింది. వివరణ ఇవ్వాలని ఎన్నికల అధికారులకు బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసింది. కాగా, అదే రోజు డీఎంకే దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసు విచారణకు రానుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement