Sakshi News home page

15ఏళ్లకు బయటపడిన అయ్యవారి భాగోతం

Published Thu, Jan 14 2016 11:53 AM

15ఏళ్లకు బయటపడిన అయ్యవారి భాగోతం

చెన్నై : అయ్యవారు చదువుకుంది ఒకటో తరగతి...అయితే ఏంటీ.... హెడ్ మాస్టర్గా ఏళ్ల తరబడి ఉద్యోగం వెలగబెడుతున్న ఓ ప్రబుద్ధుడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్టిఫికెట్ల తనిఖీల్లో నకిలీ అయ్యవారు అడ్డంగా దొరికిపోయారు.  వివరాల్లోకి వెళితే తమిళనాడు కృష్ణగిరి జిల్లా వేప్పనహల్లిలోని కంగోజీకొత్తూరు పంచాయతీలో అరుళ్‌సుందరం (42) ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణం సమీపం కదరీపురం ప్రాంతానికి చెందిన రాజా అనే వ్యక్తికి చెందిన సర్టిఫికెట్లను పెట్టి రాజా అనే పేరుతోనే హెచ్‌ఎంగా ఇతగాడు విధులు నిర్వహిస్తున్నాడు.


ధర్మపురి, కృష్ణగిరి, తిరువణ్ణామలై, వేలూరు జిల్లాల్లో సాగుతున్న ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల తనిఖీల్లో ఈ విషయం బైటపడింది. విచారణకు హాజరుకావాల్సిందిగా మంగళవారం అతనికి నోటీసు జారీచేశారు. దీంతో తన మోసం బైటపడిందని తెలుసుకున్నఅరుళ్‌సుందరం  బుధవారం పలాయనం చిత్తగించాడు. ఈ సంఘటనపై డీఈవో బాబు ఫిర్యాదు మేరకు వేప్పనహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నకిలీ అయ్యవారు 2001 నుంచి విధులు నిర్వహిస్తున్నా...అధికారులు మాత్రం 15 ఏళ్ల తర్వాత కళ్లు తెరవడం విశేషం. అది కూడా ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు తనిఖీ చేయాలంటూ కృష్ణగిరి జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఈ భాగోతం బయటపడింది. పరారీలో ఉన్న అరుళ్ సుందరం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
Advertisement