కరీంనగర్‌ నంబర్‌ వన్‌ | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ నంబర్‌ వన్‌

Published Tue, Oct 25 2016 12:58 PM

etela rajender review in karimnagar

తెలంగాణ పటంలో అగ్రగామిగా నిలుపుతాం 
ఆ దిశగా కార్యాచరణతో ముందుకు సాగుదాం
పర్యాటక కేంద్రంగా కరీంనగర్‌కు మహర్దశ
అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే అధికారులే బాధ్యులు
ప్రజలను అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఊర్కుండేది లేదు
హాస్టళ్లపై దృష్టి... నవంబర్‌ ఒకటినుంచి క్షేత్ర సందర్శన
జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్‌
అధికారుల తీరుపై ఎమ్మెల్యే బొడిగ శోభ ఆవేదన
అదే వాణిని వినిపించిన రసమయి బాలకిషన్‌...
ప్రొటోకాల్‌పై అధికారులకు మంత్రి మార్గదర్శనం
జిల్లా సమగ్రాభివృధ్ధికి ప్రజాప్రతినిధులు సూచనలు
 
సాక్షి, కరీంనగర్‌/కరీంనగర్‌ సిటీ : కరీంనగర్‌ జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌ జిల్లాగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మొదటిసారి జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ.. ‘అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం... అదేవిధంగా అందరం కలిసి బంగారు తెలంగాణ నిర్మించుకుందాం’ అని పిలుపునిచ్చారు. జిల్లాల విభజనతో అధికారులకు పరిపాలన, పర్యవేక్షణ సులభతరమైందన్నారు. ఇక పాలనలో కొత్త ఒరవడికి పునాది వేయాలని సూచించారు. జిల్లాలో జరిగే అభివృద్ధి భవిష్యత్‌ తరాలు గుర్తించుకునేలా ఉండాలన్నారు. ప్రజల ఆశయాలు, వారి అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని, అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుడు రెండవసారి రాకుండా చూడాలని, లేనిపక్షంలో సరైన కారణాలు తెలుపుతూ సమాధానం పంపించాలని అన్నారు. ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాలని అన్నారు. కరీంనగర్‌ను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు తన వంతు కృషి చేస్తానని, ఐటీ రంగంలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. 
 
అధికారుల తీరుపై ఇద్దరు ఎమ్మెల్యేల ఆవేదన
చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, చొప్పదండి తహసీల్‌దార్లను మార్చాలని పదే పదే విన్నివించినా ఫలితం లేదని, వారి వైఖరి కారణంగా ప్రజల్లో తమకు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యే బొడిగ శోభ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2.50 కోట్లు ఖర్చు చేసినా∙కొంపెల్లి చెరువు నుంచి కొండగట్టు మంచినీటి పథకం నేటికి నీరందించడం లేదని, నాసిరకం పైపులు, నాణ్యత లేని పనులు చేసినా.. క్వాలిటీ చూడకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ ప్రకాశ్‌రావు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని ఆమె ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన ఓ పోలీసు కుటుంబాన్ని అదుకునే విషయంలో కరీంనగర్‌ ఆర్డీవో చంద్రశేఖర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉండి తామే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధాకరమన్నారు. 
 
మానకొండూరు ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌.. అధికారులకు ఎమ్మెల్యేల కన్నా కాంట్రాక్టర్ల మీద అభిమానం ఎక్కువగా ఉందంటూ మండిపడ్డారు. తన నియోజకవర్గంలో రోడ్లకు సంబంధించి ఒక్క పని కూడా కాలేదన్నారు. పర్సెంటేజీలు లేకుండా పనులెందుకు చేయరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి ఈటల రాజేందర్‌ జోక్యం చేసుకుని ప్రారంభం కాని పనుల టెండర్లను రద్దు చేయాలన్నారు. రెసిడెన్షియల్‌ హాస్టళ్లలో సాయంత్రం వేళ్లలో అధికారులు డ్యూటీలు చేయడం లేదని, రిజిస్టర్‌లో మాత్రం సంతకాలుంటున్నాయని, ఇలాగైతే పిల్లలకు భద్రత ఎక్కడుంటుందని రసమయి ప్రశ్నించారు. తిమ్మాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి పాఠశాల స్థలాన్ని తీసుకోవద్దని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
 
కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌కు తలమానికం లాంటి లోయర్‌ మానేర్‌ డ్యాం వద్ద పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, జిల్లాలో జరిగే అభివృద్ధి పనులకు ఇసుకను కేటాయించేలా చూడాలని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కోరారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోనూ దళితులకు మూడెకరాల భూపంపిణీ చేయాలని కోరగా.. భూముల ధరలు అందుబాటులోæ తప్పకుండా పంపిణీ చేద్దామని మంత్రి వివరించారు.
 
హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వి.సతీష్‌బాబు మాట్లాడుతూ జిల్లాలు విడిపోయినా తెలంగాణకు కరీంనగర్‌ గుండెకాయలా ఉంటుందన్నారు. ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖలకు చెందిన రీజనల్‌ కార్యాలయాలు ఉన్నాయని, భవిష్యత్‌లో మరిన్ని వస్తాయన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలని, అందరం కలిసి జిల్లాను నంబర్‌ స్థానంలో నిలుపుదామన్నారు.
 
కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌సింగ్‌ మాట్లాడుతూ జిల్లాలో సుమారు ఏడు లక్షల జనాభా ఉంటే.. కరీంనగర్‌లోనే నాలుగు లక్షల మంది ఉన్నారన్నారు. నగర అభివృద్ధికి, స్మార్ట్‌సిటీకి తగిన సూచనలు ఇచ్చి సహకరించాలని కోరారు. పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటు తర్వాత అర్బన్‌ జోన్, రూరల్‌ జోన్‌ల విధానం బాగా లేదని, వెంటనే నార్త్‌ జోన్, సౌత్‌ జోన్‌లుగా చేయాలని కోరారు. కరీంనగర్‌లో అనాథ శవాలను తీసుకెళ్లడానికి వాహనం ఇవ్వాలని కోరగా.. త్వరలోనే వాహనం సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 
 
ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎమ్మెల్సీ భానుప్రసాద్, కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్, జాయింట్‌ కలెక్టర్‌ బద్రి శ్రీనివాస్, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశం మధ్యలో పలువురికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరై చెక్కులను మంత్రి అందజేశారు.
 
ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష.. 
ప్రభుత్వశాఖల పనితీరు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపైనా సమీక్ష జరిపారు. వసతిగృహాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నవంబర్‌ ఒకటి నుంచి అన్ని పాఠశాలల వసతి గృహాలను ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో క్షేత్ర సందర్శన చేసేలా కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు. హాస్టళ్లలో అన్ని రకాల సౌకర్యాలుండాలని, ఎన్ని నిధులివ్వడానికైనే ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఆసుపత్రులలో డాక్టర్లు తప్పనిసరిగా విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. 
 
జిల్లాలో అన్ని శాఖలకు సంబంధించిన ప్రారంభానికి నోచుకోని నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు ఒక్కోక్కరు ఐదు పనులకు టెండర్‌ దక్కించుకుంటూ ఒక్క పనిని కూడా సకాలంలో పూర్తి చేయడం లేదని, అటువంటి అలసత్వపు కాంట్రాక్టర్లను గుర్తించి వారి టెండర్లను రద్దు చేయాలన్నారు. అధికారులు దోషిగా నిలబడొద్దని, జవాబుదారీగా ఉండాలని రాజేందర్‌ సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లను సకాలంలో పంపిణీ చేయాలని, కుళ్లిపోయినవి పంపిణీ చేయొద్దని సూచించారు. జిల్లాలో అన్ని వర్గాలకు సంబంధించిన సమగ్ర బుక్‌లెట్‌ను తయారు చేయాలన్నారు. సమావేశాలలో చర్చించిన సమస్యల ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు రూపొందించాలన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement