మరో నలుగురు... | Sakshi
Sakshi News home page

మరో నలుగురు...

Published Thu, Jul 23 2015 1:56 AM

మరో నలుగురు... - Sakshi

అప్పులు తీర్చే మార్గం కానరాక
ఆత్మహత్య చేసుకున్న రైతులు
 

బెంగళూరు(బనశంకరి) : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం మరో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మైసూరు జిల్లా హెగ్గెడే దేవనకోటేలోని మాదాపుర గ్రామానికి చెందిన రైతు నటేశ్‌మూర్తి(30) తనకున్న మూడెకరాల పొలంలో పత్తి, మొక్కజొన్న పంట సాగు కోసం రూ.4 లక్షల మేర బ్యాంకుల నుంచి అప్పులు చేశాడు. అప్పు చెల్లించాలంటూ బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో, పంట నష్టంతో అప్పులు తీర్చే దారిలేక నటేశ్‌మూర్తి తన పొలంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై హెచ్‌డీ కోటే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు మైసూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ఆరుకు చేరుకుంది.

 తుమకూరు జిల్లాలో...
 తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా నిట్టూరు హొబళి అమరాపురకు చెందిన రైతు యోగానందమూర్తి(34) తనకున్నఐదు ఎకరాల పొలంలో పంట పెట్టుబడుల కోసం వివిధ బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.7 లక్షల మేర అప్పులు చేశాడు. ఇటీవల రోజుల్లో అప్పులు వారి వేధింపులు అధికం కావడంతో ఇతను సంబంధీకులను డబ్బు అడిగాడు. అక్కడ అతని ప్రయత్నాలు ఫలించకపోవడంతో పరువు పోతుందని మదన పడుతూ మంగళవారం రాత్రి భోజనం ముగించి నిద్రపోయాడు. గురువారం ఉదయం అనుమానాస్పదంగా అతను మరణించి కనిపించాడు. కుటుంబసభ్యుల నుంచి సమాచారం అందుకున్న గుబ్బి పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.

 హుబ్లీ జిల్లాలో..
  హుబ్లీ జిల్లా కుందగోళ తాలూకా బెట్టదూరు గ్రామానికి చెందిన రైతు రామప్పకడపట్టి(66), తనకున్న నాలుగు ఎకరాల పొలంలో సోయాబీన్స్, సెనగ పంట వేశాడు. వ్యవసాయ పెట్టుబడులకోసం బ్యాంకు నుంచి రూ.2 లక్షల మేర అప్పు చేశాడు. పంట దిగుబడికి వచ్చే సమయంలో అకాల వర్షంతో పూర్తిగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలోనే అప్పులు తీర్చాలంటూ ఒత్తిళ్లు మొదలయ్యాయి. వాటిని  తీర్చే మార్గం కానరాక మంగళవారం రాత్రి ఇంటి వద్దనే అతను విషం తాగాడు. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ అతను మరణించాడు. ఘటనపై కుందగోళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
మండ్య జిల్లాలో...
 మండ్య జిల్లా శ్రీరంగ పట్టణానికి చెందిన రైతు కుమార్(45) తనకున్న అర ఎకరా పొలంతో పాటు మరో ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని చెరుకు,  అరటి పంట వేశాడు. పంట పెట్టుబడులు, తన కుమారుడి వైద్యం కోసం సుమారు రూ.4 లక్షల మేరకు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేశాడు. ్రృకతి వైపరీత్యాలతో పంట పూర్తిగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలోనే అప్పుల వారి నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. వేధింపులు తాళలేక బుధవారం మధ్యాహ్నం  కుమార్ విషం తాగాడు. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని మైసూరులోని కిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఘటనపై శ్రీరంగపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు మండ్య జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య 22కు చేరుకుంది.
 
 
 

Advertisement
Advertisement