మెట్టు దిగని జాలరన్న | Sakshi
Sakshi News home page

వీడని ఉత్కంఠ

Published Thu, Nov 16 2017 7:46 AM

FIR filed against ICG over ‘firing’ incident - Sakshi

సాక్షి, చెన్నై: ‘అబ్బే..ఫైరింగ్‌ జరగనే లేదు’ అని ఓ వైపు ప్రకటించి, మరో వైపు మెట్టు దిగి మరీ ‘సారీ’తో జాలర్లను బుజ్జగించే పనిలో కోస్టుగార్డు వర్గాలు నిమగ్నమయ్యాయి. సారీతో సరి పెట్ట వద్దంటూ పట్టువీడని విక్రమార్కుల వలే జాలర్లు పోరుబాటలో నిమగ్నం అయ్యారు. రామేశ్వరంలో సమ్మె సైరన్‌ మోగడంతో పాటు, గురువారం భారీ నిరసనకు జాలర్ల సంఘాలు నిర్ణయించాయి. తమిళ జాలర్లకు కడలిలో నిత్యం శ్రీలంక సేనల రూపంలో ముప్పు ఎదురవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రక్షణగా నిలవాల్సిన భారత కోస్టు గార్డు వర్గాలు, తమ మీదే తుపాకుల్ని ఎక్కు బెట్టడం వివాదానికి దారి తీసింది. అయితే, తమ వాళ్లెవ్వరూ కాల్పులు జరప లేదని, అస్సలు కడలిలో అలాంటి ఘటనే జరగలేదంటూ కోస్టుగార్డు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. జాలర్లు కపటనాటకాన్ని ప్రదర్శిస్తున్నారంటూ, ఓ కుంటిసాకును తెర మీదకు తెచ్చారు. ఫైరింగ్‌ జరగ లేదుగానీ, నిషేధిత వలల్ని ఉపయోగించడంపై హెచ్చరికలు మాత్రమే చేశామని ప్రకటించారు. నిషేధిత వలల్ని కప్పి పుచ్చడం లక్ష్యంగా జాలర్లు తమ మీద నిందల్ని వేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా ‘సారీ’ అంటూ జాలర్లను బుజ్జగించేందుకు కోస్టుగార్డ్‌ వర్గాలు రంగంలోకి దిగడం గమనార్హం.

సమ్మెబాట: తమ మీద దాడికి నిరసనగా రామనాథపురం జిల్లా జాలర్లు బుధవారం భగ్గుమన్నారు. వీరికి మద్దతుగా నాగపట్నం, పుదుకోట్టై జాలర్లు కదిలే పనిలో పడ్డారు. రామేశ్వరం జాలర్లు వేటను బహిష్కరిస్తూ నిరవధిక సమ్మెబాట పట్టారు. జాలర్లు తమ వైపు నుంచి ఒత్తిడి పెంచే పనిలో పడడంతో సముద్ర తీర భద్రతా విభాగం రంగంలోకి దిగింది. కేసు నమెదు చేసిన ఆ విభాగం అధికారులు, ప్రత్యేక విచారణ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం రామేశ్వరం, కచ్చదీవు సమీపంలో పరిశీలించింది. గాయపడ్డ జాలర్లను విచారించింది. అదే సమయంలో తమ మీద ఎక్కు పెట్టిన తూటాను ఆ విచారణ బృందానికి జాలర్లు అందించడంతో కోస్టుగార్డు వర్గాలు సందిగ్ధంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. అస్సలు కాల్పులే జరగలేదన్నప్పుడు, పేలిన ఆ తూటా శకలం జాలర్లకు ఎలా చిక్కిందోనన్న ప్రశ్న బయలుదేరింది. దీంతో కోస్టుగార్డు వర్గాలు మెట్టు దిగి సారీ చెప్పుకోక తప్పలేదు.

మెట్టు దిగని జాలరన్న
సముద్ర తీర భద్రతా విభాగం, కోస్టుగార్డు, మత్స్యశాఖ, రెవెన్యూ అన్ని విభాగాల అధికారులు బుధవారం మధ్యాహ్నం ఆగమేఘాలపై జాలర్ల సంఘాల ప్రతినిధులకు సమాచారం అందించారు. మండపంలో ప్రత్యేక సమావేశానికి ఏర్పాటు చేసిన హాజరు కావాలని ఆహ్వానం పలికారు. తొలుత ఆ సమావేశానికి వెళ్లడానికి జాలర్ల సంఘాలు నిరాకరించాయి. అయితే, స్థానిక అధికారులు ఆహ్వానించడంతో వారికి గౌరవాన్ని ఇవ్వాలన్న భావనతో అక్కడికి వెళ్లారు. సమావేశం ప్రారంభం కాగానే, కోస్టుగార్డు తరఫున ‘సారీ’ అన్న పలుకు వినబడడం, క్షణాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం చోటు చేసుకున్నాయి. అలాగే, ఇక ప్రతి నెలలో ఓ రోజు జాలర్లు, కోస్టుగార్డుతో పాటు అన్ని విభాగాల సమన్వయంతో సమావేశాలు జరిగే విధంగా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగిందని సూచించారు. కోస్టుగార్డు స్థానిక అధికారుల నుంచి సారీ అన్న పలుకు విన్న జాలర్ల సంఘాల ప్రతినిధులు విస్మయంలో పడ్డారు. అయితే, ఆ అధికారులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. తూటాల్ని పేల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు స్థానిక అధికారులు అది జరుగుతుందని, అయితే, అందుకు సమయం పడుతుందని వివరణ ఇచ్చుకున్నారు.

విచారణ జరుగుతున్నదని, చర్యలు తప్పనిసరిగానే ఉంటాయన్న హామీని ఇచ్చినా, జాలర్ల సంఘాల నేతలు మెట్టు దిగ లేదు. ఇది తమ ఒక్కరి సమస్య కాదు అని, జాలర్లందరి సమస్యగా గుర్తు చేస్తూ, అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా, అంత వరకు సమ్మె కొనసాగుతుందని, ముందుగా నిర్ణయించిన మేరకు గురువారం భారీ నిరసన కార్యక్రమం సాగుతుందని జాలర్ల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేయడంతో రామేశ్వరంలో ఉత్కంఠ తప్పడం లేదు. ఇక, నిన్నటి వరకు ఫైరింగ్‌ జరగ లేదన్న వాళ్లు, హఠాత్తుగా సారీ చెప్పడాన్ని తాము అంగీకరించబోమని, ఫైరింగ్‌ ఘటనలు పునరావృతంకాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని జాలర్ల సంఘాల ప్రతినిధులు, పలు రాజకీయ పక్షాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

రామనాథ పురం జిల్లా రామేశ్వరానికి చెందిన జాలర్లపై భారత్‌ కోస్టుగార్డు వర్గాలు తుపాకుల్ని ఎక్కు బెట్టడం వివాదానికి దారితీసింది. ఫైరింగ్‌ జరగలేదుగానీ, నిషేధిత వలల్ని ఉపయోగించడంపై హెచ్చరికలు మాత్రమే చేశామని ప్రకటించారు. అనంతరం  హఠాత్తుగా ‘సారీ’ అంటూ జాలర్లను బుజ్జగించేందుకు కోస్టుగార్డ్‌ వర్గాలు రంగంలోకి దిగాయి. నిన్నటి వరకు ఫైరింగ్‌ జరగలేదన్న వాళ్లు, హఠాత్తుగా సారీ చెప్పడాన్ని తాము అంగీకరించబోమని, ఫైరింగ్‌ ఘటనలు పునరావృతంకాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని జాలర్ల సంఘాల ప్రతినిధులు, పలు రాజకీయ పక్షాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితులతో ఉత్కంఠ వీడలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement