నిరుద్యోగంలో ఫస్ట్ | Sakshi
Sakshi News home page

నిరుద్యోగంలో ఫస్ట్

Published Thu, Dec 11 2014 2:52 AM

First unemployment in  tamilnadu

చెన్నై, సాక్షి ప్రతినిధి: నిరుద్యోగంలో తమిళనాడు దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో ఎలా ఉన్నా నిరుద్యోగంలో మాత్రం తమిళనాడు అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఉపాధికల్పనా కార్యాలయ లెక్కల ప్రకారం నిరుద్యోగుల సంఖ్యలో రాష్ట్రంలో 77 లక్షల మంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు.  పట్టభద్రులైన యువత మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కంటారు. అందులో అధికశాతం మందికి ప్రభుత్వం ఉద్యోగం ఓ లక్ష్యం. అయితే ఎంతో నైపుణ్యం కలిగిన యువతకు సైతం ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షపండుగా మారిపోయింది. అయినా మొక్కవోని దీక్షతో ఉపాధికల్పనా కార్యాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకునేవారి సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. ఉపాధి కల్పనా కార్యాలయాల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల వివరాలను ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టగా దేశం మొత్తం మీద 4.47 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు తేలింది. రాష్ట్ర స్థాయి వివరాలను పరిశీలిస్తే 77 లక్షల మందితో ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడు ముందుంది.
 
 ఉపాధి కల్పనా కార్యాలయాల్లో క్యూలు: ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం రాకపోతుందా అనే ఆశతో ఎందరో నిరుద్యోగులు ఉపాధికల్పనా కార్యాలయాల వద్ద ఇంకా క్యూ కడుతూనే ఉన్నారు. అయితే నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు నెరపాల్సిన విద్య, ప్రజా పనులు, జాతీయ రహదారులు, రవాణా, పోలీస్ తదితర శాఖల్లో సైతం ఖాళీలను భర్తీ చేయడం లేదు. ప్రజా పనుల శాఖలో 400 ఖాళీలకు గానూ 202 పోస్టులకు మాత్రమే ఇటీవల రాత పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్లు అభ్యర్దులు వాపోతున్నారు. ప్రజా పనుల శాఖలో 250 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
 
  జనాభా పెరుగుదలకు అనుగుణంగా సేవలను విస్తరిస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్య కూడా పెంచాల్సి ఉంది. దీని వల్ల ఖాళీలు భర్తీ కావడంతోపాటూ కొత్త ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతుంది. అయితే   దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో అంటే 1947లో ఏరకమైన ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో అవే నేటికీ కొనసాగుతున్నాయి. ఏడాదికి సగటున ఉపాధి కల్పనా కార్యాలయాల్లో 10 వ తరగతి నుంచి ప్లస్‌టూ వరకు పేర్లను నమోదు చేసుకునే విద్యార్థుల సంఖ్యే 5.5లక్షలుగా ఉంటోంది. వీరుగాక పట్టభద్రులు, ఉపాధ్యాయ, అధ్యాపక, పీజీ, ఇంజనీర్లు, డాక్టర్లు క లుపుకుంటే 9 లక్షల మంది వరకు ఉపాధికల్పనా కార్యాయాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రావన్న నిరాశతో నమోదు చేసుకోని వారి సంఖ్య భారీగానే ఉండడం గమనార్హం.
   
 పది నెలల్లోనే పదవీ విరమణ
 ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యం నెరవేరినా పదినెలల్లోనే పదవీ విరమణ పొందిన విచిత్ర సంఘటన జరిగింది. తేని జిల్లాకు చెందిన వేలుమణి పాలిటెక్నిక్ ఉత్తీర్ణత సాధించి, ప్రభుత్వ ఉద్యోగం కోసం మధురై జిల్లా ఉపాధికల్పనా కార్యాయంలో తన పేరును 1987లో నమోదు చేసుకున్నాడు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా తనపేరును రెన్యువల్ చేసుకుంటూనే ఉన్నాడు. ఉద్యోగార్హత వయసు మీరిపోరుున తరుణంలో నిరాశకు గురైన అతను కోర్టులో కేసు వేశాడు. వేలుమణికి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువడటంతో 2012 ఏడాది మధ్యలో 58 ఏళ్ల వయసులో ఎట్టకేలకూ ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. అయితే పదినెలల సర్వీసులోనే పదవీ విరమణ చేయకతప్పలేదు. దీంతో ఇతర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు చేకూరే ప్రయోజనాలేవీ అందలేదు. దీంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగి అనే పేరు మినహా వేలుమణికి మరే సంతోషమూ మిగల్లేదు.

Advertisement
Advertisement