డ్రగ్స్ మాఫియాతో పోలీసుల మిలాఖత్ | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ మాఫియాతో పోలీసుల మిలాఖత్

Published Sat, May 30 2015 10:10 AM

డ్రగ్స్ మాఫియాతో పోలీసుల మిలాఖత్ - Sakshi

దాని ముద్దు పేరు 'మ్యావ్ మ్యావ్'.. అసలు పేరు మిథైన్ ఎఫిడ్రోన్ లేదా మెఫిడ్రోన్. పేరుకు తగ్గట్టే దీన్ని సేవిస్తే డ్రోన్ మాదిరి అలా అలా గాలిలో చక్కర్లు కొట్టినట్టుంటుంది. ఇప్పటికే మీకు అర్థమైఉంటుంది.. మ్యావ్ మ్యావ్ మాదకద్రవ్యమని! మరి ఈ నిషేధిత పదార్థం ఎవరిదగ్గర ఎంత దొరికిందో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. మాఫియా ఆటకట్టించాల్సిన ఓ పోలీసు వద్ద కేజీలకొద్దీ మిథైన్ ఎఫిడ్రోన్ దొరికింది.

పోలీస్ స్టేషన్లోని వ్యక్తిగత లాకర్లో 12 కేజీలు, ఇంట్లో మరో 114 కేజీలు.. మొత్తం 126 కేజీల మాదకద్రవ్యాన్ని దాచి ఉంచిన కానిస్టేబుల్ ధర్మరాజ్ కలోఖేను గత మార్చి 9న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టుచేశారు. ఆ సంచలనానికి కొనసాగింపుగా.. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై శుక్రవారం మరో ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు.

ధర్మరాజ్ ఇప్పటికే డిస్మిస్ కాగా, శుక్రవారం అరెస్టయిన వారిలో సుహాస్ గోఖలే, గౌతం గైక్వాడ్ లు ఇన్ స్పెక్టర్లుకాగా, శంకర్ సారంగ్ ఎస్సైగా, జ్యోతిరాం మానే ఏఎస్సైగా, యశ్వంత్ పరాటే కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. వీరంతా లేడీ డాన్ 'బేబీ' పటంకర్ అలియాస్ శశికళ గ్యాంగ్ తో సంబంధాలు పెట్టుకుని, డ్రగ్స్ సరఫరాకు సహకరిస్తున్నారని,  ఈ ఐదుగురిపై మాదక ద్రవ్యాల అక్రమరవాణా చట్టం కింద కేసు నమోదుచేశామని ముంబై డిప్యూటీ కమిషనర్ మహాన్ దహికర్ చెప్పారు.

మే 15న అరెస్టయిన తమిళుడు పాల్ రాజ్ దొరైస్వామి ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు సాగించిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు చివరకు తమశాఖ వారినే అరెస్టు చేయడం గమనార్హం. కానిస్టేబుల్ ధర్మరాజ్ ను అరెస్టుచేసిన కొద్దిరోజులకే బేబీ పటంకర్ కూడా అరెస్టయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement