రాష్ట్రంలో ‘రవాణా’ బంద్ | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ‘రవాణా’ బంద్

Published Wed, Apr 29 2015 4:02 AM

For road safty bill opposing all the road transport groups are given call for bandh

- రోడ్డు భద్రత బిల్లు-2014 కు  వ్యతిరేకంగానే..
- దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన ఎన్‌ఎఫ్‌టీవీ
- బిల్లుపై పునరాలోచించాలని డిమాండ్
సాక్షి, ముంబై:
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘రోడ్డు భద్రత బిల్లు-2014’కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఆర్టీసీ, బెస్ట్ బస్సు, ఆటో, ట్యాక్సీల సంఘాలు ఏప్రిల్ 30న బంద్‌కు పిలుపునిచ్చాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ (ఎన్‌ఎఫ్‌టీవీ) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా రైల్వే మినహా మిగతా రవాణా వ్యవస్థలన్నీ పూర్తిగా నిలిచిపోనున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన రోడ్డు భద్రత బిల్లు కారణంగా ప్రైవేటు రవాణ వ్యవస్థకు మేలు జరిగినప్పటికీ ఆటో, ట్యాక్సీ, ఆర్టీసీ, బెస్ట్ లాంటి ప్రజా రవాణ సంస్థలపై ప్రభావం పడుతుందని నేషనల్ ఫెడరేషన్ అభిప్రాయపడుతోంది.

ఈ విషయంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో వివిధ సంఘాల నాయకులు భేటీ అయ్యారని, ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దేశ వ్యాప్తంగా చక్కా జాం (చక్రాలకు బ్రేక్) చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. బిల్లుపై కేంద్ర పునరాలోచించాలని డిమాండ్ చేసింది. దేశంలోని 40 లక్షల మంది కార్మికులతో పాటు రాష్ట్రంలోని ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లు, రెండు లక్షల మంది ట్యాక్సీ డ్రైవర్లు, ముంబైలో సేవలందిస్తున్న బెస్ట్, ఆర్టీసీ సేవలు నిలిచిపోతాయని ఫెడరేషన్ స్పష్టం చేసింది. శివసేన అనుబంధ యూనియన్లు మినహా హింద్ మజ్దూర్ సభ, భారతీయ మజ్దూర్ సంఘ్, సిటూ, ఐటక్, ఇంటక్ తదితర యూనియన్లు బంద్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది.

ముంబైకర్ల ఆందోళన
ఆటో, ట్యాక్సీ, బస్సులు అన్నీ బంద్ అయితే రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందని ముంబైకర్లు ఆందోళన చెందుతున్నారు. ముంబైలో లోకల్ రైళ్ల తర్వాత అత్యధిక శాత ం ప్రజలు ప్రయాణించేది బెస్ట్ బస్సుల్లోనే. ప్రతిరోజు దాదాపు 40 లక్షల మంది ముంబైకర్లు బెస్ట్ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. లక్షకుపైగా ఆటోలు, 15 వేలకుపైగా ట్యాక్సీలు నగరంలో సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రంలో రవాణా మొత్తం స్తంభించిపోనుంది.

Advertisement
Advertisement