మరింత మందికి వైద్య విద్య | Sakshi
Sakshi News home page

మరింత మందికి వైద్య విద్య

Published Wed, Apr 30 2014 3:21 AM

మరింత మందికి వైద్య విద్య

  •  రాష్ర్టంలో ఆరు నూతన వైద్య కళాశాలలు
  •  అదనంగా 900 సీట్లు
  •  70 శాతం నిర్మాణ పనులు పూర్తి
  •  తర్వాత ఏడాదిలోనూ మరో ఆరు కాలేజీల ఏర్పాటు
  •  ఐదు చోట్ల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
  •  వైద్య విద్య ఫీజులు, సీట్ల పంపకం యథాతథం
  •  మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్ వెల్లడి
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొప్పళ, గుల్బర్గ, గదగ, కార్వార, మడికేరి, చామరాజ నగరలలో కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వైద్య విద్యా శాఖ మంత్రి డాక్టర్ శరణ్ ప్రకాశ్ పాటిల్ తెలిపారు. ఇప్పటికే కళాశాలల భవనాల నిర్మాణం 70 శాతం వరకు పూర్తయిందని చెప్పారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ కళాశాలల్లోని సదుపాయాలను భారతీయ వైద్య మండలి పరిశీలించి, ప్రారంభానికి అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో మండలి సభ్యులు కళాశాలలను సందర్శిస్తారని వెల్లడించారు. అనుమతి లభించిన వెంటనే కళాశాలలను ప్రారంభిస్తామన్నారు. తద్వారా 900 వైద్య విద్య సీట్లు అదనంగా లభ్యమవుతాయని చెప్పారు. 2015-16 విద్యా సంవత్సరంలో చిక్కబళ్లాపురం, తుమకూరు, చిత్రదుర్గ, యాదగిరి, హావేరి, బాగలకోటెలలో మరో ఆరు కళాశాలలను ప్రారంభిస్తామని వెల్లడించారు. వీటి కోసం ఇప్పటికే 20 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 12 కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి చర్యలు చేపట్టిందని అన్నారు. ఇదో గొప్ప సాధన అన్నారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలను స్థాపించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

     ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
     బళ్లారి, మైసూరు, గుల్బర్గ, హుబ్లీ, బెల్గాంలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఒక్కో ఆస్పత్రికి రూ.150 కోట్లు అవసరమవుతాయన్నారు. నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు. బెల్గాం, హుబ్లీలకు కేంద్రం నిధులు సమకూరుస్తుందన్నారు. మిగిలిన చోట్ల రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుందని చెప్పారు.

     ఫీజులు యథాతథం
     వైద్య విద్యా కోర్సులకు సంబంధించి ఫీజులు, సీట్ల పంపకంపై ఎలాంటి మార్పులు లేవని మంత్రి స్పష్టం చేశారు. గత ఏడాదే ఫీజును నిర్ణయించామని గుర్తు చేశారు. సీఈటీ ద్వారా భర్తీ చేసే సీట్ల ఫీజులను కూడా పెంచలేదని తెలిపారు. గత ఏడాది పద్ధతే ఈ ఏడాదీ కొనసాగుతుందన్నారు. పీజీ కోర్సుల్లో  ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ తేదీలను రెండు, మూడు రోజుల్లో నిర్ణయిస్తామన్నారు. కాగా డీమ్డ్ యూనివర్శిటీల్లో 25 శాతం సీట్లను ప్రభుత్వానికి అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. దరిమిలా పీజీ మెడికల్ సీట్లు ఈసారి అదనంగా లభిస్తాయని చెప్పారు.

Advertisement
Advertisement