దుర్గమ్మ చీరలు మాయం | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ చీరలు మాయం

Published Thu, Jan 12 2017 11:44 AM

దుర్గమ్మ చీరలు మాయం

విజయవాడ: కనక దుర్గమ్మ ఆలయంలో ఇంటిదొంగల చేతివాటంతో అమ్మవారి సొమ్ము పక్కదోవ పడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ మొక్కులు చెల్లింపుల్లో భాగంగా దుర్గమ్మకు చీరెలు సమర్పించుకుంటారు. ఈ చీరెలను ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ లో దేవాదాయశాఖ అధికారులకు అప్పగించి, భక్తులు ఈ మేరకు రసీదులు స్వీకరిస్తారు. ఈ రకంగా వచ్చిన చీరెలను ఆలయ అధికారులు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు పాడుకునేందుకు వీలు కల్పిస్తారు. తాజాగా అమ్మవారికి వచ్చిన వందలాది చీరెలను మూటలుగా కట్టి ఆలయంలోని మహామంటపంలో భద్రపరిచారు. అయితే అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆలయంలో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది ఒకరు గుట్టుచప్పుకు కాకుండా చీరెలు భద్రపరిచిన ప్రాంతానికి వెళ్లి రెండు మూటలను తస్కరించాడు.
 
సీసీ కెమేరాల్లో ఈ చోరీ విజువల్స్ రికార్డయ్యాయి. అయితే ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లిన చోరీ సంగతి బయటపడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తీరా విషయం మీడియా దృష్టికి కూడా రావడంతో ఆలయ ఈఓ సూర్యకుమారి సిబ్బంది చేతివాటంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టర్ పరిధిలో వున్న చీరెలను కాంట్రాక్ట్ సిబ్బంది చోరీ చేశాడని చెప్పి ఈ ఘటనను చిన్నదిగా చూపేందుకు ఆలయంలోని అధికారులు ప్రయత్నిస్తుండటం విశేషం. ఇదే తరహాలో ఆలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన ప్రతి వస్తువు ఇంటిదొంగల చేతివాటానికి గురవుతోందనే ఆరోపణలున్నాయి. ఆలయ ఈఓ పర్యవేక్షణా లోపం వల్లే ఇటువంటి సంఘటనలు వరుసగా పునరావృత్తం అవుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.
 
భవానీదీక్షల విరమణ సందర్బంగా కూడా  అమ్మవారి ఖజానాకు చేరాల్సిన రూ. 5 లక్షల రూపాయల విలువైన భక్తులు సమర్పించిన బియ్యం, పూజాద్రవ్యాలు కూడా ఇలాగే సిబ్బంది చేతివాటంతో పక్కదోవ పట్టాయి. ఈ సంఘటనపై తీసుకున్న చర్యలు నామమాత్రం. తాజాగా చీరెల చోరీ. ఇప్పటికైనా ఆలయ అధికారుల చిత్తశుద్దితో వ్యవహరించకపోతే అమ్మవారి సొమ్ము దొంగల పాలు అయ్యే ఘటనలు మరింత పెరుగుతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement