నేటితో కత్తిరకు కత్తెర | Sakshi
Sakshi News home page

నేటితో కత్తిరకు కత్తెర

Published Fri, May 29 2015 3:34 AM

నేటితో కత్తిరకు కత్తెర

* 25 రోజుల చండ ప్రచండానికి ముగింపు
* వర్షాలతో చల్లబడిన రాష్ట్రం

చెన్నై,సాక్షి ప్రతినిధి: వేసవి బాధితులకు శుభవార్త. 25 రోజులుగా నిప్పు లు చెరిగిన కత్తెర వెయిల్‌కు నేటితో తెరపడనుంది. రాష్ట్రం ఇక క్రమేణా చల్లబడే అవకాశం ఉంది. ఎండవేడిమి భగభగలతో నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం ఇక వర్షానుభూతులతో పరవశించనుంది. తమిళ పంచాగం ప్రకారం అగ్నినక్షత్రాన్ని కత్తిరివెయిల్ అని పిలుస్తారు. గత ఏడాది కత్తిరి వెయిల్ కాలంలో 118 డిగ్రీల అత్యథిక ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ నెల 4వ తేదీన కత్తిరి వెయిల్ ప్రారంభమై తన ప్రతాపాన్ని చూపింది. కత్తిరి వెయిల్ ఆరంభ దినాల్లో కొద్దిపాటూ వర్షాలు కురిసిన కారణంగా ఎండవేడిమిని  ప్రజలు పెద్దగా ఎదుర్కొనలేదు. అయితే క్రమేణా ఎండల తీవ్రత పెరిగిపోయి రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. మిట్టమధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇంటి నుండి బయటకు రావడమే మానేశారు. రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. తగిన జాగత్రలు తీసుకోకుండా ఇళ్లను వదిలి రావద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.  ఈ ఏడాది కత్తిరి వెయిల్ కాలంలో చెన్నైలో 108 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
 
చల్లబడుతున్న రాష్ట్రం: కత్తిరివెయిల్ ఈనెల 29వ తేదీతో ముగుస్తున్నందుకు సూచనగా బుధ, గురువారాల్లో రాష్ట్రమంతా మేఘావృతమైంది. గత 25 రోజులుగా ఎండవేడిమికి అల్లాడుతున్న జనానికి ఊరటనిస్తూ అనేకచోట్ల వర్షాలు కురిసాయి. ఉత్తరచెన్నై, పుదుచ్చేరీలలో మరో రెండురోజలు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. కత్తిరి వెయిల్‌కు శుక్రవారంతో కత్తెరపడుతున్నందున రాష్ట్రం క్రమేణా చల్లబడుతుందని అంచనావేస్తున్నారు.
 
వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల బుధవారం రాత్రి వర్షాలు కురిసాయి. ముఖ్యంగా డెల్టా జిల్లాలు మండువేసవి నుండి వర్షంతో ఉపశమనం పొందాయి. బుధవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం గంటపాటూ ఎడతెరిపి లేకుండా కురిసింది. కుంభకోణం, తిరునాగేశ్వరం, పాపనాశం తదితర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడింది. తిరువారూరు, నాగపట్టినంలో కూడా వర్షం పడింది. వేలూరులో బుధవారం సాయంత్రం తుంపర్లతో ప్రారంభమైన వాన క్రమేణా భారీ వర్షంగా మారింది. ఆంబూరులో రెండుగంటల పాటూ కురుసిన భారీ వర్షానికి ఈదురుగాలులు, పిడుగులు తోడైనాయి.

చెన్నై నగరం సహా రాష్ట్రంలోని అనేక జిల్లాలు గురువారం ఉదయం నుండి దట్టమైన మబ్బులు కమ్ముకుని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాయి. ఊటీ, కున్నూరు, కడలూరు, కొత్తేరీ, అవలాంజీ ఆ పరిసర ప్రాంతాలు గురువారం తెల్లవారుజామున ఓ మోస్తరు వర్షం కురిసింది. తిరుపూరులో బుధవారం రాత్రి 10.30 గంటలకు చినుకులతో ప్రారంభమై జోరందుకుంది. కోవైలో గురువారం తెల్లవారుజామున గంటపాటూ భారీ వర్షం కురిసింది.

పొల్లాచ్చిలో బుధవారం రాత్రి 10.30గంటలకు ప్రారంభమైన గురువారం తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం పడింది. తిరుచ్చి, కరూరు, పుదుక్కోట్టై, పెరంబలూరు, సేలం, పుదుచ్చేరీలో సైతం భారీ వర్షాలు కురిసాయి. భువనగిరిలోని వడతలై గ్రామంలో కలైమణి అనే రైతు పెంచుతున్న 3 పశువులు పిడుగుపడి మృతిచెందాయి. అంతేగాక అతని గుడిసెతోపాటు సమీపంలోని మరో మూడు గుడిసెలు పిడుగుతాకిడికి రేగిన అగ్నికి ఆహుతయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement