ప్రత్యేక పరిస్థితుల్లో తప్పు జరిగింది.. | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పరిస్థితుల్లో తప్పు జరిగింది..

Published Wed, Jul 27 2016 4:14 PM

ప్రత్యేక పరిస్థితుల్లో తప్పు జరిగింది.. - Sakshi

ముంబై: బాంబే హైకోర్టు ఓ అత్యాచారం కేసులో అసాధారణమైన నిర్ణయం తీసుకుంది. బాధితురాలికి (23) నిందితుడు 10 లక్షల రూపాయలు చెల్లించడంతో పాటు ఆమె సమ్మతి మేరకు కోర్టు ఈ కేసును కొట్టివేసింది.

బాధితురాలు ప్రస్తుతం ఏడో నెల గర్భవతి. తన అంగీకారంతో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ తప్పు జరిగిందని బాధితురాలు కోర్టుకు తెలియజేసింది. తాము ఈ కేసును పరిష్కరించుకున్నామని, కేసు కొట్టివేస్తే తనకు అభ్యంతరంలేదని కోర్టుకు తెలియజేసింది. పెళ్లిచేసుకుంటానని నమ్మించి, తనను అత్యాచారం చేశాడని ఆమె తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాను తప్పుడుఅభిప్రాయంతో ఫిర్యాదు చేశానని ఆమె కోర్టుకు చెప్పింది. నిందితుడి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఇద్దరు పరస్పర అంగీకారంతో రిలేషన్ పెట్టుకున్నారని, వీరిద్దరూ సమస్యను పరిష్కరించుకున్నారని, కేసును కొట్టివేయాలని కోర్టుకు విన్నవించారు.

బాధితురాలి, ఆమెకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్ కోసం నిందితుడు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాడని, బాధితురాలి సమ్మతి, విన్నపం మేరకు ప్రత్యేక పరిస్థితుల కింద ఈ కేసును కొట్టివేస్తున్నట్టు హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రకటించింది. జాతీయ బ్యాంక్లో పదేళ్ల కాలపరిమితికి ఈ డబ్బును డిపాజిట్ చేయాల్సిందిగా నిందితుడిని ఆదేశించింది. ఈ కాలవ్యవధిలో బాధితురాలు వడ్డీని మాత్రం తీసుకోవాలని, కాలపరిమితి ముగిసిన తర్వాత డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చని సూచించింది.

Advertisement
Advertisement