‘జాగ్వార్‌’ ని ఎలా అడ్డుకుంటారో చూస్తా..

25 Oct, 2016 11:38 IST|Sakshi

బెంగళూరు : కన్నడ చలనచిత్ర రంగంలోని కొంత మంది కారణంగా శాండిల్‌వుడ్‌ పరిశమ్ర అప్రతిష్ట పాలవుతోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్వీయ నిర్మాణంలో తన కుమారుడు నిఖిల్‌ హీరోగా వెండితెరకు పరిచయం చేస్తూ జాగ్వార్‌ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ... ఇదే నెలలో దీపావళీ విడుదల కానున్న ఇద్దరు అగ్రనటుల సినిమాల విడుదల కారణంగా జనాదరణ పొంది, ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్న జాగ్వార్‌ చిత్రం థియేటర్ల నుంచి తొలగించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

తాను కూడా గతంలో ఎన్నో చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించానని, ఇతర చిత్రాలకు నష్టం వాటిల్లకుండా అప్పటికి అందుబాటులో ఉన్న థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేసుకునే వాళ్లమని గుర్తు చేశారు. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్న నిర్మాతల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శిమవుతున్న జాగ్వార్‌ చిత్రాన్ని ఏ విధంగా అడ్డుకుంటారో తాను చూస్తానని హెచ్చరించారు. ఆర్థికంగా బలంగా ఉన్న కొంత మంది వ్యక్తుల చేతుల్లో కన్నడ ఇండస్ట్రీ నలిగిపోతోందని దీనిని ఇకపై ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. జాగ్వార్‌ చిత్రాన్ని త్వరలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా విడుదల చేయనున్నట్లు కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్‌గౌడ, నటుడు సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు