Sakshi News home page

తమిళనాడు ముఖ్యమంత్రికి నోటీసులు

Published Mon, Feb 27 2017 4:05 PM

తమిళనాడు ముఖ్యమంత్రికి నోటీసులు - Sakshi

చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షపై ప్రతిపక్ష డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సహా, హోంసెక్రటరీ, అసెంబ్లీ స్పీకర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్చి 10లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్‌ జి.రమేష్‌, మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం  ఆదేశించింది. కాగా ఈ నెల 18న అసెంబ్లీలో జరిగిన  విశ్వాస పరీక్ష సందర్భంగా శాసనసభ నియమాలను అనుసరించి జరగలేదని పేర్కొంటూ డీఎంకే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

బల పరీక్షలో భాగంగా రహస్య ఓటింగ్‌ను కోరినా స్పీకర్‌ ధన్‌పాల్‌ పట్టించుకోకుండా తమను సభ నుంచి బయటకు గెంటేశారని, ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభలో జరిగిన విశ్వాస పరీక్ష ఏ రకంగానూ చెల్లదంటూ తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. మరోవైపు బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఇప్పటికే తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు నివేదిక కోరారు. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.

Advertisement
Advertisement