హై అలెర్ట్! | Sakshi
Sakshi News home page

హై అలెర్ట్!

Published Wed, Aug 13 2014 11:39 PM

హై అలెర్ట్!

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల విచ్ఛిన్నానికి పాకిస్థాన్ ముష్కరులు కుట్ర పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. విమానాల హైజాక్ లక్ష్యంగా వ్యూహరచనలు జరిగినట్లు సమాచారం అందించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్ని నిఘా నీడలోకి తెచ్చారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రతా విధుల్లో లక్షా 20 వేల మంది పోలీసులు నిమగ్నమయ్యారు.
 
 సాక్షి, చెన్నై:రాష్ట్ర రాజధాని నగరం చెన్నై తీవ్ర వాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తోంది. అయితే ఇటీవల హిందూ సంఘాల నాయకుల్ని టార్గెట్‌చేసి హత్యల పరంపర కొనసాగుతోంది. ఈ కేసుల్లో పట్టుబడ్డ వారందరూ అజ్ఞాత తీవ్ర వాదులు కావడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. సెంట్రల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న బాంబు పేలుడు కేసు ఇంత వరకు కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో మరింత మంది అజ్ఞాత తీవ్ర వాదులు నక్కి ఉన్నారన్న ఆందోళన నెలకొంది. ఇటీవల వెలుగు చూస్తున్న పరిణామాలు, ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల కేసులు రాష్ట్రం చుట్టూ తిరుగుతున్నాయి. భద్రత ప్రశ్నార్థకంగా మారింది. విదేశాల నుంచి నకిలీ వీసాలతో, నకిలీ పాస్‌పోర్టులతో చెన్నైకు వచ్చి పట్టుబడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దొంగ నోట్ల చెలామణి, బంగారం స్మగ్లింగ్  జోరందుకుంది. దీన్నిబట్టి చూస్తే అసాంఘిక శక్తులకు అడ్డాగా రాష్ట్రం మారిందా..?  చాప కింద నీరులా సంఘ విద్రోహ శక్తులు కార్యకలాపాల్ని సాగిస్తున్నారా..? అన్న ప్రశ్న బయలు దేరింది.
 
 విచ్చిన్నానికి కుట్ర
  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న వేళ వరుస బాంబు బూచీలు పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని టార్గెట్ చేసినట్టుగా గత వారం కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా విమానాల హైజాక్ లక్ష్యంగా వ్యూహ రచన జరిగినట్టు కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. దీంతో అన్ని విమానాశ్రయాల్ని భద్రతా వలయంలోకి తెచ్చారు. ఇది వరకే చెన్నై తీవ్ర వాదుల హిట్ లిస్టులో ఉండగా, ప్రస్తుతం మదురై కూడా ఆ జాబితాలో చేరడంతో నిఘాను కట్టుదిట్టం చేశారు. బుధవారం ఆయా జిల్లాల ఎస్పీలకు, నగరాల కమిషనర్లకు డీజీపీ రామానుజం ఆదేశాలు జారీ చేశారు.
 
 రాష్ట్రంలోని చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్, సేలం విమానాశ్రయాల్లో, ఆనగరాల్లో భద్రతను పటిష్టం చేశారు. రాష్ట్రంలో ఇటీవల నిషేధిత అల్‌ఉమా, సిమి కార్యకలాపాలు సైతం వెలుగులోకి వచ్చిన దృష్ట్యా, ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా  రైల్వే స్టేషన్లు, బస్టాండులు, ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో భద్రతను పెంచారు. ఆయా నగరాల సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 20 వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో బీజీబిజీగా మారారు. చెన్నైలో 22 వేల మంది భద్రతా విధుల్లో ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండాను సీఎం జయలలిత సచివాలయంలో ఎగుర వేస్తున్నా, అక్కడి నుంచి మెరీనా తీరం వరకు ప్రత్యేక వేడుకలు జరగడం ఆనవాయితీ. ఈ దృష్ట్యా, ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాల రాక పోకల ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
 

Advertisement
Advertisement