ప్రశ్నిస్తే..ఆందోళనా? | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే..ఆందోళనా?

Published Sat, Jul 8 2017 4:30 AM

ప్రశ్నిస్తే..ఆందోళనా? - Sakshi

ఉపాధ్యాయుల తీరుపై హైకోర్టు
ప్రభుత్వ టీచర్లు విధులకే రారు
ఇంకెక్కడ విద్యా ప్రమాణాలు

సాక్షి, చెన్నై: ప్రశ్నిస్తే తమకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తారా అంటూ ఉపాధ్యాయుల తీరుపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కారని, అలాంటప్పుడు విద్యా ప్రమాణాల మెరుగు ఎలా సాధ్యం అవుతుందని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ సహకారంతో సాగే, ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం తరగతులకు నాలుగేళ్ల క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, తంజావూరు పందనల్లూరులోని ప్రభుత్వ సహకారంతో సాగే పాఠశాలలో ఇంగ్లిషు తరగతుల నిర్వాకం కోర్టుకు చేరింది. రెండు రోజుల క్రితం ఈ పిటిషన్‌ విచారణకు రాగా, న్యాయమూర్తి కృపాకరణ్‌ తీవ్రంగానే స్పందించారు. ప్రశ్నలతో ప్రభుత్వాన్ని, ఉపాధ్యాయుల్ని ఉక్కిరి బిక్కిరి చేశారు.

ఇంగ్లిషు తరగతుల గురించి, ఆంగ్ల బోధనలు, శిక్షణ పొందిన విద్యార్థులు, ఉపాధ్యాయుల తీరు, తమిళం బోధించే  ఉపాధ్యాయుల చేత ఆంగ్ల బోధన, ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు. అర్హతలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం బోధనలో వెనకపడేందుకు గల కారణాలు ఇలా అనేక రకాల ప్రశ్నలు అడిగి ఆయన  ఈనెల 17లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే, కోర్టు తమను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఉపాధ్యాయ సంఘాల్లో ఆగ్రహం రేగింది. కోర్టు తీరును నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వడం వివాదానికి దారి తీసింది. శుక్రవారం ఓ పిటిషన్‌ విచారణ సమయంలో కృపాకరణ్‌ తీవ్రంగానే స్పందించడం గమనార్హం.

ప్రశ్నిస్తే...ఆందోళన: కోర్టు ఏదేని ప్రశ్నించినా, అక్షింతలు వేసినా...ఆందోళనలకు దిగే వారు పుటుకొస్తున్నట్టుందని తీవ్రంగా మండిపడ్డారు. తమకే బెదిరింపులు ఇచ్చే రీతిలో ఆందోళనకు పిలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కారని, ఈ విషయంగా తనకు ఎన్నో ఫిర్యాదులు వచ్చినట్టు వివరించారు. 165 పనిదినాల్లో కేవలం 65 దినాలు మాత్రమే విధులకు వస్తున్నారని , జీతాలు మాత్రం బాగానే ఆర్జిస్తున్నారని, ఇలాంటి వారికి ఎలా తిన్నది జీర్ణం అవుతుందంటూ, అందుకే ఆందోళనలు సాగిస్తున్నట్టుందని విరుచుకుపడ్డారు.

కొన్ని చోట్ల ఒక విద్యార్థికి ఇద్దరు ఉపాధ్యాయులు, మరో ఇద్దరు సిబ్బంది...పరిస్థితి ఇలా ఉంటే, ఎలా విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయని ప్రశ్నించారు. ఇక, తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పుడే సెల్‌ఫోన్‌లను ఇచ్చేస్తున్నారని విమర్శించారు. ఇక, పిల్లలు ఎలా చదువుల మీద దృష్టి పెడతారని ప్రశ్నించారు. ఎనిమిదో తరగతి వరకు ఆల్‌పాస్‌ నినాదం ఉండడంతో, తొమ్మిదో తరగతిలోకి అడుగుపెట్టగానే విద్యార్థిబుర్రలో అన్ని సబ్జెక్టులను దూర్చాల్సింతగా విద్యా పరిస్థితులు ఉన్నాయని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే...ఆందోళనలు అంటూ ముందుకు సాగితే, ఉపాధ్యాయుల్ని కోర్టు మెట్లు ఎక్కించాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement