నగరం అణువణువునా భద్రతా సిబ్బంది | Sakshi
Sakshi News home page

నగరం అణువణువునా భద్రతా సిబ్బంది

Published Sat, Feb 7 2015 2:00 AM

నగరం అణువణువునా భద్రతా సిబ్బంది - Sakshi

పెరిగిన సమస్యాత్మక బూత్‌ల సంఖ్య
 
న్యూఢిల్లీ: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం నగరం అణువణువునా భద్రతా సిబ్బందిని మోహరించింది. ఓటర్లు ఆయా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన సమయంలో వారు ధన, మద్య ప్రభావానికి లోనుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈసారి సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల సంఖ్య 107మేర అదనంగా పెరిగిన నేపథ్యంలో జాతీయ రాజధాని నగరంలో విధుల్లో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు భద్రతా సిబ్బంది సంఖ్యను కూడా పెంచారు. 2013 నాటి ఎన్నికల సమయంలో వీటి సంఖ్య 634 కాగా ఈసారి ఇది 741కి చేరుకుంది. వీటిలో 191 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా సంబంధిత అధికారులు గుర్తించారు.

 ఈ విషయమై ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి చంద్రభూషణ్‌కుమార్ మాట్లాడుతూ ‘గత ఎన్నికల సమయంలో మొత్తం 64 వేలమంది పోలీసులు భ ద్రతా విధుల్లో పాలుపంచుకున్నారు. అయితే ఈసారి వారి సంఖ్య ఎంత అనేది నాకు సరిగ్గా తెలియదు. పోలీసు సిబ్బంది ఎంతమంది భద్రతా విధుల్లో పాల్గొంటారనే విషయాన్ని ఈసారి చెప్పే పరిస్థితుల్లో మేము లేము. అయితే గత ఎన్నికలతో పోలిస్తే పెరిగి ఉండొచ్చని అనుకుంటున్నాం’ అని అన్నారు.

నేరస్తులపై నిఘా

ఎన్నికల నిర్వహణ విషయమై పోలీసు అధికారి ఒక రు మాట్లాడుతూ నేరస్తులతోపాటు గూండాలపైనా కన్నేసింది. నగరానికి అక్రమ మార్గాల మద్యం రాకుండా అడ్డుకునేందుకుగాను సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్దకూడా అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఘజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్, నోయిడా తదితర ప్రాంతాలనుంచి నగరానికి రాకపోకలు సాగించేవారిపైనా దృష్టి సారించామని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చంఢీగఢ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ అధికారులతో కలసి పనిచేస్తున్నామన్నారు.
 
పారామిలిటరీ  బలగాలూ రంగంలోకి...

న్యూఢిల్లీ: ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేందుకు 55 వేల మంది మంది పోలీసులు, పారామిలిటరీ దళాలను రంగంలోకి దించినట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్.బస్సీ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘రోడ్లు, పోలింగ్ కేంద్రాల వద్ద 55వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారు. సీఆర్పీఎఫ్ నుంచి అదనపు సహాయం తీసుకున్నాం. రిటర్నింగ్ అధికారులు, వేర్వేరు శాఖల నుంచి ఇతర అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తారు. కంట్రోల్ రూం నుంచి ఒక ప్రత్యేక కమిషనర్‌తో పాటు ఒక బృందం వివిధ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తుంది.’ అని ఆయన వివరించారు.
 
ఎప్పటికప్పుడు సమీక్ష

ఎన్నికల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు నగరంలో భద్రతా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన వాటి వద్ద రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేశారు. దీంతోపాటు మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటుచేశారు. ఇంకా నగరంలోని అనేక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు.
 

Advertisement
Advertisement