రీ పోస్టు రీ పోస్టుమార్టం | Sakshi
Sakshi News home page

రీ పోస్టు రీ పోస్టుమార్టం

Published Sun, Apr 19 2015 3:15 AM

Hyderabad High Court Orders Re-postmortem Of Victim

వేలూరు:  శేషాచలం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో కణ్ణమంగళం ప్రాంతానికి చెందిన మునస్వామి, మూర్తి, మహేంద్రన్, పెరుమాల్, శశికుమార్, మురుగన్ ఉన్నారు. ఈ ఆరు మృత దేహాలకు రీ పోస్టు మార్టం నిర్వహించాలని బాధిత కుటుం బాలు డిమాండ్ చేశాయి. మృతుడు శశికుమార్ భార్య మునియమ్మాల్ మద్రాసు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో ఆరు మృత దేహాలను తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రిలో భద్ర పరచాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో పాటు రీ పోస్టుమార్టంపై ఆంధ్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా లేక గాంధీ ఆస్పత్రి ైవె ద్య నిపుణుల బృందంతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని శుక్రవారం సాయంత్రం హైకోర్టు తీర్పునిచ్చింది. అదే విధంగా రీ పోస్టు మార్టం రిపోర్టును ఈనెల 20లోపు సమర్పించాలని ఆదేశించింది.
 
 డాక్టర్‌ల బృందం రాక
 రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆంధ్ర రాష్ర్టం నుంచి డాక్టర్‌ల బృందం చెన్నై విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి కారులో తిరువణ్ణామలై చేరుకున్నారు. అప్పటికే తిరువణ్ణామలై ఆస్పత్రిలోని ఆరు మృత దేహాలను రీ పోస్టు మార్టం కోసం కలెక్టర్ జ్ఞానశేఖరన్ అధ్యక్షతన సిద్ధం చేసి ఉంచారు. రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లు ధర్‌బుద్దీన్ ఖాన్, అబిజిత్ గుప్తార్, రమణ మూర్తిని చెన్నై విమానాశ్రయం నుంచి పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ తిరువణ్ణామలైకి తీసుకొచ్చారు.
 
  ఇంతకు ముందు తిరుపతిలో ఆరు మృత దేహాలకు పోస్టు మార్టం నిర్వహించిన తిరుపతికి చెందిన డాక్టర్లు ఇంద్రాణి, రామ్మోహన్, ఎస్ ఎన్‌రావు, సాయి ప్రసాద్, భాస్కర్, నాగరాజు, దుర్గాప్రసాద్, పి ఆర్ జి మోహన్‌తో పాటు మొత్తం 12 మంది డాక్టర్‌ల బృందం కూడా తిరువణ్ణామలై చేరుకుంది. వీరిని  తిరువణ్ణామలై జిల్లా సరిహద్దు నుంచి పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ డాక్టర్‌ల బృందం ప్రభుత్యాసుపత్రిలో ఉన్న ఆరు మృత దేహాల వద్దకు వెళ్లి రీ పోస్టుమార్టం నిర్వహించింది. దీన్ని వీడియోలో చిత్రీకరించారు. తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లతోపాటు ఎవరినీ లోనికి అనుమతించలేదు.  
 
 రీ పోస్టుమార్టం పూర్తి
 తిరువణ్ణామలై ప్రభుత్వాస్పత్రిలో రీ పోస్టుమార్టం ప్రక్రియ శనివారం రాత్రి 7.30 గంటలకు ముగిసింది. రాత్రి 8 గంటల తరువాత సంబంధిత కుటుం బ సభ్యుల సంతకాలు తీసుకుని కలెక్టర్ సమక్షంలో మృతదేహాలను వారికి అప్పగించారు. ఆస్పత్రి పరిసరాల్లో పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
 
 పటిష్ట పోలీస్ బందోబస్తు
 తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రి శనివారం ఉదయం నుంచి పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్లింది. అదే విధంగా మార్చురీ వద్ద సుమారు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుల బంధువులను ఎవరినీ లోనికి అనుమతించలేదు.
 
  పది రోజులు భద్ర పరిచిన మృతదేహాలు
 తిరుపతిలోని అడవిలో కూలీలపై ఎన్‌కౌంటర్ ఈనెల 7న జరిగితే, మృతదేహాలను 9వ తేదీన ప్రభుత్వ ఆస్పత్రిలో భద్ర పరిచారు. పది రోజుల పాటు ఆస్పత్రిలో పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు భద్ర పరిచారు. ఈ మృత దేహాలను చెన్నైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మృత దేహాలను చెన్నైకి తీసుకెళ్లే పరిస్థితి లేనందున డాక్టర్ల బృందం తిరువణ్ణామలైలోనే రీ పోస్టుమార్టం నిర్వహించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement