కలత చెందా ! | Sakshi
Sakshi News home page

కలత చెందా !

Published Tue, Nov 10 2015 9:07 AM

కలత చెందా !

కోలారు: అంటరానితనం అంటే తెలియని పసి మొగ్గలు వారు... ప్రొద్భలమో, లేక చెప్పుడు మాటలో కాని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు దళిత మహిళ వంట చేస్తోందని చెప్పి వారు మధ్యాహ్న భోజనం తినకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన వంట మనిషి రాధమ్మ ఏకంగా రాష్ట్ర గవర్నర్‌కు ‘దయా మరణం’ (మెర్సి కిల్లింగ్) కోరుతూ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. దీంతో ఆగమేఘాలపై అధికార యంత్రాంగం అక్కడికి చేరుకుని పరిస్థితి సరిదిద్దారు.
 
వివరాలు...  జిల్లాలోని ముళబాగిలు తాలూకా నంగలి ఫిర్కా కగ్గనహళ్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దళిత మహిళ రాధమ్మ  కొంతకాలంగా వంట మనిషిగా పనిచేస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా దళిత మహిళ అనే నెపంతో పాఠశాలలో చదువుతున్న 18 మంది విద్యార్థులు ఆమె వండిన భోజనం చేయడానికి నిరాకరించారు. దాంతో మనస్థాపానికి గురైన దళిత మహిళ రాధమ్మ తనకు దయా మరణం కోరుతూ గవర్నర్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం సోమవారం హుటాహుటిన కగ్గనహళ్లి గ్రామానికి చేరుకుంది. బెంగుళూరు సీఆర్‌ఓ సెల్ అదనపు పోలీస్ ఏడీజీపీ భాస్కర్‌రావ్ గ్రామానికి వెళ్లి స్వయంగా పరిశీలన జరిపారు.
 
మధ్యాహ్నం వేళకు గ్రామానికి చేరుకున్న ఏడీజీపీ భాస్కర్ రావ్ తొలుత పాఠశాల సిబ్బంది. గ్రామస్తుల కలిసి సమావేశమై చర్చలు జరిపారు. గ్రామంలో ఇలాంటి అంటరానితనం పద్దతి పోవాలని గ్రామస్తులు, విద్యార్థులకు నచ్చచెప్పారు. అంతే కాకుండా మధ్యాహ్న భోజనాన్ని అధికారులు, విద్యార్థులతో కలిసి వంటమనిషి రాధమ్మ వండిన వంటకాలతో భోజనం చేశారు.
 
అనంతరం మాట్లాడుతూ... చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పిల్లల లేత హృదయాలలో ఇలాంటి భావాలు రాకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త పడాలని సూచించా రు. పాఠశాల అధ్యక్షుడు సురేష్, ప్రధానోపాధ్యాయుడు వెంకటా చలపతితో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరోమారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరస్పర వైషమ్యాల వల్ల దేనిని సాధించడానికి సాధ్యం కాదన్నారు
 
గతంలోనే వివాదం :
గ్రామంలోని పాఠశాలలో గతంలో దళిత మహిళ వంట చేయడానికి నియమించడంపై వివాదం చెలరేగింది. అపట్లో దళితులను బహిష్కరించారనే ఆరోపణలపై గ్రామానికి చెంది కొంతమంది అరెస్టయ్యారు. దళిత మహిళ రాధమ్మ పాఠశాలలో వంట చేయడానికి అర్జీ వేయడానికి కూడా నిరాకరించారనే ఆరోపణలు వినిపించాయి. అప్పటి కలెక్టర్ డీకే రవి స్వయం గా గ్రామానికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్ది వచ్చారు. దళిత మహిళ రాధమ్మను వంట మనిషిగా నియమించడానికి అనుమతించారు. పాత కక్షల నేపథ్యంలో మళ్లీ ఇలా జరుగుతోందని గ్రామంలోని పలువరు దళితులు ఆరోపిస్తున్నారు.
 
ప్రస్తుత విద్యా సంవత్సరంలో 126 మంది పిల్లలకు 108 మంది పిల్లలు టీసీలు తీసుకుని వేరే పాఠశాలల్లో చేరారు. ప్రస్తుతం 18 మంది పిల్లలు మాత్రమే ఉండి వీరు కూడా రాధమ్మ చేస్తున్న వంటలు తినడం లేదని ఆరోపణ. 18 మంది పిల్లలలో ఓబీసీ వారు 3, ఎస్‌టీ 1 మిగిలిన వారందరూ ఎస్‌సీ సముదాయానికి చెందిన వారే కావడం విశేషం. గ్రామాన్ని సందర్శించిన వారిలో కోలారు ఎస్పీ అజయ్‌హిలోరి, బీఈఓ దేవరాజ్, అధికారులు కణ్ణయ్య, వి లక్ష్మయ్య, ఆర్డీవో మంజునాథ్, డీఎస్‌పీ అబ్దుల్ రెహమాన్ తదితరులు ఉన్నారు.       

Advertisement
Advertisement