రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర వేడుకలు | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర వేడుకలు

Published Tue, Aug 16 2016 1:34 AM

రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర వేడుకలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశ 70 స్వాతంత్య్ర దినోత్సవ వేడుక లు రాజ్‌భవన్‌లో సోమవారం ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా గవర్నర్ కొణిజేటి రోశయ్య వివిధ రంగాల ప్రముఖులను కలుసుకున్నారు. త్రివిధ దళాధిపతులు, అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. అలాగే నగరంలోని తెలుగు ప్రముఖులు సైతం రోశయ్యను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, ఇతర ప్రముఖులు తమకు కేటాయించిన స్థలాల్లో ఆశీనులై ఉండగా ఉదయం 11 గంటల సమయంలో గవర్నర్ రోశయ్య ప్రముఖుల ముందుకు వచ్చారు.
 
 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు సైతం గవర్నర్ సరసన ఆశీనులుకాగా ప్రముఖులంతా వరుసగా వచ్చి గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా పలకరించారు. గవర్నర్ సైతం అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చిరునవ్వుతో పలకరించారు. అనంతరం రాజ్‌భవన్ ప్రాగంణంలోని వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన గవర్నర్ రోశయ్య ప్రదర్శనలు చేసిన కళాకారులను సత్కరించారు. వేడుకలకు హాజరైన ప్రముఖులకు గవర్నర్ విందునిచ్చారు. రాజ్‌భవన్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జయలలిత హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
 
 తెలుగు ప్రముఖులు : రాజ్‌భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నగరంలోని తెలుగు ప్రముఖులు హాజరై గవర్నర్ కే రోశయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కా సంయుక్త కార్యదర్శి, ప్రముఖ ఆడిటర్ జేకే రెడ్డి, అస్కా మేనేజింగ్ ట్రస్టీ ‘అజంతా’ శంకరరావు, ట్రస్టీ కార్యదర్శి స్వర్ణలతారెడ్డి, ఆస్కా సీనియర్ సభ్యులు ఎరుకలయ్య, మదనగోపాల్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్‌కుమార్ రెడ్డి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ, దక్షిణ భారత వైశ్య సంఘం అధ్యక్షులు ఎంవీ నారాయణ గుప్తా, ద్రవిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు, చెన్నైపురి ట్రస్ట్ అధికార ప్రతినిధి పొన్నూరు రంగనాయకులు, ఏఐటీఎఫ్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి, న్యూటెక్ కనస్ట్రక్షన్స్ అధినేత నాగిరెడ్డి, టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయల్, వైశ్య ప్రముఖులు త్రినాధ్ తదితరులు హాజరైనవారిలో ఉన్నారు.
 
 అమ్మ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం :  వివిధ రంగాల్లో విశేష ప్రజ్ఞ కనబరిచిన, సేవలు అందించిన వారికి ముఖ్యమంత్రి జయలలిత వివిధ ప్రముఖుల పేర్లతో అవార్డులను ప్రదానం చేశారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వీరందరినీ ఆహ్వానించి అవార్డులను అందజేశారు. చెన్నైలోని కేంద్ర చర్మపరిశోధక సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ షణ్ముగంకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అవార్డు కింద రూ.5 లక్షల చెక్కు, 8 గ్రాముల బంగారుపతకం, ప్రశంసాపత్రం అందజేశారు. నామక్కల్‌కు చెందిన జయంతికి వ్యోమగామి దివంగత కల్పనాచావ్లా అవార్డు కింద రూ.5 లక్షల చెక్కు, రూ.5వేల విలువైన బంగారు పతకం, ప్రశంసాపత్రం బహూకరించారు.
 
 మహామహం ఉత్సవాల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించినందుకు ప్రశంసగా తంజావూరు జిల్లా అప్పటి కలెక్టర్ సుబ్బయ్యన్, పోలీస్ సూపరింటెండెంట్ మయిల్‌వాహనన్ రూ.2లక్షల చెక్కును అందుకున్నారు. గ్రామీణ పారిశుధ్య బహుమతిగా రూ.2 లక్షల చెక్కును మంత్రి ఎస్పీ వేలుమణి, ఆ శాఖ కార్యదర్శి, డెరైక్టర్ అందుకున్నారు. ఆన్‌లైన్‌లో సేవలపై రెవెన్యూ మంత్రి ఉదయకుమార్ అవార్డు అందుకున్నారు. దైవాంగుల సంక్షేమానికి విశేషంగా పాటుపడిన డాక్టర్ రాజా కన్నన్ రూ.10 గ్రాముల బంగారుపతకం, ప్రశంసాపత్రం పొందారు. ఉత్తమ సామాజిక కార్యకర్తగా ఎంపీ మహమ్మద్ రబీక్ అవార్డును పొందారు.
 
 ఉత్తమ స్థానిక సంస్థలు : రాష్ట్రంలో పలు స్థానిక సంస్థలు ముఖ్యమంత్రి అ వార్డును అందుకున్నాయి. రూ.25 లక్షల చెక్కు, ప్రశంసాపత్రంతో దిండుగల్లు కార్పొరేషన్ ఉత్తమ అవార్డును అందుకుంది. మునిసిపాలిటీల్లో ప్రథమ బహుమతి పట్టుకోట్టై (రూ.15లక్షలు) రెండో బహుమతి పెరంబలూరుకు (రూ.10లక్షలు), మూడో బహుమతి  రామనాధపురంకు (రూ.5లక్షలు) దక్కింది. ఉత్తమ పంచాయితీగా పరమత్తివేలూరు (రూ.10లక్షలు), ద్వితీయ బహుమతి చిన్నసేలం (రూ.5లక్షలు), మూడవ బహుమతి పెరియనాయకన్నపాళయం (రూ.3లక్షలు) అందుకున్నాయి. ఉత్తమ సహకార బ్యాంకు అవార్డును సేలం కేంద్ర స హకార బ్యాంకు సాధించుకుంది. స్వా తంత్య్ర దినోత్సవం సందర్భంగా దైవాగులైన చిన్నారులకు సీఎం జయలలిత మిఠాయిలు పంచిపెట్టారు. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం సహపంక్తి భోజనం చేశారు.  
 
 

Advertisement
Advertisement