‘కామన్వెల్త్’కు దూరం! | Sakshi
Sakshi News home page

‘కామన్వెల్త్’కు దూరం!

Published Mon, Nov 11 2013 4:14 AM

Indian prime minister joins Commonwealth boycott

సాక్షి, చెన్నై:శ్రీలంక వేదికగా కామన్వెల్త్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలను భారత్ బహిష్కరించాల్సిందేనని తమిళాభిమాన సంఘాలు, రాజకీయ పార్టీలు పట్టుబడుతూ వస్తున్నాయి. అయితే కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ నేతృత్వంలోని అధికారుల బృం దం శ్రీలంకకు పయనమయ్యేందుకు సిద్ధమైంది. అదే సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ తన పర్యటనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు తమిళనాడులో రాజుకున్న జ్వాల, మరోవైపు కేంద్ర కేబినెట్‌లోని రాష్ట్రానికి చెందిన మంత్రుల వ్యతిరేకత మన్మోహన్‌ను సందిగ్ధంలో పడేశాయి. లోక్‌సభకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన లంక పర్యటనతో తమిళనాట కాంగ్రెస్‌కు ఎక్కడ గట్టి దెబ్బ తగులుతుందోనన్న భయం వెంటాడింది. తమిళుల మనోభావాల్ని గౌరవిస్తున్నట్లు, వారి కోసం తాము శ్రమిస్తున్నామని చాటుకునే రీతిలో చివరి క్షణంలో తన నిర్ణయాన్ని సహచరులతో మన్మోహన్ పంచుకున్నట్లు సమాచారం. 
 
 లంకకు లేనట్టే
 ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం చత్తీస్‌గడ్ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్లారు. అనంతరం శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు లేఖ రాసినట్లు సంకేతాలు వెలువడ్డాయి. కామన్వెల్త్ సమావేశాలకు తాను దూరంగా ఉండాల్సిన పరిస్థితుల్ని అందులో వివరించారు. తన ప్రతినిధిగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరవుతారని పేర్కొన్నట్లు తెలిసింది. లేఖలోని అంశాల్ని అధికార యంత్రాంగం అత్యంత గోప్యంగా ఉంచింది. ఆయన లంకకు వెళ్లనట్టేనన్న సంకేతాల్ని మాత్రం మీడియాకు పంపించడం గమనార్హం. లంక పర్యటన బహిష్కరణ నిర్ణయాన్ని మన్మోహన్ సింగ్ ముందుగానే తీసుకున్నారని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. అయితే తమిళుల మనోభావాలకు గౌరవాన్ని ఇస్తున్నామని చాటుకునేందుకే ఆలస్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇది వరకు న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ దేశాల సమావేశాలకు మన్మోహన్ సింగ్ దూరంగా ఉన్న విషయూన్ని గుర్తు చేశారు.
 

Advertisement
Advertisement