ఇంటర్ ప్రశ్నపత్రం లీక్‌పై ఆగ్రహ జ్వాల | Sakshi
Sakshi News home page

ఇంటర్ ప్రశ్నపత్రం లీక్‌పై ఆగ్రహ జ్వాల

Published Fri, Apr 1 2016 4:32 AM

ఇంటర్ ప్రశ్నపత్రం లీక్‌పై ఆగ్రహ జ్వాల - Sakshi

కోలారు : ప్రైవేట్ విద్యా సంస్థల ఒత్తిడికి తలొగ్గి ఇంటర్ ప్రశ్నపత్రాలు లీక్ చేయడాన్ని ఆగ్రహిస్తూ రైతు సంఘం పదాధికారులు గురువారం స్థానిక బస్టాండు సర్కిల్ వద్ద రాష్ట్ర విద్యాశాఖా మంత్రి కిమ్మనె రత్నాకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం పదాధికారులు మాట్లాడుతూ... ప్రశ్న పత్రాలను ముందుగానే లీక్ చేసి విద్యాశాఖ గ్రామీణ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే నారాయణగౌడ మాట్లాడుతూ... సంవత్సరం పొడవునా కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలు దీని వల్ల ప్రశ్నార్థకంలో పడిపోతుందని ఆరోపించారు. ఆందోళనలో బంగవాది నాగరాజగౌడ, ఏబీవీపీ మురళి, ఎంపీఎంసీ పుట్టరాజు, మరగల్ శ్రీనివాస్, బ్యాలహళ్లి చౌడేగౌడ, కల్వ మంజలి రాము శివణ్ణ, శంకరణ్ణ, ఎం హొసహళ్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

 విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
బాగేపల్లి : ద్వితీయ పీయూసీ రసాయన శాస్త్రం ప్రశ్నపత్రం మరోసారి లీక్ కావడంపై విద్యార్థులు ధర్నా నిర్వహించిన సంఘటన గురువారం పట్టణంలో జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఇక్కడి నేషనల్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. మార్చి 31న జరగాల్సిన ప్రశ్నపత్రం కూడా లీక్ కావడంపై వారు మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకూడదన్నారు. తక్షణం మంత్రి రాజీనామా చేయాలన్నారు. ఎస్‌ఐ భైర ఆందోళనకారుల వద్దకు చేరుకుని వారితో మాట్లాడి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
 

Advertisement
Advertisement