నారాయణ..ఇదేమీ? | Sakshi
Sakshi News home page

నారాయణ..ఇదేమీ?

Published Tue, Oct 4 2016 6:43 AM

విద్యార్థులచే పరీక్షలు రాయిస్తున్న నారాయణ కళాశాల సిబ్బంది

– సెలవుల్లోనూ తరగతులు
– అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
– ఆర్‌ఐఓను నిలదీసిన విద్యార్థి నాయకులు
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సెలవుల్లోనూ తరగతులు నిర్వహిస్తూ నారాయణ కళాశాల యాజమాన్యం నిబంధనలకు తిలోదకాలిచ్చింది. ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని అబ్దుల్లాఖాన్‌ ఎస్టేట్, గాయత్రీ ఎస్టేట్‌లోని కళాశాలల్లో నిర్వహిస్తున్న పరీక్షలను అడ్డుకున్నారు. వెంటనే ఆర్‌ఐఓ వై.పరమేశ్వరరెడ్డికి సమాచారం ఇచ్చి ఆయన్ను రప్పించారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్‌ మహేంద్ర మాట్లాడుతూ..నిబంధనలను ఉల్లంఘించిన నారాయణ కళాశాలలను సీజ్‌ చేయాలన్నారు. సెలువుల్లోనూ తరతగతులు, పరీక్షలు నిర్వహించి విద్యార్థులపై ఒత్తిడిని పెంచి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నా ఇంటర్‌ బోర్డు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మంత్రి నారాయణ అండతో నారాయణ కళాశాలల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని, వారిని అదుపు చేసే అధికారులే కరువయ్యారని ఆరోపించారు.

నారాయణ కళాశాలల్లో ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విద్యార్థులపై కమిటీలు వేయడమే తప్ప ఒక్కదానిలో నివేదిక ఇవ్వలేదన్నారు. పరీక్షను జరపబోమని ప్రిన్సిపాళ్లతో సంతకాలు తీసుకొని విద్యార్థులకు ఇళ్లకు పంపడంతో వారు ఆందోళనను విరమించారు. అనంతరం ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ..సెలవు దినాల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే ఇంటర్‌ బోర్డుకుకళాశాల సీజ్‌కు నివేదిక ఇస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు సుమన్, గణేష్, ఎల్లయ్య, గోపీ, జయసింహ, సాయి, పవన్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
సెలవుల్లో తరగతులు నిర్వహించే కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
దసరా సెలవుల్లో  తరగతులు నిర్వహించి ప్రై వేట్, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ నగర అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్‌ఐఓ పరమేశ్వరెడ్డి ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాయకులు సునీల్, నారాయణ, ఖలీల్, శరత్‌కుమార్, సుంకన్న, భీమేష్‌ పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement