'ఆయన ఇప్పుడు పంక్చరైన టైరు' | Sakshi
Sakshi News home page

'ఆయన ఇప్పుడు పంక్చరైన టైరు'

Published Thu, Feb 2 2017 4:22 PM

'ఆయన ఇప్పుడు పంక్చరైన టైరు' - Sakshi

హైదరాబాద్‌: నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు గాలితో నిండిన టైర్లా ఉన్న ప్రధాన మంత్రి మోదీ, బడ్జెట్ తర్వాత పంక్చర్‌ అయిన టైర్ మాదిరిగా ఉన్నారని మాజీ కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ నిరర్ధకమైనది , ఏ దిశా లేనటువంటిదిగా ఉందన్నారు. నోట్లరద్దు నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజల్లో బడ్జెట్ పై ఉన్న ఆశలను కేంద్రం నీరు గార్చిందని, ప్రజలకు నిరాశ, నిస్పృహలనే మిగిల్చిందన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గుదల వల్ల కేంద్రానికి ఏటా రూ. లక్షకోట్లు ఆదా అయ్యాయి, అయినప్పటికీ బడ్జెట్ లో సామాన్యులకు ఊరట లభించలేదన్నారు.
 
ఆర్ధిక వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉందన్నారు. 70 సంవత్సరాలలో ఏనాడు ఇలాంటి నిరాశాపూరిత బడ్జెట్ చూడలేదన్నారు. కొత్త రైల్వే లైన్ లు లేవు, కొత్త పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలే వాటి సామర్ధ్యం మేరకు పనిచేయడం లేదన్నారు. నోట్లరద్దు వల్ల 6 నెలలు కష్టాలు, 3 నెలలు నష్టాలు వచ్చాయన్నారు. ఆలోచన లేని తొందరపాటుతో అహంభావి అయిన ప్రధాని తీసుకున్న వినాశక చర్యే నోట్లరద్దు అని అన్నారు.
 
దానికి మద్దతిచ్చిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి ఎం లాభం జరిగిందో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పొలిటికల్ ఫండింగ్‌లో సంస్కరణలు నామమాత్రమేనని, నల్లధనం పార్టీల ద్వారా ప్రవహించడం లేదని, రూ. 20 వేలకు బినామీలను వెతుక్కున్న పార్టీలు ఇప్పుడు రూ. 2 వేలకి కూడా వెతుక్కుంటాయని జోస్యం చెప్పారు.

Advertisement
Advertisement