కాలుదువ్వి.. రంకెలేసి.. | Sakshi
Sakshi News home page

కాలుదువ్వి.. రంకెలేసి..

Published Mon, Feb 6 2017 1:38 AM

Jallikattu held in Madurai, 37 men injured, 9 admitted to hospital

► జల్లికట్టు జోష్‌..
► పౌరుషాన్ని చాటిన క్రీడాకారులు
► 50 మందికి గాయాలు
► బహుమతులే..బహుమతులు
►అవనీయాపురం, నామక్కల్‌లలో పండుగ సందడి


సాక్షి, చెన్నై: తమిళుల సాహసక్రీడ జల్లికట్టు ఆదివారం అవనీయాపురం, నామక్కల్‌లలో వీరత్వాన్ని చాటే రీతిలో సాగింది. రంకెలు కొట్టే బసవన్నల పొగరును అణచివేసే విధంగా తమ సాహసాన్ని ప్రదర్శించి బహుమతుల్ని తన్నుకెళ్లారు. కొన్ని ఎద్దులు క్రీడాకారుల చేతికి చిక్కకుండా తమ యజమానుల్ని విజేతలుగా నిలబెట్టాయి. తమిళుల సంప్రదాయ, సాహసక్రీడగా పేరెన్నికగన్న జల్లికట్టును సంక్రాంతి పర్వదినాల్లో శతాబ్దాల తరబడి దక్షిణాది జిల్లాల్లో కోలాహలంగా జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. అయితే, జంతు ప్రేమికులు కన్నెర్ర చేయడం, సుప్రీంకోర్టు తీర్పు వెరసి రెండేళ్లు జల్లికట్టుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ ఏడాది కూడా సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టుకు దూరంగా ఉన్నా, విద్యార్థి ఉద్యమంతో జల్లికట్టుకు విధించిన నిషేధపు ముడులు తెగాయి. రాష్ట్రం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టానికి రాష్ట్రపతి ఆమోదం పడడంతో ఇక, జల్లికట్టులో రంకెలు వేస్తూ ఎద్దులు, క్రీడాకారులు వీరత్వాన్ని చాటుకునే పనిలో పడ్డారు.

వీరత్వం చాటిన జల్లికట్టు : ప్రతి ఏటా మదురై జిల్లా అవనీయాపురంలో జరిగే అధికారిక జల్లికట్టుతో సాహస క్రీడకు శ్రీకారం చుడతారు. ఆ దిశగా ఆదివారం ఉదయం ఆరు గంటలకే అవనీయాపురం జనసంద్రంలో మునిగింది. ఎటుచూసినా మదురై, శివగంగై, విరుదునగర్, దిండుగల్, తిరుచ్చి, ఈరోడ్, కరూర్, పుదుకోటై, తేని, తూత్తుకుడి, తంజావూరు జిల్లాల నుంచి వచ్చిన కొమ్ములు తిరిగిన బసవన్నలు బుసలు కొడుతూ కన్పించాయి.

తొమ్మిది వందల రిజిస్ట్రేషన్లు రాగా, అందులో ఏడు వందల యాభై ఎద్దులను వైద్య తదితర పరీక్షల అనంతరం జల్లికట్టులో రంకెలు కొట్టేందుకు అనుమతి ఇచ్చారు. ముందుగా టోకెన్లు పొందిన క్రీడాకారులను మాత్రమే క్రీడారంగంలోకి  అనుమతించారు. సరిగ్గా ఎనిమిది గంటల సమయంలో రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్, మదురై జిల్లా కలెక్టర్‌ వీరరాఘవులు జల్లికట్టును ప్రారంభించారు. తొలుత అవనీయాపురంలోన నాలుగు ఆలయాలకు చెందిన ఎద్దులను కదనరంగంలోకి దించారు. వీటి పొగరును అణచివేయడానికి క్రీడాకారులు తీవ్రంగానే ప్రయత్నించారు. తదుపరి ఒక్కో ఎద్దులను వాడి వాసల్‌ (జల్లికట్టు జరిగే ప్రవేశద్వారం) నుంచి వదలి పెట్టారు.

భద్రత నడుమ: ఎద్దులు జనంలోకి చొచ్చుకు వెళ్లకుండా , ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. వైద్యసేవలు అందుబాటులో ఉంచారు. కోర్టు ఆగ్రహానికి గురి కాని రీతిలో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. ప్రారంభోత్సవ సమయంలో క్రీడాకారుల చేత నిబంధనల్ని తప్పనిసరిగా పాటించి తీరుతామని కలెక్టర్‌ వీరరాఘవులు ప్రతిజ్ఞ చేయించారు. భద్రత ఏర్పాట్ల నడుమ మధ్యాహ్నం వరకు జల్లికట్టు సాగగా,  క్రీడా కారులు తమ పౌరుషాన్ని ప్రదర్శించారు. చిన్న  పొరబాటు వచ్చినా,  నిబంధనల్ని ఉల్లంఘించినా అట్టి క్రీడాకారుల్ని తక్షణం బయటకు పంపించేశారు.

బహుమతుల జోరు : రంకెలేస్తూ వాడి వాసల్‌ నుంచి  ఒక దాని తర్వాత మరొకటి చొప్పున రంగంలోకి దిగిన ఎద్దుల పొగరును అణచివేస్తూ క్రీడాకారులు తమ పౌరుషాన్ని చాటి బహుమతుల్ని తన్నుకెళ్లారు. గెలిచిన క్రీడాకారులకు సెల్‌ఫోన్ లు, బిందెలు, పాత్రలు, రేడియో సెట్లు, బీరువా, మంచాలు, వాషింగ్‌ మిషన్లు, ఏసీ, ఫ్యాన్లు, మిక్సీ, సైకిళ్లు, స్టీలు, వెండి పాత్రలు, మోటార్‌ సైకిళ్లతో పాటు ఆకర్షణీయమైన బహుమతుల్ని నిర్వాహకులు అందజేశారు. క్రీడాకారుల చేతికి చిక్కని  బసవన్నలు సైతం ఆకర్షణీమైన బహుమతుల్ని తన్నుకెళ్లాయి. రంకెలేసే బసవన్నలు కొన్నింటిని క్రీడాకారులు పట్టుకోగా, మరికొన్ని ఎద్దులు  క్రీడాకారులతో కలసి రంకెలేస్తూ ఉత్సాహంగా ముందుకు వెనక్కు ఉరకలేస్తూ సహకరించాయి.

వేలాదిగా తరలి వచ్చిన జనం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జల్లికట్టును ఆనందోత్సాహాలతో తిలకించారు. ఇక్కడ ఎద్దుల దాడిలో 50 మంది క్రీడాకారులతో పాటు ఓ వృద్ధుడు స్వల్పంగా గాయపడ్డారు. ఇక, నామక్కల్‌లోనూ జల్లికట్టులో బసవన్నులు దూసుకొచ్చాయి. క్రీడాకారులు వాటిని పట్టుకునేందుకు దూసుకెళ్లారు. ఇక, ఈ జల్లికట్టును అనేక మీడియా ప్రత్యక్ష ప్రసారాలు చేయడంతో ఎక్కడ చూసినా వాటిని వీక్షించే జనం ఎక్కువే. అలాగే, అవనీయాపురంలో తమకు పండుగ రోజు అన్నట్టుగా ఆనందోత్సాహాల్లో అక్కడి ప్రజలు మునిగారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement