ఐఏఎస్ల ఆక్రోశం | Sakshi
Sakshi News home page

ఐఏఎస్ల ఆక్రోశం

Published Fri, Sep 2 2016 9:21 AM

Jaya Govt at Loggerheads with IAS Officers

ఇద్దరు సస్పెన్షన్
18 మందికి వెయిటింగ్ లిస్టు
ఐపీఎస్‌లలో కూడా
సచివాలయంలో చర్చ
అసెంబ్లీకి తాకిన ఐఏఎస్‌ల ఆక్రోశం
సమాధానం కరువుతో వాకౌట్

 
 చెన్నై: జయలలిత  ప్రభుత్వ తీరుతో పలువురు ఐఏఎస్‌లలో ఆక్రోశం రగిలింది.  ఇద్దరిని సస్పెండ్ చేయడంతోపాటు 18 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచడమే కాకుండా... మరి కొందరు సీనియర్లను ప్రాధాన్యత లేని చోట నియమించినట్లు సమాచారం అందడంతో సచివాలయంలో చర్చకు దారి తీసింది.  అలాగే ఐపీఎస్ అధికారులు పలువురు ఐఏఎస్‌ల తరహాలో తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కేందుకు సిద్ధం అవుతుండడంతో వ్యవహారం కాస్తా అసెంబ్లీకి చేరింది.
 
దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన కరువు కావడంతో డీఎంకే, కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అన్నాడీఎంకే సర్కారు రెండోసారిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొందరు ఐఏఎస్‌లను పక్కన పెట్టే పనిలో పడిందని సమాచారం.  ఈ అధికారుల్లో ఎక్కువ శాతం మంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల యంత్రాంగం ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులుగా నియమించ బడ్డ వారే నని తెలిసింది. అయితే ఇదే సమస్యను పలువురు ఐపీఎస్ అధికారులు కూడా ఎదుర్కొంటున్నట్టు సమాచారం.
 
 తాజాగా సచివాలయంలో ప్రభుత్వ కక్ష సాధింపునకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు గురి అవుతున్నట్టుగా చోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చ కూడా జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ఇటీవల ఆగమేఘాలపై బదిలీ వేటు పడిన జ్ఞానదేశికన్తోపాటు ప్రజా పనుల శాఖ కార్యదర్శి యతీంధ్రనాథన్ పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే 18 మంది అధికారులకు ఎలాంటి పదవులు లేకుండా వెయింటింగ్‌ లిస్ట్ లో ఉన్నారు. మరి కొందరు సీనియర్లు ప్రాధాన్యత లేని చోట్ల తీసుకెళ్లి పడేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇది కాస్త ఐఏఎస్‌లలో ఆక్రోశాన్ని రగిల్చింది.
 
 సుమారు 35 మంది ఐఏఎస్‌లు ఏకమై.... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుతో భేటి అనంతరం ఓ నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్టు సచివాలయంలో చర్చ హోరెత్తుతున్నది. అదే విధంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఐపీఎస్ అధికారులు సైతం ఏకం అవుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐఎఎస్, ఐపీఎస్‌లో రగిలిన అసంతృప్తి జ్వాల ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో అన్న ఉత్కంఠ బయలుదేరి ఉన్నది.
 
 అదే సమయంలో ఈ వ్యవహారం గురువారం అసెంబ్లీని తాకింది. అసెంబ్లీలో ఈ విషయంగా సమాధానం రాబట్టేందుకు ప్రధాన ప్రతి పక్షం డిఎంకే, కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే, పాలకుల నుంచి స్పందన కరువు కావడంతో సభ నుంచి వాకౌట్ చేశారు.  మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ ఐఏఎస్‌ల సస్పెండ్, పక్కన పెట్టే వ్యవహారాల వెనుక కారణాల గురించి ప్రశ్నిస్తే పాలకుల వద్ద సమాధానాలు లేదని మండి పడ్డారు. అందుకే సభ నుంచి వాకౌట్ చేశామని స్టాలిన్ చెప్పారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement