‘రితీష్’ టాటా | Sakshi
Sakshi News home page

‘రితీష్’ టాటా

Published Fri, Apr 11 2014 12:56 AM

‘రితీష్’ టాటా - Sakshi

పెరంబలూరు సిట్టింగ్ ఎంపీ జేకే రితీష్ డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరికి షాక్ ఇచ్చారు. చావో రేవో అన్న వెంటే అని వీరోచిత ప్రగల్బాలు పలుకుతూ వచ్చిన రితీష్ హఠాత్తుగా అళగిరికి టాటా చెప్పి, అన్నాడీఎంకే తీర్థం పుచ్చేసుకున్నారు. గురువారం అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత సమక్షంలో ఆ పార్టీ కండువా భుజాన వేసుకున్నారు.
 
 సాక్షి, చెన్నై: నటుడిగా జీకే రితీష్ తమిళనాట ప్రజ లకు పరిచయం. అయితే, గత లోక్‌సభ ఎన్నికల ముందు అనూహ్యంగా రాజకీయ తెర మీదకు రితీష్ వచ్చారు. అప్పట్లో దక్షిణాది జిల్లాల డీఎంకే కింగ్ మేకర్‌గా ఉన్న అళగిరిని తన నేత అని ప్రకటించుకున్నారు. అళగిరి మద్దతుదారుడిగా, విశ్వాస పాత్రుడిగా మెలుగుతూ వచ్చిన రితీష్‌కు పెరంబలూరు లోక్‌సభ సీటు దక్కింది. తన మద్దతుదారుడిని అళగిరి గెలిపిం చుకున్నారు.
 
  పార్లమెంట్‌కు వెళ్లినా సరే, ఏదేని కార్యక్రమాలకు వెళ్లినా సరే అళగిరి వెన్నంటి రితీష్ ఉండే వారు. ఇటీవలడీఎంకే నుంచి అళగిరి బహిష్కరణ వేటుకు గురైనా తగ్గలేదు. తన నేత అళగిరి అని, అన్న ఏది చెబితే అది చేయడం తన కర్తవ్యమంటూ ప్రకటించారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే, దాన్ని తప్పకుండా పాటిస్తానంటూ స్పష్టం చేశారు.
 
 రితీష్‌కు చెక్: డీఎంకే నాయకులెవ్వరు అళగిరితో మాట్లాడ కూడదని, ఆయన వెంట నడవకూడదంటూ అధిష్టానం హెచ్చరించినా, రితీష్, మరో నటుడు, కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ మాత్రం ఖాతరు చేయలేదు. ఏకంగా అళగిరికి అనుకూలంగా వ్యవహరిస్తూ, అధిష్టానానికి వ్యతిరేకంగా వాయిస్ ఇచ్చారు. దీంతో రితీష్, నెపోలియన్‌లకు డీఎంకే అధిష్టానం చెక్‌పెట్టింది.
 
 ఆ ఇద్దరికీ సీట్లు ఇవ్వలేదు. దీంతో తన మద్దతుదారులకు సీట్లు ఇవ్వలేదన్న ఆగ్రహంతో అళగిరి డీఎంకే అభ్యర్థులపై మాటల దాడికి దిగుతూ వచ్చారు. తమకు అండగా అళగిరి ఉన్నారన్న ఆనందం ఓ వైపు ఉన్నా, రాజకీయంగా దెబ్బ తింటున్నామనే వేదన రితీష్‌లో మాత్రం పెరిగిపోరుుంది. ఈ పరిస్థితుల్లో తాజాగా డీఎంకేలో సంధియత్నా లు ఆరంభం కావడం, అళగిరి స్వరం మారడం   రితీష్‌లో ఆగ్రహాన్ని తెప్పించినట్టుంది. ఆయ న్ను నమ్ముకోవడం కన్నా, టాటా చెప్పేసి అన్నాడీఎంకేలోకి జంప్ అయ్యేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు చేసుకున్నట్టున్నారు.
 
 అన్నాడీఎంకేలోకి: తన ప్రయత్నాలకు పోయేస్ గార్డెన్ తలుపులు తెరచుకోవడంతో రితీష్ ఆనందంలో ఉబ్బి తబ్బి అయ్యారు. ఆగమేఘాలపై గురువారం ఉదయాన్నే చెన్నైకు వచ్చేశా రు. పోయేస్ గార్డెన్‌లో జయలలిత సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అన్నాడీఎంకే కండువా భుజాన వేసుకుని అళగిరికి పెద్ద షాక్ ఇచ్చారు. అళగిరిని ఉద్దేశించి విమర్శనాస్త్రాల్ని రితీష్ సంధించడం గమనార్హం. రితీష్ టాటా చెప్పడంతో నెపోలియన్ బాట ఎలా ఉండబోతోందోనన్న చర్చ డీఎంకేలో మొదలైంది.
 
 అళగిరితో ఒరిగేది శూన్యం: పోయేస్ గార్డెన్ నుంచి వెలుపలకు వచ్చిన రితీష్  డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, తన నేత అళగిరిని టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుబెట్టారు. స్టాలిన్ డీఎం కేను సర్వనాశనం చేస్తున్నారని శివాలెత్తారు. అయితే, అళగిరికి నిర్ణయాలు తీసుకోవడం చేత కాదు అని విమర్శించారు. ఏదో ఒక రోజు ఆ పార్టీ అధినేత కరుణానిధి బయటకు గెంటేసి డీఎంకేను స్టాలిన్ తన చేతిలోకి తీసుకోవడం ఖాయం అని పేర్కొన్నారు. డీఎంకేను డీఎంకే వాడే సర్వనాశనం చేస్తాడని ఒకప్పుడు దివంగత నేత అన్నా చెప్పే వారని, ఇప్పుడు అది నిజం కాబోతున్నదని జోస్యం చెప్పారు.
 
 డీఎం కేలో ఉంటూ ఆ పార్టీకి ద్రోహం తలపెట్టకూడదన్న ఉద్దేశంతోనే బయటకు వచ్చానన్నారు. అళగిరి త్వరగా నిర్ణయాలు తీసుకోలేరని, ఆయన ద్వారా ఒరిగేది శూన్యం అని విమర్శిం చారు. ఈ సందర్భంగా అళగిరి పోయేస్ గార్డెన్‌లోకి వస్తే అని మీడియా ప్రశ్నించగా, ‘‘తప్పకుండా వస్తారు... ఆయన కుమారుడి ఇల్లు పోయేస్ గార్డెన్‌లోనే ఉందిగా..?’’ అని ఎదురు ప్రశ్నతో సమాధానం ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగారు.

Advertisement
Advertisement