మీ కోసమే.. | Sakshi
Sakshi News home page

మీ కోసమే..

Published Sun, Jan 17 2016 1:46 AM

jayalalitha Ensuring flood victims

 సాక్షి, చెన్నై : వరద బాధితులకు భరోసా ఇచ్చే విధంగా ‘అమ్మ’(జయలలిత) తన సందేశాన్ని ప్రజల్లోకి పంపించారు. ప్రత్యక్షంగా బాధితుల్ని పరామర్శించకున్నా, తన జీవితం మీ కోసమేనని.., మీ కష్టాల్ని పంచుకుంటూ..., కొత్త వెలుగులు నింపుతానన్న హామీ ఇచ్చే యత్నం చేశారు. వాట్సాప్ రూపంలో అమ్మ సందేశం హల్ చల్ చేయడంతో ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. వాట్సాప్‌లో వడ కాల్చుతున్నట్టుందని డీఎంకే కోశాధికారి  స్టాలిన్ ఎద్దేవా చేశారు. కష్టం సరే...నష్టాన్ని మోస్తారా..? అని పీఎంకే నేత రాందాసు ప్రశ్నించారు.
 
 చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరుల్లో వరద ప్రళయం, మిగిలిన జిల్లాల్లో వాన కష్టాలు రాష్ట్ర ప్రజానీకాన్ని కన్నిటి మడుగులో ముంచాయి. వరద బాధితుల్ని ఆదుకునే పనిలో సర్వత్రా ఉరకలు తీస్తున్నారు. అన్ని రాజకీయ పక్షాల నాయకులు స్వయంగా బాధితుల్ని పరామర్శిస్తూ వస్తున్నారు. మంత్రులు సహాయకాల పంపిణీలో బిజీగా ఉన్నారు. బాధితుల్ని ఆదుకోవడం లక్ష్యంగా డెరైక్షన్లు ఇస్తున్న సీఎం జయలలిత స్వయంగా వారిని పరామర్శించేందుకు అడుగు తీసి బయట పెట్టలేదని చెప్పవచ్చు. ఏరియల్ సర్వేతో సరి. సీఎం తీరుపై, చెంబరంబాక్కం నీటి విడుదలపై సర్వత్రా ఆగ్రహం బయలు దేరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారి సంఖ్య పెరిగింది. ఈ సమయంలో వరద బాధితులకు తాను ఉన్నాన్న భరోసా ఇచ్చే విధంగా సీఎం జయలలిత స్పందించారు. తన సందేశాన్ని వాట్సాప్ రూపంలో ప్రజల్లోకి పంపించే యత్నం చేశారు. దీంతో ఏ మొబైల్స్‌లలో చూసినా వాట్సాప్ ద్వారా ఆమె ప్రసంగమే సాగుతున్నది.
 
 అమ్మ సందేశం :  మీ ప్రియమైన సోదరి జయలలిత మాట్లాడుతున్నట్టుగా ఆరంభం అయ్యే ఆ ప్రసంగం ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు తాను ఉన్నానని, కష్టాల్ని తాను కూడా పంచుకున్నట్టు వివరించే యత్నం చేశారు. తనకు వ్యక్తిగత జీవితం లేదు అని, కుటుంబం కూడా లేదు అని, తనకు సర్వం ప్రజలేనని వ్యాఖ్యానించారు.  స్వలాభాపేక్ష  అన్నది తనలో లేదు అని, తన తల్లిదండ్రులు పెట్టిన జయలలిత అన్న పేరును మరచి పోయే విధంగా ‘అమ్మ..అమ్మ’ అన్న ఒక్క పిలుపుతో  తన జీవితాన్ని  పూర్తిగా ప్రజల కోసం  అర్పించి ఉన్నానని వివరించారు. ప్రళయం సృష్టించిన కష్టంలో పాలు పంచుకుంటున్నానని పేర్కొంటూ,  సహాయక చర్యల్ని వేగవంతం చేసి ఉండటాన్ని  గుర్తు చేశారు. కష్టాలు తొలగి అందరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు. అయితే, ఈ వాట్సాప్ సందేశం మీద ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రజల్లోకి నేరుగా వచ్చి భరోసా ఇవ్వలేని సీఎం, ప్రజల్ని పరామర్శించ లేని సీఎం ఇప్పుడు మొసలి కన్నీళ్లుకారుస్తున్నారని మండి పడుతున్నారు.
 
 వడ కాల్చుతున్నట్టుంది : వాట్సాప్ సందేశం మీద డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తీవ్రంగానే స్పందించారు. వాట్సాప్‌లో వడ కాల్చుతున్నట్టుందని ఎద్దేవా చేశారు. తనకు కుటుంబం లేదని చెప్పుకునే ఆమెకు కోడనాడు , సిరుదావూర్లతో పాటుగా మరెన్నో కోట్ల ఆస్తులు ఎందుకో అని ప్రశ్నించారు. సినీమా డైలాగులతో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండి పడ్డారు. సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కుటుంబం వేళచ్చేరిలోని ఓ మాల్‌లో 11 సినీ స్కీన్లను వేల కోట్లకు కొన్నట్టుగా ఆధారాలతో సహా బయట పడ్డప్పుడు నోరు మెదపని ఆమె , సెంబరంబాక్కం నీటి విడుదల వ్యవహారంలో మౌనం వహించిన ఆమె, ఇప్పుడు కొత్త నాటకాన్ని రచించి ఉన్నారని మండి పడ్డారు.
 
 కష్టం సరే...నష్టం మాటేమిటో...:
 ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేసిన సీఎం, నష్టం ఊసెత్తక పోవడం విడ్డూరంగా ఉందని పీఎంకే అధినేత రాందాసు వ్యాఖ్యానించారు.  ప్రజల కష్టాల్ని మాత్రం మోసే ఆమె, నష్టాల్ని భరించేందుకు ముందుకు రాక పోవడం విచారకరంగా పేర్కొన్నారు. తనకు కుటుంబమే లేదంటూ.. పదే పదే చెప్పుకునే జయలలిత, పోయెస్ గార్డెన్ వేదికగా రాష్ట్రాన్ని శాసిస్తున్న కుటుంబం ఎవరిదో స్పష్టం చేయాలని ప్రశ్నించారు.
 

Advertisement
Advertisement