అమ్మపై కుట్ర | Sakshi
Sakshi News home page

అమ్మపై కుట్ర

Published Sun, Oct 5 2014 12:14 AM

అమ్మపై కుట్ర

చెన్నై, సాక్షి ప్రతినిధి :  రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆరోపించారు. జయకు మద్దతు తెలుపుతూ, 131 మంది ఎమ్మెల్యేలు శనివారం నిరాహారదీక్ష చేపట్టారు. అమ్మ ఫొటోతో కూడిన భారీ బ్యానర్‌ను ఉంచి చెన్నై బీచ్‌రోడ్డులోని ఎంజీ రామచంద్రన్ సమాధి వద్ద దీక్ష ప్రారంభించారు. ఎమ్మెల్యే తిరుచ్చీ మనోహరన్ నాయకత్వంలో నల్ల చొక్కాలను ధరించి వచ్చిన ఎమ్మెల్యేలతో ఉదయం 8 గంటలకు దీక్ష మొదలైంది. దీక్ష చేపట్టిన ప్రదేశం, జయలలిత తన ఇంటి నుంచి నిత్యం సచివాలయూనికి వెళ్లే మార్గం కావడంతో జయ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడారు.
 
 ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, ప్రతిపక్షానికి చెందిన నేతలు అమ్మపై లేనిపోని ఆరోపణలను గుప్పించి కేసులుపై కేసులు బనాయించారని దుయ్యబట్టారు. ప్రత్యక్షంగా పేర్లను ప్రస్తావించకుండా ప్రతిపక్ష నేతలపై విమర్శలు కురిపించారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్ల కార్డులను ప్రదర్శించారు. జయను వెంటనే విడుదల చేయాలంటూ ప్రతి ఎమ్మెల్యే అమ్మ ఫొటోతో కూడిన ప్లకార్డును చేతపట్టుకుని సాయంత్రం 5 గంటల వరకు దీక్ష నిర్వహించారు. దీక్షలో 119 మంది అన్నాడీఎంకే, 8 మంది డీఎండీకే రెబల్ ఎమ్మెల్యేలు, నలుగురు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు పెరంబూరులో మానవహారం నిర్మించారు. సుమారు వెయ్యిమంది కార్యకర్తలు పెరంబూరు ఫ్లైవోవర్ నుంచి కొలత్తూరు రెట్టేరీ వరకు సుమారు గంటపాటు జయ జయ ధ్వానాలు చేస్తూ మానవహారంగా నిలిచారు.
 
 గత నెల 27న జయ నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అన్నాడీఎంకే శ్రేణులు, వారి మద్దతు దారులు, వివిధ కార్మిక సంఘాలు, న్యాయవాదులు ఆందోళనలు సాగిస్తూనే ఉన్నారు. ఈనెల 7న అమ్మ బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుండగా, బెయిల్ మంజూరు కాగలదని విశ్వసిస్తున్నారు. బెయిల్‌పై అమ్మ బయటకు వచ్చే వరకు ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. జయకు జైలు శిక్ష పడటాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కొందరు, బలవన్మరణాలకు పాల్పడి మరి కొందరు ప్రాణాలు విడిచారు. అమ్మకోసం శనివారం వరకు 62 మంది మృతి ప్రాణాలు కోల్పోయారు.  
 

Advertisement
Advertisement