చనిపోయేవరకు అమ్మ ప్రతి నిర్ణయం వెనుకా.. | Sakshi
Sakshi News home page

చనిపోయేవరకు అమ్మ ప్రతి నిర్ణయం వెనుకా..

Published Tue, Dec 6 2016 11:52 AM

చనిపోయేవరకు అమ్మ ప్రతి నిర్ణయం వెనుకా..

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు జ్యోతిషం, సంఖ్యాశాస్త్రంపై అపారం విశ్వాసం ఉండేది. జ్యోతిష్కులను సంప్రదించనిదే ఏ నిర్ణయం కూడా తీసుకునేవారు కాదు. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని నిర్ణయాలను పంచాంగాన్ని బట్టి తీసుకునేవారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఏ పథకాన్ని ప్రారంభించినా ముందు జ్యోతిష్కులను సంప్రదించేవారు. వారి సలహాల ప్రకారం తేదీ, సమయాన్ని నిర్ణయించేవారు. ముహూర్తం సరిగాలేదని చివరి నిమిషంలో తెలియడంతో జయలలిత ఓ సారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. దీన్ని బట్టి ఆమెకు జ్యోతిషంపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. 2001లో జయలలిత తన పేరులో అదనంగా ఇంగ్లీష్‌ అక్షరం ‘ఏ’ చేర్చుకున్నారు. ఇంగ్లీషులో 11 అక్షరాలున్న (Jayalalitha) తన పేరును 12 అక్షరాలు వచ్చేలా Jayalalithaaగా మార్చుకున్నారు. జ్యోతిష్కుల సలహా ప్రకారమే జయలలిత ఈ నిర్ణయం తీసుకున్నారు. జయ జాతకం ప్రకారం ఆమెకు 5, 7 అంకెలు అనుకూలమైనవి.

చివరకు జయలలిత 5వ తేదీన (డిసెంబర్‌) తుది శ్వాస విడిచారు. ఆమె విశ్వాసాలకు తగినట్టే అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. తొలుత బుధవారం జయలలితకు అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. అయితే రేపు అష్టమి కావడం, ఆ రోజున జయలలిత ఏ శుభకార్యం కూడా చేసేవారుకానందున, ఈ రోజే అంతిమయాత్ర చేయాలని సన్నిహితులు నిర్ణయించారు. ఈ రోజు 4:30 గంటలకు మంచి ముహూర్తం వస్తుందని, ఆ సమయంలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

Advertisement
Advertisement