జయం మనదే | Sakshi
Sakshi News home page

జయం మనదే

Published Sun, Jun 19 2016 8:25 AM

జయం మనదే

  • స్థానిక ఎన్నికలపై సీఎం ధీమా
  • అన్నాడీఎంకే కార్యాలయంలో సమావేశాలు
  • కేంద్రంపై ఒత్తిడి చేస్తూ 14 తీర్మానాలు
  •  
    అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం రానున్న స్థానిక సంస్థల్లో కూడా కొనసాగడం తథ్యమని అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అదే విశ్వాసంతో గెలుపునకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
     
    చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు ముగిసి పార్టీ అధికారం చేపట్టిన తరువాత చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి శనివారం తొలిసారిగా వచ్చిన జయలలితకు పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఆరునెలలకు ఒకసారి పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు శనివారం నిర్వహించిన సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు స్వాగతం పలికారు.
     
    జయలలిత వెంట ఆమె నెచ్చెలి శశికళ వచ్చారు. ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ అధ్యక్షత వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి జయలలిత ప్రసంగించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలనే ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ శ్రేణులకు ఆమె దిశానిర్దేశం చేశారు. 2011 అసెంబ్లీ ఎన్నికలు, 2014 నాటి పార్లమెంటు ఎన్నికలు, మరలా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో  ఘనవిజయాన్ని కట్టబెట్టిన ప్రజలు అన్నాడీఎంకే పాలన పట్ల అచంచెల విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.
     
    ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయడం ద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘన విజయాన్ని అందుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే ఒంటరి పోరుతో ప్రజల మన్నలను పొందగలదని ఆమె విశ్వా సం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యవర్గ, అసెంబ్లీ సభ్యుల సమావేశాలను వేర్వేరుగా నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే వ్యూహాన్ని ఎమ్మెల్యేలకు వివరించారు. అలాగే కార్యవర్గ సమావేశంలో 14 తీర్మానాలను పార్టీ ఆమోదించారు.
     
    తీర్మానం వివరాలు ఇలా..
    గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, దుష్టశక్తులను అణిచివేస్తూ ప్రజలు తీర్పు చెప్పారు. పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిగా జయలలిత బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి అన్ని ఎన్నికల్లో అండగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ 29 అంశాలతో కూడిన విజ్ఞప్తిని ప్రధానికి సమర్పించి, తగిన హామీని సైతం పొందిన జయలలితకు అభినందనలు. కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నిధులను రాబట్టుకునేందుకు సీఎం జయలలిత ప్రయత్నం చేస్తున్నందుకు కృతజ్ఞతలు. తమిళ జాలర్ల జీవనాధారాన్ని కాపాడేందుకు రూ.1,520 కోట్లను కేంద్రం కేటాయించాలి.
     
    అంతేగాక తమిళ జాలర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నాం. అతివృష్టి, అనావృష్టి, వరదలతో రాష్ట్రానికి ముప్పు ఏర్పడకుండా, సాగునీటి జలాలు సక్రమంగా అందేందుకు తమిళనాడు, దక్షిణాది నదులను కేంద్రం అనుసంధానం చేయాలి. ముల్లైపెరియార్ జలాశయ నీటమట్టాన్ని 152 అడుగులకు పెంచుకోవచ్చని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి కేంద్రం అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న ఘనత అన్నాడీఎంకే అధినేత్రి జయలలితది మాత్రమే. తన కఠోర శ్రమతో పార్టీకి వెంట వెంటనే విజయం సాధించి పెట్టిన జయలలితకు వందనాలు తెలుపుతూ తీర్మానాలు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement