ముహూర్తం ఎప్పుడో? | Sakshi
Sakshi News home page

ముహూర్తం ఎప్పుడో?

Published Fri, May 15 2015 2:00 AM

ముహూర్తం ఎప్పుడో?

 అన్నాడీఎంకేలో ఎదురుతెన్నులు
  సీఎం చాంబర్‌కు సింగారం
  వేలాది మంది
 తలనీలాల సమర్పణ
 
 అమ్మ నిర్దోషిగా బయటపడాలన్న ఆశ నెరవేరింది, సీఎంగా చూడాలన్న కోర్కె తీరేనా, ఏడు నెలల ఎదురుచూపుల కలలు నెరవేరేనా అనే బెంగ అన్నాడీఎంకేలో అలుముకుంది. అన్నాడీఎంకే నుంచి గురువారం సైతం ఆశాజనకమైన సమాచారం వెలువడకపోవడంతో విచారంలో మునిగిపోయారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి
 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వెలువడిన తాజా తీర్పు అన్నాడీఎంకేలో ఆనందాన్ని కలుగజేసినా, అమ్మ అధికార పగ్గాలు చేపట్టేందుకు అడ్డంకులు ఎదురుకావడం హతాశులను చేసింది. తీర్పు వెలువడి నాలుగురోజులైనా పార్టీ అధికారిక ప్రకటన ఏదీ విడుదల చేయలేదు. ముఖ్యమంత్రిగా జయ ప్రమాణస్వీకార ముహూర్తం ఎప్పుడో చూచాయగా కూడా తెలియరాలేదు. శాసనసభా పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా నగరంలోనే ఉండాలని ఎమ్మెల్యేలను ఆదేశించిన పార్టీ వారందరినీ నియోజకవర్గాలకు వెళ్లిపొమ్మని చెప్పింది.
 
  ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, 20 మంది మంత్రులు బుధవారం రాత్రి జయను కలుసుకునే ప్రయత్నం ఫలించలేదు. ఈనెల 22 లేదా 23 వ తేదీన అమ్మ ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఈ విషయంపై 17వ తేదీన నిర్ణయం తీసుకుంటారని అనధికార వార్త. ఇదిలా ఉండగా, టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్, పీఎంకే అగ్రనేత రాందాస్ తదితరులు అప్పీలుపై గళం పెంచగా, జయ సీఎం కావడం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ ప్రకటించారు.
 
 ఒక వైపు అప్పీలు...మరోవైపు సింగారాలు ః
  తాజా తీర్పుపై అప్పీలు చిక్కుముడులు వీడిన తరువాతనే ముఖ్యమంత్రి పీఠం గురించి ఆలోచించాలని భావిస్తున్నట్లు అమ్మ నుండి పరోక్షంగా సంకేతాలు అందాయి. తీర్పు, అప్పీలు అంశాలపై అమ్మ తనకు సన్నిహితులైన న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అప్పీలు అంశంలో కర్నాటక వైఖరి సుప్రీం కోర్టు దిశగా అడుగులు వేస్తున్నట్లు అంచనావేస్తున్నారు. జయ సీఎం కావడంలో ఇంతటి చిక్కుముడులు పడిఉన్న తరుణంలో ప్రభుత్వం మాత్రం జయ కోసం సీఎం చాంబర్‌ను సిద్ధం చేస్తోంది. గత ఏడు నెలలుగా మూతవేసి ఉన్న సీఎం చాంబర్‌కు రంగులు వేసి మెరుగులు దిద్దుతున్నారు. చాంబర్‌లోని ఆమె టేబుల్‌పై అమర్చిన ఖరీదైన గ్రానైట్ రాయికి దోషం ఉందని, కలిసిరాలేదని కొందరు సూచించడంతో రాయిని మారుస్తున్నారు. సచివాలయంలో అమ్మ కోసం ప్రత్యేకంగా అమర్చిన లిఫ్ట్‌కు మరమ్మత్తులు, ప్రవేశం ద్వారం వద్ద సున్నాలు కొట్టిస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అమ్మ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement
Advertisement