ఉద్వాసనకు సిద్ధం | Sakshi
Sakshi News home page

ఉద్వాసనకు సిద్ధం

Published Sun, May 25 2014 11:57 PM

Karunanidhi ouster Prepare

సాక్షి, చెన్నై : పార్టీ పదవుల్లో ఏళ్ల తరబడి తిష్ట వేసిన ఉన్నవారిని సాగనంపేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధమయ్యారు. పార్టీ నాయకుల పనితీరు, లోక్‌సభ ఎన్నికల్లో వారు వ్యవహరించిన విధానాల గురించి జిల్లాల నుంచి నివేదిక తెప్పించుకున్నారు. అసెంబ్లీ ఎన్నిక ఫలితాలతో డీలాపడిన డీఎంకేను స్థానిక సంస్థల ఎన్నికలు చతికిల బడేలా చేశాయి. ఇక, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చావుదెబ్బ కొట్టాయి. ఘోర పరాజయంతో ఆందోళనలో పడ్డ డీఎంకే అధినేత ఎం కరుణానిధి అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. జూన్ రెండో తేదీ పార్టీ ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చిన కరుణానిధి జిల్లాల నుంచి నాయకుల పనితీరుపై నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు.
 
 నివేదికలు : లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ శాతం జిల్లా పార్టీ నాయకులు అమ్ముడు పోయినట్టుగా నివేదికలు తేటతెల్లం చేయడంతో కరుణానిధి ఆందోళనలో పడినట్లు సమాచారం. ఏళ్ల తరబడి జిల్లాల కార్యదర్శులగాను, అధికార ప్రతినిధులగాను, పార్టీ సర్వసభ్య సభ్యులుగానూ ఉన్న నాయకులు ఈ ఎన్నికల్లో ఓటర్ల వద్దకు వెళ్లనట్టు తేలడంతో వారందరినీ బయటకు పంపించేందుకు కసరత్తుల్లో పడ్డారు. పార్టీకి విశ్వాసంగా ఉంటూ వస్తున్న ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి రహస్యంగా కరుణానిధి నివేదికలు తెప్పించుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్ రెండో తేదీన జరిగే పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో నివేదికల్లో వెలుగు చూసిన అంశాల మేరకు ఆయా జిల్లాల నాయకులను ప్రశ్నించడం, ఆ సమావేశం వేదికగా, వారికి ఉద్వాసన పలకడం లక్ష్యంగా కరుణానిధి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
 
 మూడో తేదీన తన బర్తడేను పురస్కరించుకుని వైఎంసీ మైదానంలో జరిగే సభలో ఎవరెవరిని ఎందుకు తొలగించాల్సి వచ్చిందోనన్న వివరణ ఇచ్చేందుకు కరుణానిధి సిద్ధం అవుతోన్నట్టు పేర్కొంటున్నారు. స్టాలిన్ నేతృత్వంలో యువజన విభాగం ఈ ఎన్నికల్లో చెమటోడ్చినట్టు తేలడంతో, ఆ విభాగంలో సీనియర్లుగా ఉన్న నాయకులకు పార్టీల్లో పదవులను అప్పగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో సీనియర్లుగా, జిల్లాల పార్టీల్లో వయోభారంతో ఉన్న నాయకుల వద్ద ఉన్న పదవులను లాగేసుకుని కొత్త రక్తాన్ని నింపే విధంగా జూన్ రెండో తేదీ ఉన్నత స్థాయి సమావేశం జరగనుండడంతో ప్రక్షాళన డీఎంకేలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించనుందో వేచి చూడాల్సిందే.
 

Advertisement
Advertisement