కరూర్ విజేత ఎవరో? | Sakshi
Sakshi News home page

కరూర్ విజేత ఎవరో?

Published Fri, Apr 11 2014 12:40 AM

Karur, who is the winner?

సాక్షి, చెన్నై : బనియన్ల ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా కరూర్ బాసిల్లుతోంది. కావేరి, అమరావతి నదులను తనలో ఇముడ్చుకుని పురాతన పట్టణంగా పేరెన్నికగన్న కరూర్ నియోజకవర్గం పునర్విభజన ప్రభావంతో పెనుమార్పులను చవి చూసింది. గతంలో ఈ నియోజకవర్గం పరిధిలో అరవకురుచ్చి, కరూర్, కృష్ణరాయపురం, కుళిత్తలై, మరుంగాపురి, తొట్టియం అసెంబ్లీ స్థానాలు ఉండేవి. వీటిలో మరుంగాపురి మనపారైగా రూపాంతరం చెందింది.
 
 కుళిత్తలైను పెరంబలూరు లోక్‌సభలోకి చేర్చారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి కరూర్, దిండుగల్, తిరుచ్చి, పుదుకోట్టై జిల్లాకు చెందిన అసెంబ్లీ స్థానాలు ఉండడం విశేషం. నాలుగు జిల్లాలను తనలో ఇముడ్చుకున్న లోక్‌సభ నియోజకవర్గంగా కరూర్ పేరుగాంచింది.
 
 అసెంబ్లీ స్థానాలు
ఈ నియోజకవర్గం పరిధిలో వేడచందూర్, కరూర్, విరాళి మలై, మనప్పా రై, కృష్ణరాయపురం, అరవకురుచ్చి ఉన్నాయి. 2011 ఎన్నికల్లో వేడ చందూర్ నుంచి ఎస్ పళని స్వామి(అన్నాడీఎంకే), కరూర్ నుంచి వి సెంథిల్ బాలాజీ (అన్నాడీఎంకే), విరాళి మలై నుంచి సీ విజయభాస్కర్ (అన్నాడీఎంకే), మనప్పారై నుంచి ఆర్ చంద్రశేఖర్(అన్నాడీఎంకే), కృష్ణరాయపురం నుంచి ఎస్ కామరాజ్ (అన్నాడీఎంకే), అరవకురుచ్చి నుంచి కేసీ పళని స్వామి (డీఎంకే) అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒక్క స్థానాన్ని మాత్రం డీఎంకే దక్కించుకోగా, మిగిలి స్థానాలను అన్నాడీఎంకే కైవశం చేసుకుంది. కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీని, విరాళి మలై ఎమ్మెల్యే సి ఉదయకుమార్‌ను మంత్రి పదవులు వరించాయి.
 
 ఓటర్లు

 ఈ నియోజకవర్గం పరిధిలో 12,78,348 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,32,187 మంది పురుషులు, 6,46,132 మంది స్త్రీలు, 29 మంది ఇతరులు ఉన్నారు. గతంలో ఇక్కడ పురుషుల ఓట్లు అధికంగా ఉండేవి. తాజాగా పురుషులను స్త్రీలు అధిగమించారు. అప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో అన్నాడీఎంకే పాగా వేసింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సార్లు, అన్నాడీఎంకే 6 సార్లు విజయ ఢంకా మోగించాయి. స్వతంత్ర పార్టీ, డీఎంకేలు ఒక్కొక్కసారి మాత్రమే గెలిచాయి. గతంలో వరుస విజయూలతో దూసుకొచ్చిన కాంగ్రెస్‌కు అన్నాడీఎంకే బ్రేక్ వేసింది. అన్నాడీఎంకే వరుస విజయాలకు 2004లో డీఎంకే బ్రేక్ వేసింది. అయితే, 2009లో మళ్లీ తన గుప్పెట్లోకి ఈ స్థానాన్ని అన్నాడీఎంకే తీసుకుంది.
 
 2009 ఎన్నికల్లోకి వె ళితే...

 కూటమి ధర్మం కారణంగా ఈ స్థానాన్ని కాంగ్రెస్‌కు డీఎంకే కేటాయిస్తూ వచ్చింది. వరుస పరాజయాలను కాంగ్రెస్ చవి చూడడంతో 2004లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డీఎంకే సిద్ధం అయింది. ఈ ఎన్నికల్లో విజయం వరించడంతో మళ్లీ 2009లో ఈ స్థానం బరిలో తన అభ్యర్థిని డీఎంకే రంగంలోకి దించింది. డీఎంకే అభ్యర్థిగా మళ్లీ రేసులో నిలిచిన సిట్టింగ్ ఎంపీ కేసీ పళని స్వామికి భంగపాటు తప్పలేదు. అన్నాడీఎంకే అభ్యర్థి తంబిదురై ముందు తలొంచక తప్పలేదు. పార్లమెంట్ మెట్లు ఎక్కిన తంబి దురైని అన్నాడీఎంకే పార్లమెంటరీ నేత పదవి వరించింది.
 
 మళ్లీ అదృష్టం వరించేనా
 మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తంబి దురై సిద్ధం అయ్యారు. అయితే, పలు గ్రామాల్లో తంబిదురైకు వ్యతిరేకత ఉండడంతో విజయం కోసం చెమటోడ్చాల్సిన పరిస్థితి అన్నాడీఎంకేకు ఏర్పడింది. తంబిదురై గెలుపు బాధ్యతలను ఆ నియోజకవర్గం పరిధిలోని ఇద్దరు మంత్రులు సెంథిల్ బాలా జీ, విజయ భాస్కర్ తమ భుజాన వేసుకున్నారు.

తంబిదురై ఓడిన పక్షంలో ఎక్కడ తమ సీట్లు ఊడుతాయోనన్న బెంగతో గెలుపు లక్ష్యంగా రేయింబవళ్లు ఈ ఇద్దరు మంత్రులు శ్రమిస్తున్నారు. మళ్లీ తనకు సీటు దక్కుతుందని ఎదురు చూసిన డీఎంకే మాజీ ఎంపీ, పారిశ్రామిక వేత్త  కేసీ పళని స్వామికి చుక్కెదురైంది.
 
 ఆయనకు బదులుగా స్థానిక నేత చిన్న స్వామిని వరించింది. చిన్న స్వామి మీద కేసీ పళని స్వామి వర్గం గుర్రుమంటోంది. అయితే, అధిష్టానం ఆదేశాలతో చిన్నస్వామి గెలుపు కోసం డీఎంకే వర్గాలన్నీ ఒకే తాటి మీద సాగుతున్నారుు. తంబిదురై వైఫల్యాల్ని ఎత్తి చూపుతూ, ఆయన మీద అనేక గ్రామాల్లో ఉన్న వ్యతిరేకతను అస్త్రంగా చేసుకుని చిన్న స్వామి ప్రచారంలో దూసుకెళుతున్నారు.

ఈ ఇద్దరికీ గట్టి పోటీ ఇచ్చి తీరుతానంటూ డీఎండీకే అభ్యర్థి ఎస్‌ఎస్ కృష్ణన్ ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేల మీద నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న దృష్ట్యా, బీజేపీ కూటమిలోని తనకు ఓటర్లు పట్టం కట్టడం తథ్యమన్న ఆశాభావం లో మునిగి ఉన్నారు.
 
ఓటర్లను ఆకర్షిం చడంలో కృష్ణన్ దూసుకెళుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దల కుట్రతో కరూర్ నుంచి ఓటమి చవి చూసిన జ్యోతిమణికి లోక్‌సభ సీటు దక్కింది. తనతో మాట వరుసకైనా అడగకుండా, సీటు ఇవ్వడంతో ఆమె అసంతృప్తి తో ఉన్నారు. ఆర్థిక బలం లేని తాను ఎలా ఎన్నికలను ఎదుర్కొంటానంటూ ఏకంగా అధిష్టానాన్ని ఆమె ప్రశ్నించి ఉన్నా రు.

ఇక చేసేది లేక ఓటమి తప్పదని గ్రహించి మొక్కుబడిగా ప్రచారంలో ఆమె నిమగ్నం అయ్యారు.  కార్మిక ఓటు బ్యాంక్ ఇక్కడ ఉన్నా, సీపీఎం, సీపీఐలు మాత్రం ఎన్నికల బరిలో నిలబడేందుకు సాహసించ లేదు. ఈ దృష్ట్యా, కార్మిక ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టే పనిలో రాజకీయ పక్షాల అభ్యర్థులు ఉన్నారు. సమరం డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకేల మధ్య నెలకొన్న దృష్ట్యా, కరూర్ విజేత ఎవరో వేచి చూడాల్సిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement